హైదరాబాద్, డిసెంబర్ 4: న్యాయవివాదాలు ముదిరిపాకాన పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడంతో మరోమారు మంగళవారం నాడు సుప్రీంకోర్టులో పాఠశాల విద్యాశాఖ అధికారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో జరిగిన వరుస మూడు డిఎస్సీల్లో డిఇడి విద్యార్ధులకు రావల్సిన వాటా రాకపోవడంతో వారి సంగతి ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆఘమేఘాల మీద డిఇడి అభ్యర్ధుల వాటా వారికి వచ్చే డిఎస్సీలో దక్కేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. ఎస్‌జిటి పోస్టులను పూర్తిగా డి.ఇడి అభ్యర్ధులకే కేటాయించాలని డిఇడిపోరాట సంఘం గత పదేళ్లుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తోంది. దీనిపై ఎన్‌సిటిఇ, ఇతర జాతీయ బోర్డులు చాలా స్పష్టత ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ అంశం ముదిరిపాకాన పడింది. సుప్రీంకోర్టులో డి.ఎస్సీ రిక్రూట్‌మెంట్‌కే ఆటంకం కలిగే పరిస్థితి రావడంతో ప్రొఫెసర్ కె. సి. రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని నియమించి డి.ఇడి అభ్యర్ధులను నచ్చచెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అది కాస్తా అనేక మలుపులు తిరిగి చివరికి 2012 డిఎస్సీలో అమలులోకి వచ్చింది. అయితే అంతకు ముందు జరిగిన మూడు డిఎస్సీల్లో తమకు అన్యాయం జరిగిందన్న డి.ఇడి అభ్యర్ధుల ఆవేదనపై సుప్రీంకోర్టు తీవ్రంగానే స్పందించింది. వారికి ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో ఇంకా 30వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో డి.ఇడి అభ్యర్ధులను సర్దుబాటు చేసే అంశం పరిశీలిస్తామని ప్రభుత్వం చెప్పినా, వయోపరిమితి దాటిన వారి సంగతిపై నిలదీయడంతో అధికారులు నీళ్లునమిలారు. కేసు జనవరి 15కి వాయిదా పడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా వృత్తి విద్యాకళాశాలల ఫీజుల పిటీషన్‌ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. అదనపు సమాచారంతో మరో అఫిడవిట్ దాఖలు చేస్తామని తమకు గడువు ఇవ్వాలని కాలేజీల యాజమాన్యాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేసును ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.
బ్యాక్‌లాగ్ విద్యార్థులకు మరో అవకాశం
పాలిటెక్నిక్ పరీక్షలు ఫెయిలైన విద్యార్ధులకు మానవతాదృక్పథంతో ప్రభుత్వం చిట్టచివరి అవకాశాన్ని కల్పించింది. సి-90, సి-96 స్కీం కింద పరీక్షలు రాసి పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ నెల 17వ తేదీ నుండి మరోమారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌బిటిఇటిఎపి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని కార్యదర్శి డి. వెంకటేశ్వర్లు తెలిపారు.
వృత్తివిద్యాకాలేజీల పిటిషన్ ఏప్రిల్ 9కి వాయిదా వృత్తివిద్యా బ్యాక్‌లాగ్ విద్యార్థులకు అవకాశం
english title:
ded
Date:
Wednesday, December 5, 2012