జీవితంలో తొంగిచూసే కొన్ని అనివార్య సత్యాలను అవగాహనతో అంగీకరించకపోతే జీవికి శాంతి లభించదు. సమరం తప్పదు. అవి నీకు ఇష్టమా, అయిష్టమా? అనేది ప్రశ్న కాదు. ఇష్టా అయిష్టాలతో సంబంధం లేకుండా నీవు అనుభవించాలి అనేది జీవన సత్యం. లొంగని కారణాన్ని ఈడుస్తూ అలసి పోవడంకన్నా అవగాహనతో ప్రశాంతంగా దానికి లొంగిపోవడమే శ్రేయోదాయకం. నన్ను వ్యాధులు బాధిస్తాయి. నన్ను వృద్ధాప్యం సమీపిస్తుంది. నన్ను మృత్యువు కబళిస్తుంది. ఈ ఆలోచనలు నన్ను కుదిపేస్తున్నాయి. వీటిని పదే పదే స్మరించుకుంటూ కుమిలిపోతుంటారు చాలామంది. ఈ ఆలోచనలు నీ ఆంతర్యాన్ని యుద్ధ్భూమిగా మార్చేసాయి. నీవుచేసే పై ఆలోచనలకు సంబంధించిన కార్యాలు సత్యాలే కానీ, అవి ఇంకా నిన్ను సమీపించలేదు అనేది కూడా సత్యమే. అయినా ఎప్పుడొచ్చి పైన పడతాయోనని ఇప్పుడే మరిగిపోతున్నావు. అది నిజమే. అవన్నీ అనివార్యాలు. అనవసరమని నీవు అనుకున్నా అవి నీకు దూరంగా పోవు. అనివార్యాలు కనుక వాటిని ఆనందంగా అనుభవించడానికి సిద్ధంకావాలి. రాబోయే వాటిని ఊహించే పాండిత్యమున్నవాడివి, వచ్చిన వాటిని అనుభవించడంలో వెనుకంజ వేయడం దేనికి? మృత్యుభయాన్ని విడిచిపెట్టాలి. మృత్యువు అనివార్యం. నిద్రించువాడు కలవరించునట్లు, నాకు మృత్యువు రాకూడదు అని కలవరిస్తావెందుకు? అనివార్యమైన మృత్యువు అనుభవించేందుకే ఉన్నది అని ధైర్యంగా ఉండాలి. అయినా భ్రాంతికాని నీకు లేనిది మృత్యువు. ఎందుకొచ్చిన ఆందోళన ఇదంతా. దేహాభిమానంతో తయారైన దిగులే ఇదంతా. ఈ దేహమొక మట్టిముద్ద అనే సత్యాన్ని సంభాషించు. పూలతో కప్పినంత మాత్రాన నా శవం చెడకుండా వుంటుందా?
చెడే శవం నీవుకావు. చెడని శవం నీవు. తొడుగుల్ని తొలగించి చూడు. శవమయ్యే శరీరం నీవని భ్రమించావు. శరీర ధర్మాలన్నీ నీలో ఆరోపించుకున్నావు. వ్యాధులు, వృద్ధాప్యానికి, మృత్యువుకు కరచాలనం చేస్తున్నావు. కాని, నీవు కాని దేహం నీకు లేనిదేనని ఈ క్షణాన భావించు. ఇక్కడే అంతరిస్తాయి ఆవేదనలన్నీ. కానీ అది చెప్పినంత తేలిక విషయంకాదు. దేహాత్మ భావాన్ని విస్మరించటం సులభసాధ్యంకాదు. ఆత్మానాత్మ వివేకంగల తీవ్ర ముముక్షువులకే ఇది సాధ్యం. వేశ్యల పొందును అభిలషించెడి కాముకులు కూడా వారి ప్రాణాలను హరించే తీవ్రమైన రోగములు ఆ వేశ్యలయందు నిండివున్నవని తెలియగానే వారిని కోరరుగదా! అంటారు శ్రీ శంకర భగవచ్ఛరణులు. నీవు ముందుగా అనివార్యములను అంగీకరించాలి. దానివలన ఆంతరంగిక కల్లోలాన్ని కొంతవరకు ఆపగలవు. ప్రశాంతతను కొంత చేజిక్కించుకోగలవు. దేహం అనిత్యం. దేహానికి సంబంధించిన వనం శాశ్వతం కాద. దేహం పరిణామశీలం. కనుక మార్పుచెందుతూ ఉంటుంది. మార్పు చెందే శరీరం ముసలితనంవైపు మరలకపోదు. వృద్ధాప్యం దేహానికి అనివార్యం. దేహం క్షణ భంగురం. క్షీణ కీలకమైన దేహం వ్యాధులకు, బాధలకు నిలయం. శరీరాలకు రోగాలు అనివార్యం. దేహం నేడు కళకళలాడినా ఓనాడు కనుమరుగైపోతుంది. దేహానికి మృత్యువు అనివార్యం. వియోగం అనివార్యం.
నాకు లభించేవన్నీ ప్రారబ్ధ్ధానాలు. అనుకున్నవి జరగవు. జరిగేవి అనుకోకపోయినా జరుగుతాయి. బాగుపడే ప్రారబ్ధం లేనివారికి, అధమ పురుషార్థం కూడా తోడైతే, వారిని బాగుచేసే ప్రయత్నం ఫలించలేదని దిగులుపడి సాధించేదుండదు. ఇది అనివార్యం. ఈ అనివార్యాలను జీవితంలో చక్కగా అవలోకించాలి. ఇది చెప్పినంత తేలికగా తెలిసినంత తేలికగా అనుభవంలోకి రాదు. తదేకమననం కావాలి.
వృద్ధాప్యం అనివార్యం అని తెలియగానే వన గర్వం, ఆరోగ్య దర్పం సడలిపోతారు. మృత్యువు అనివార్యం అని తెలియగానే జీవన సరళిలో అహంకారం అడుగంటిపోతుంది. వస్తు పరిణామం వంటబట్టగానే మమకారం మటుమాయమవుతుంది. అనివార్యాలను గుర్తించడంవల్ల లభించే అవాంతర ఫలాలివన్నీ. ఆంతర్య ప్రయాణానికి అడుగుముందుకేసిన సాధన దశలో, అనివార్యంలను అంతఃకరణకు అవగతంచేయాలని తెలుసుకున్నాం. దీనిని ఈ క్షణంనుండే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిద్దాం.
మంచిమాట
english title:
manchimata
Date:
Monday, December 3, 2012