నువ్వు జీవించినన్నాళ్లు నిష్ఠతో నియతితో మమ్ము రక్షించావు. ఏ యుగములందైనా నిను వంటి కొడుకును కనజాలను, నాయనా! దురిత దూరుడివి. బంధుర తపఃస్సంపన్నుడవు. తల్లిదండ్రుల యెడ గురుభక్తిపరుడివి, పరలోకాసక్తులు, ఆర్యసేవాపరాయణులు, ధర్మైక పరులు, నిజ శౌర్యరతులు, ఆర్తిహరులు, అన్నదాసాది దానపరులు పొందు పుణ్యలోకాలు నీవూ పొందు’’ అని విచారించి తనయుడికి అగ్ని సంస్కారాది విధులు శ్రద్ధ్ధానులై చేయించారు. యజ్ఞదత్తుడి పుత్రుడు అమరుడై ఆకాశవీధిని దేవ విమానంలో ఉండి ‘‘ఓ తల్లిదండ్రులారా! నేను ఉత్తమ లోక భోగభాగ్యుడిని అయాను. పుణ్యుడిని అయాను. మిమ్ము కొలిచిన ఫలితం దక్కింది. నా మృతికి మీరు వగవలదు. ఏ కాలంలో ఏ విధంగా ఏది జరుగవలసి యున్నదో ఆ కాలంలో ఆ రీతిగా అది జరుగక తప్పదు. కావలసిన కార్యాలు కాక మానవు. మీరీ రాజు పైన అలుగవద్దు’ అని వాకొంటూ ఆ యజ్ఞ దత్తుడి పుత్రుడు అమరపురి అమరావతికి అరిగాడు. అంత ఆ మనిదంపతులు తమ నందనుని మీద కూర్మి విడువజాలక మేము పుత్రశోకంతో మరణిస్తున్నాం. నువ్వుకూడా మావలె పుత్రశోకంతో మరణించు’’ అని ఘోరమైన శాపాన్ని అలిగి నాకిచ్చి తనువులు విడిచి పెట్టారు.
అగ్ని సామనులైన ఆ తాపసోత్తములకి అగ్ని సంస్కారాలు నేను జరిపి వగలు మదియందునిండగా నగరానికి తిరిగి వచ్చాను. నా కర్మఫలం ఆసన్నం అయింది. ధైర్యం తొలగి మతి తిరుగుతూ ఉంది. నోరు ఎండిపోవసాగింది. కన్నులు కానరావడంలేదు. మాటలు వినరావడంలేదు. అసువులు ఇంక ఈ ఒడలిలో నిలుపలేము. నా పాలిటి కల్పధ్రువము, ధీసముద్రుడు, నా పరాక్రమమ రుద్రుడు, నా అదృష్ట పదభద్రుడు అయిన రామభద్రుడిని చూడలేకపోయాను. ఈ రాత్రితో కూడ ఏడు రోజులు పూర్తి అయినాయి. శ్రీరాముని ఎడబాసి నా జీవం ఉంటుందా’’ అని ప్రలాపిస్తూ ‘‘హా రామా!’’ అని పలవరిస్తూ ఆ దశరథ మహారాజు మృతుడయ్యాడు.
దశరథుడు ప్రాణములు విడుచుట
దుఃఖాలతో కుంది దశరథుడు నిద్రించాడు అని తలచి కౌసల్య తానూ నిద్రించింది. అప్పుడు ప్రభాతం అవడం పరికించి వందిమాగధులు నుతించారు. మంగళతూర్యములు మారుమ్రోగాయి. నగరమందలి వారు అందరూ చనుదెంచి దశరథ రాజదర్శన ఉత్కంఠులై వేచి ఉన్నారు. అంత ఇన్ని నాళ్ల విధంగా మహారాజు మేలుకొనడు? అనే వంతతో పరిచారకులు ఏతెంచి విభుడి శయ్యని దాడి, ధరణీశుడు ఉన్న చందము సరికాదని కడుభయమంది నిట్టూర్పులు పుచ్చుతూ నృపుడి కరచరణాలు అంటి అంటి చూసి ఒడలులో ప్రాణాలు లేకుండడం భావించి అందరూ ఒక్కుమ్మడిగా భీకరంగా మహారోదనం చేయజొచ్చారు. ఆ రోదన ధ్వనులకి దిగ్గున మేలుకొని అదరి కౌసల్యాదేవీ, బెదరి సుమిత్రాదేవీ అందరనూ చూచి పృథివీపతిని చూశారు. వెంటనే యెలుగెత్తి ‘హా ప్రాణనాధా! హా దశరథనాథా!’ అంటూ విలపించసాగారు. ఆ ఏడ్పులు విని కైకేయి రాగా ఆమెను చూచి అనేక పర్యాయాలు కైకేయిపై నింద మోపుతూ ‘‘ఓ కైకా! ఈనాడు నీ కోరికలు కడముట్టినాయి. కాకుత్‌స్థ వంశాన్ని కలచివేశావు. రాముడిని అడవులపాలు అవుమని త్రోసిపుచ్చి సడికి ఓర్చావు. దశరథేశ్వరుడిని చంపుకొన్నావు. ఇంక పూనుకొని నీవూ, నీ కుమారడు, భరుతుడూ పృధ్వి కైకొని సుఖించండి’’ అంటూ ఆ కౌసల్యాది సతులు తన్ను చేరి శోకింప తలవంచుకొంటూ తూలుతూ వచ్చి దశరథ భూనాథుపై వాలి పరి పరి తెరగుల పలవింపసాగింది.
ఆ దుర్ముహూర్తంలో వ్యధ చెందుతూ కౌసల్య దశరథుడిని కనులువిచ్చి చూసి ‘‘్ధరణీశా! నీ బోటి ధర్మస్వరూప చరిత్రుడికి ఈ మరణం సమకూరతగుతుందా? నిన్ను హెచ్చరింపలేక మోసపోయాను. నీ సత్యసంధతయే నిన్నింత చేసింది.
-ఇంకాఉంది