నిజామాబాద్, డిసెంబర్ 3: అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, స్వార్ధ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ప్రజలతో మమేకమయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పల్లెపల్లెకు యాత్రలు చేపట్టాలని నిర్దేశించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర సోమవారం వేయి కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా చంద్రబాబును అభినందించేందుకు టిడిపికి చెందిన 40మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీ సభ్యులు సాలంపాడ్‌కు తరలివచ్చారు. టిడిపికి చెందిన మోత్కుపల్లి నర్సింలు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్, ధూళిపాల నరేంద్ర, రేవంత్‌రెడ్డి, దాడి వీరభద్రారావు, జైపాల్‌యాదవ్, విజయరామారావు, కవిత, అన్నపూర్ణమ్మ, మండవ వెంకటేశ్వరరావు, హన్మంత్‌సింధే తదితరులంతా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సాలంపాడ్‌లోని కోదండరామాలయం కమ్యూనిటీ హాల్‌లో తెలుగుదేశం శాసన సభాపక్ష సమావేశం నిర్వహించి, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితుల గురించి, తెదెపా వ్యతిరేక పార్టీల వ్యవహార శైలి గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమాలోచనలు జరిపారు. తన పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో నమ్మకం పెరిగిందని, ఇదే తరహాలో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, సెగ్మెంట్ల ఇంచార్జ్‌లు పల్లెపల్లెకు పాదయాత్రలు నిర్వహించి ప్రజలతో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల కోసం ప్రకటించిన పాలసీలు, డిక్లరేషన్ల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని, రుణమాఫీపై రైతులకు భరోసా కల్పించాలన్నారు. కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు అయ్యిందంటూ వైకాపా నేతలు దుష్ప్రచారం సాగిస్తున్నారని, వాస్తవానికి ఆ పార్టీ నేతలే కాంగ్రెస్‌లో విలీనమయ్యేందుకు రాయబారాలు కొనసాగుతున్నాయని పేర్కొంటున్నందున ఎదురుదాడికి దిగాలని సూచించారు. వైఎస్ హయాంలో కొనసాగిన లక్ష కోట్ల రూపాయల దోపిడీని ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. సెంటిమెంటును అడ్డం పెట్టుకుని టిడిపిని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్న టిఆర్‌ఎస్ పార్టీ వైఖరిని కూడా ఎండగట్టాలని, పాదయాత్ర సందర్భంగా తాను తెరాసపై ఒకింత గట్టిగానే విమర్శలు చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. బాబుతో భేటీ అనంతరం టిడిఎల్పీ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి తెదెపా నేతలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మోత్కుపల్లి, ధూళిపాల నరేంద్రలు విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ప్రధానంగా కాంగ్రెస్, వైఎస్సార్‌సిపి పార్టీలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగడతామని పేర్కొన్నారు. జగన్ జైలు నుండి బయటకు వచ్చేంత వరకు అవిశ్వాసం ప్రవేశపెట్టమంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలతో వైఎస్సార్ కాంగ్రెస్ నీచ రాజకీయాలు బయటపడ్డాయని విమర్శించారు. వైఎస్సార్‌సిపిని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు మంతనాలు కొనసాగుతున్న విషయం వాస్తవమేనని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అంగీకరించారని అన్నారు.
* నిజామాబాద్ టిడిఎల్పీ సమావేశంలో నిర్ణయం
english title:
c
Date:
Tuesday, December 4, 2012