తిరుపతి, డిసెంబర్ 3: తెలుగుభాషపై విమర్శకాదు, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ తెలుగుమహాసభలను బహిష్కరించాలని పిలుపునిస్తున్న నేతలకు అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ హితవు పలికారు. సోమవారం ఇక్కడ ఒక కార్యక్రమంలోబుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ మూడు వేల సంవత్సరాల క్రితం నాటి తెలుగుభాషను బతికిస్తే జాతికి జీవం పోసినట్లేనట్లు అవుతుందన్నారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఆ రోజుల్లో తెలుగు భాష అభివృద్ధికి అరసం చేసిన కృషి శ్లాఘనీయమన్నారు. ఆంగ్ల భాష వ్యామోహం వీడి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ప.గో.లో గూడ్స్ రైలు బోగీ నుండి మంటలు
కొవ్వూరు, డిసెంబర్ 3: రాజమండ్రి నుండి విజయవాడ వైపు బొగ్గు లోడుతో వెడుతున్న గూడ్స్ రైలులోని ఒక బోగీ నుండి మంటలు, పొగలు లేచాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి నుండి బయల్దేరిన ఈ గూడ్సు 28వ బోగీ నుండి పొగలు, మంటలు రావడంతో గమనించిన గార్డు కొవ్వూరు స్టేషన్ మాస్టర్ గురునాథంకు సమాచారం అందించారు. వెంటనే ఆయన కొవ్వూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. రైలును కొవ్వూరు స్టేషన్‌లో నిలిపివేసి, అగ్నిమాపక అధికారి నాగసత్యనారాయణ ఆధ్వర్యంలో మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆ బోగీని విడదీసి వేరే లైనులో ఉంచి, రైలును పంపించేశారు. పక్కన వుంచిన బోగీ నుండి సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మళ్లీ పొగలు, మంటలు రావడంతో ఫైర్ స్టేషన్ సిబ్బంది వెళ్లి అదుపుచేశారు.
దక్షిణ కోస్తాకు వర్ష సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 3: రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సోమవారం రాత్రి తెలియచేసింది. దక్షిణ కోస్తా అంతటా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే పరిస్థితులు లేనందున రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలియచేసింది.
- అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి -
english title:
v
Date:
Tuesday, December 4, 2012