శ్రీకాకుళం, డిసెంబర్ 3: గతంలో అసెంబ్లీని కుదిపేసిన కనె్నధారకొండ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కంఠమానుగూడేనికి చెందిన 12 గిరిజన కుటుంబాలకు కనె్నధార కొండపై కొండపూడు పట్టాలు ఉన్నాయని, వాటిని ఇప్పించాలంటూ చేసిన ఫిర్యాదుకు స్పందించకపోవడంతో కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు లోకాయుక్త సమన్లు జారీ చేసింది. వచ్చే జనవరి 7న లోకాయుక్త ముందు హాజరుకావల్సిందిగా ఆదేశించింది. మంత్రి ధర్మాన కుటుంబీకులకు కనె్నధార కొండ లీజులు ఇవ్వటంపై గత కొనే్నళ్లుగా గిరిజనులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి 2010 అక్టోబర్‌లో అప్పటి అదనపు జాయింట్ కలెక్టర్ బాబూరావునాయుడు నిర్వహించిన దర్యాప్తులో కంఠమానుగూడేం గిరిజనులకు కొండపూడు పట్టాలు ఉన్నాయని, వాటిని ఇప్పించాలంటూ అప్పట్లోనే ఫిర్యాదు చేసారు. ఈ మేరకు బాబురావునాయుడు కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేసారు. అయినప్పటికీ, ఇప్పటి వరకూ న్యాయం జరగకపోవడంతో బాధిత గిరిజనులు లోకాయుక్తను ఆశ్రయించారు. గిరిజనుల ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త కలెక్టర్‌కు స్వయంగా హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. దీనిపై కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని ‘ఆంధ్రభూమి’ ప్రశ్నించగా ఇంకా సమన్లు కలెక్టర్‌కు అందలేదని స్పష్టం చేశారు.
శ్రీవారికి బంగారు శంఖం బహూకరణ
తిరుపతి, డిసెంబర్ 3: కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి సోమవారం తిరుమల శ్రీవారికి బంగారు శంఖాన్ని బహూకరించారు. సుమారు కిలో బరువున్న ఈ శంఖం ఖరీదు 30 లక్షల రూపాయలు ఉండవచ్చునని అంచనా. ఈ శంఖాన్ని కంచిపీఠాధిపతి సోమవారం రాత్రి శ్రీవారి ఆలయంలో టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు అందజేశారు. ఈ శంఖాన్ని శ్రీవారి అభిషేక కార్యక్రమానికి వినియోగించనున్నామని టిటిడి ఇఓ సుబ్రహ్మణ్యం చెప్పారు.
యువత కోసం ఏటా వేసవిలో ధార్మిక శిక్షణ తరగతులు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, డిసెంబర్ 3: నేటి యువతరానికి హైందవ సనాతన ధర్మ విలువలు, ధార్మిక చింతనను, సద్గుణాలను నేర్పించడంలో భాగంగా ఇకపై ప్రతియేటా వేసవి సెలవుల్లో హైందవ సనాతన ధార్మిక శిక్షణా తరగతులను టిటిడి నిర్వహించాలని కేంద్ర ధార్మిక సలహామండలి అధ్యక్షులు జె రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో కేంద్ర ధార్మిక సలహామండలి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పాశ్చాత్య పోకడలతో చెడుదోవ పడుతున్న యువతకు ధార్మిక విలువలను నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తద్వారా భవిష్యత్ తరాల వారికి హిందూమతం గొప్పతనాన్ని తెలపడానికి ఇది ఒక ప్రధాన ఆయుధంగా సహకరిస్తుందని అన్నారు. తర్వాత విడత మనగుడి కార్యక్రమం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తే బాగుంటుందన్నారు.