రాజమండ్రి, డిసెంబర్ 3: మున్సిపల్ కమిషనర్లు తెల్లవారుజామున 5గంటలకే వార్డుల్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించాలి. తనిఖీకి వెళ్లే ముందు లాటరీ ద్వారా వార్డు నిర్ణయించాలి. ఇవీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశిస్తూ నవంబర్ 1న విడుదలైన ఉత్తర్వులు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరింత మంచి పరిపాలనను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర పురపాలకశాఖ రాష్ట్రంలోని కమిషనర్లందరికీ ఒక సర్క్యులర్ జారీచేసింది. ఆ సర్క్యులర్‌లో కమిషనర్లు తెల్లవారుజామున వార్డుల తనిఖీకి వెళ్లటం దగ్గర నుండి ప్రధానంగా నిర్వహించాల్సిన పనులను కూడా సూచించారు. కానీ ఇంతవరకు ఒక్క మున్సిపాలిటీలో కూడా ఈ ఉత్తర్వులు అమలుజరుగుతున్న దాఖలాల్లేవు. తెల్లవారుజామున 5 గంటలకే వార్డు తనిఖీకి వెళ్లాలంటే, కమిషనర్లు కనీసం 4గంటలకయినా లేవాలి. ఇలాంటి అలావాటును కమిషనర్లు మరచిపోయి చాలా కాలమయింది. గత తరం కమిషనర్లు నగరం లేదా పట్టణంలో ఉంటే కచ్చితంగా తెల్లవారుజామునే వార్డుల తనిఖీకి వెళ్లేవారు. కానీ నేటి తరం కమిషనర్లు ఇంకా అలాంటి తనిఖీలకు, తెల్లవారుజామున లేవటానికి అలవాటుపడినట్టు లేదు. అందువల్ల కమిషనర్లు సహజంగా చేయాల్సిన విధులనే, మళ్లీ ప్రత్యేకంగా ఒక సర్క్యులర్ రూపంలో రాష్ట్ర పురపాలకశాఖ జారీచేసింది. సీనియర్ కమిషనర్లయితే ఈ సర్క్యులర్‌ను చూసిన నవ్వుకుంటున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం తెల్లవారుజామున 5గంటలకు వార్డు తనిఖీకి వెళ్లే ముందు లాటరీ విధానంలో ఒక వార్డును ఎన్నుకోవాల్సి ఉంటుంది.
లాటరీలో ఎన్నికైన వార్డుకు శానిటరీ ఇనస్పెక్టర్ లేదా సూపర్‌వైజర్, టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో కలిసి తనిఖీకి వెళ్లాలి. సాధారణ పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, తాగునీటి సరఫరా, అక్రమ నిర్మాణాలు, ప్రజాసమస్యల పరిష్కారం తదితర కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. తెల్లవారుజామున 5గంటల నుండి 7గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి కమిషనర్లు విధిగా సెల్ ఫోన్ తీసుకెళ్లాలన్న ఆదేశాన్ని ప్రత్యేకంగా జారీచేశారు. ఎందుకుంటే ఏ క్షణంలోనైనా ఉన్నతాధికారులు లేదా మున్సిపల్ మంత్రి రాష్ట్రంలో ఏదో ఒక కమిషనర్‌కు ఫోన్ చేసే అవకాశం ఉందని ఆ సర్క్యులర్‌లో ఉంది. ఈ సర్క్యులర్ జారీ అయి దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఇంత వరకు ఈ సర్క్యులర్‌లోని అంశాలను అధికశాతం కమిషనర్లు అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. సర్క్యులర్‌లోని అంశాలను అమలుచేయాల్సిన వారు ఎలాగూ చేయటంలేదు. కనీసం ఉత్తర్వులు జారీచేసిన ఉన్నతాధికారులైనా అమలుచేయాలి కదా! అదీ జరుగుతున్నట్టు లేదు. ఎందుకంటే ఇంత వరకు ఒక్కసారి కూడా తెల్లవారుజామున కమిషనర్లకు ఉన్నతాధికారుల నుండి ఫోన్ వచ్చిన దాఖలాలు లేవు.
* మున్సిపల్ కమిషనర్ల వార్డుల తనిఖీదీ అదే వరస
english title:
o
Date:
Tuesday, December 4, 2012