విశాఖపట్నం, డిసెంబర్ 3: విశాఖ ఐటి ఎస్‌ఇజెడ్‌లో కంపెనీల మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో కెనగ్జా (హెచ్‌ఆర్), ఐబిఎం కంపెనీల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఐటి దిగ్గజం ఐబిఎం, కెనగ్జా కంపెనీల మధ్య రగులుతున్న వివాదం సోమవారం తీవ్ర స్థాయికి చేరుకుంది. రుషికొండ హిల్-2లో కెనగ్జా కంపెనీకి ఎపిఐఐసి సుమారు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 2006లో ఈ కంపెనీ నిర్మాణాన్ని ప్రారంభించింది. నాలుగు ఎకరాల్లో మాత్రమే కెనగ్జా భవన నిర్మాణాన్ని చేపట్టింది. మిగిలిన స్థలం అంతా ఇప్పటికీ ఖాళీగానే ఉంది. 2008లో దీనిని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కెనగ్జా యూనిట్లు ఐబిఎంలో విలీనమయ్యాయి. దీంతో విశాఖలోని యూనిట్ కూడా ఐబిఎం చేతికి వచ్చినట్టయింది. ఈ భూమిని కెనగ్జాకు ఇచ్చినప్పుడు ఎకరాకు 100 ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది. కానీ కంపెనీ 380 ఉద్యోగాలకు మించి ఇవ్వలేకపోయింది. కెనగ్జా తీసుకున్న 25 ఎకరాల్లో కేవలం నాలుగు ఎకరాలు మాత్రమే వినియోగించుకున్నారని, నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వనందున ఖాళీగా ఉన్న భూమిని వెనక్కు ఇచ్చేయమని ఎపిఐఐసి నోటీసులు పంపించింది. భూమిని తిరిగి వెనక్కు ఇవ్వకుంటే, 80 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది. కెనగ్జా ఐబిఎంలో విలీనం అయినందున, ఐబిఎం ఈ నిబంధనలకు తలొగ్గే పరిస్థితి కనిపించలేదు. తమకు నాలుగు ఎకరాలు సరిపోతుందని యాజమాన్యం పేర్కొంది. దీంతో కెనగ్జా డైరెక్టర్ కోర్టుకెక్కారు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న సమయంలో కెనగ్జా నుంచి సుమారు 21 ఎకరాల స్థలాన్ని వెనక్కు తీసుకునేందుకు ఎపిఐఐసి రంగం సిద్ధం చేసింది. ఎపిఐఐసి జోనల్ మేనేజర్ (జెడ్‌ఎం) రమణమూర్తిని వివరణ కోరగా, సదరు స్థలాన్ని చట్టపరంగా వెనక్కు తీసుకుంటున్నామన్నారు.
ఐబిఎంపై కోర్టుకెక్కిన కెనగ్జా ౄ మిగులు భూమి వెనక్కి
english title:
it
Date:
Tuesday, December 4, 2012