హైదరాబాద్, డిసెంబర్ 4: టిడిపికి మొదటి నుంచి అండగా నిలిచిన సామాజిక వర్గంలో రాజకీయ పునరాలోచన మొదలైంది. కొందరు నాయకులు టిడిపిని అలానే అట్టిపెట్టుకొని ఉండగా, మరి కొందరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. 2004లో టిడిపి ఓడిపోయిన తరువాత కూడా ఈ వర్గం టిడిపికి అండగా నిలిచింది. 2009 ఎన్నికల్లో టిడిపిని గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. ఇప్పుడు ఆ వర్గంలో సైతం టిడిపి మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎన్టీఆర్ జన్మించిన గుడివాడ నియోజక వర్గం ఎమ్మెల్యే నాని పార్టీ వీడి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా బాలకృష్ణపై పోటీ చేస్తానని, ఓడించి తీరుతానని, గెలవకపోతే రాష్ట్రం వీడి వెళతానని సవాల్ చేశారు. మూటా ముల్లె సర్దుకొని సిద్ధంగా ఉండాలని టిడిపి శాసనసభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు నానికి తెలిపారు. నాని మార్గంలోనే ఆ వర్గం నాయకులు కొందరు పార్టీ వీడి వెళుతున్నారు. గోదావరి జిల్లాలో కృష్ణబాబుకు మంచి పట్టుంది. టిడిపికి అండగా నిలిచే సామాజిక వర్గంలో ప్రముఖులు. చివరకు బాబు విధానాలను వ్యతిరేకిస్తూ ఆయన సైతం పార్టీ వీడి వెళ్లడంతో పాటు ఎమ్మెల్యే వనితను, తన అనుచరులతో సైతం టిడిపికి రాజీనామా చేయించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. టిడిపిని కమ్మ సామాజిక వర్గం పార్టీగా చంద్రబాబు మార్చేస్తున్నారని, అదే వర్గానికి చెందిన కృష్ణబాబు బహిరంగంగా విమర్శించారు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ గుడివాడ నుంచి పోటీకి సిద్ధమవుతూ నియోజక వర్గం సమావేశంలో నానిని ఘాటుగా విమర్శిస్తూ ఉపన్యాసాలు చేశారు. తనపైపోటీ చేయాలని నానికి బాలకృష్ణ సవాల్ చేశారు. దీనికి నాని అదే స్థాయిలో స్పందించారు. బాలకృష్ణ గుడివాడ నుంచి పోటీ చేస్తే ఓడిస్తానని, ఓడించక పోతే రాష్ట్రం వదిలి వెళతానని నాని బదులిచ్చారు. దీనిపై బాలకృష్ణ స్పందించలేదు. కానీ టిడిపి శాసన సభాపక్షం ఉపనాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పందించారు. మూటాముల్లె సర్దుకొని నాని సిద్ధంగా ఉండాలని అన్నారు. నాని ఏరోజూ అసెంబ్లీలో మాట్లాడలేదని, ప్రజా సమస్యలపై స్పందించలేదని అన్నారు. నాని జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితులు. ప్రజా సమస్యలను ఏనాడూ పట్టించుకోని నాయకునికి జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి వల్లనే టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. గుడివాడలో వారిద్దరు పోటీ చేస్తే జూనియర్ ఎన్టీఆర్‌కు, బాలకృష్ణకు మధ్య పోటీలా మారుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. నాని పార్టీ వీడి వెళ్లగానే టిడిపి నాయకులు జూనియర్ ఎన్టీఆర్‌పై అనుమానాలు వ్యక్తం చేయడంతో, జూనియర్ సైతం వెంటనే విలేఖరుల సమావేశంలో మాట్లాడాల్సి వచ్చింది. ఈ నిర్ణయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు ఇంకా రాజకీయాలు చేసే వయసు రాలేదని అన్నారు. బాబు పాదయాత్రలో బాలకృష్ణ పాల్గొన్నా ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనలేదు.
బాలకృష్ణ వర్సెస్ నాని
english title:
p
Date:
Wednesday, December 5, 2012