రాజమండ్రి, డిసెంబర్ 3: కొత్త విధానంలోకి ఇసుక ర్యాంపుల లీజు..తవ్వకం..అమ్మకాలు తదితర వ్యవహారాలు వచ్చాయి. బహిరంగ వేలంలో లీజులను నిర్ణయించటం వల్ల ఇసుక ధరను నియంత్రించలేని పరిస్థితుల్లో, కొత్త ఇసుక విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి విదితమే. కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయటం, ఆ ఉత్తర్వులను గెజిట్‌లో ప్రచురించటంతో అధికారులు కొత్త ఇసుక విధానాన్ని అమలు చేయటానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఇసుక వేలం, పర్మిట్ల జారీ తదితర అంశాలను పర్యవేక్షిస్తూ, ఇసుకపై పూర్తి అధికారాన్ని కలిగి ఉన్న గనులశాఖ అధికారులు, ఇసుక ర్యాంపులకు సంబంధించిన ఫైళ్లను జిల్లా వాల్టా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించే జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్‌కు అప్పగించారు. దాంతో ఇసుక ర్యాంపుల లావాదేవీలు ఇక నుండి డ్వామా పిడి కన్నుసన్నల్లోనే కొనసాగనున్నాయి. అంటే జిల్లా వాల్టా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించే జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా మిగిలిన ఇసుక వేలం, పర్మిట్ల జారీ తదితర అంశాలను డ్వామా పిడి స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.
కొత్త విధానంలోని ప్రధాన అంశం ఏమిటంటే ఇప్పటి వరకు నడుస్తున్న ఇసుక ర్యాంపులన్నీ పాత విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టి, కొత్త విధానంలోకి మారాల్సి ఉంటుంది. కొత్త ఇసుక విధానం ప్రకారం లీజుదారులు ఎవరిష్టమొచ్చినట్టు వారు అమ్మటానికి వీల్లేదు. రాష్ట్రప్రభుత్వం ఆమోదించిన స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్ల జాబితాలో ఇసుకకు నిర్ణయించిన ధర ప్రకారమే ర్యాంపుల్లో అమ్మకాలు సాగించాలి. అంటే ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం క్యూబిక్ మీటరు రూ.325కు అమ్మాల్సి ఉంటుంది. అంటే యూనిట్ ఇసుక ధర రూ.975. ప్రస్తుతం యూనిట్ ఇసుక ధర రూ.2వేలు పలుకుతోంది. అదే రెండు నెలల క్రితం యూనిట్ ఇసుక ధర రూ.5వేలు ఇస్తామన్నా లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఇసుక విధానం అమలులోకి రావటంతో ఇసుక ధర సామాన్యుడికి కూడా అందుబాటులోకి రావటంతో పాటు, ఇక నుండి లాటరీ విధానంలోనే ఇసుక ర్యాంపుల వేలం జరగనుంది. ఇప్పటికే వేలం జరిగి, లీజు ఖరారయిన ర్యాంపులను కొత్త విధానంలోకి తీసుకొచ్చినప్పటికీ, పాత లీజుదారుల చేతుల్లోనే ర్యాంపులను ఉంచాలని నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం, వేలం జరగని ర్యాంపులకు మాత్రం వెంటనే కొత్త విధానంలో లాటరీ తీసి వేలం నిర్వహించాలని నిర్ణయించింది.
గనుల శాఖ నుండి డ్వామా పిడికి ఫైళ్లు బదిలీ *పాత లీజుదారులకూ అవే నిబంధనలు
english title:
k
Date:
Tuesday, December 4, 2012