అక్కడ కాఫీ తాగడం అంటే పవన్‌కి చాలా ఇష్టం. అంత మంచి కాఫీ జీవితంలో అక్కడే మొదటిసారి రుచి చూశాడు. తరచూ ఆచారిగారి భార్య కాఫీ తెచ్చి ఇస్తూంటుంది. ఆవిడ కిచెన్‌లో పనిలో ఉన్నప్పుడు వేళ మించిపోకుండా పనమ్మాయి చేత కాఫీ పంపిస్తుంది.
‘‘ఈ కేసులో పి.పి (పబ్లిక్ ప్రాసిక్యూటర్)గా నా ఫ్రెండు వీరారెడ్డి వాదిస్తున్నాడు. హి రుూజ్ నైస్ జెంటిల్మన్... ఎ సిన్సియర్ అడ్వకేట్.. అతడి చేతిలో ఈ కేసు పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డబ్బుకి, ఒత్తిళ్లకీ లొంగే మనిషి కాదు...’’ కాఫీ త్రాగుతూ మధ్యమధ్య చెప్పారాయన.
‘‘ఇవ్వాళ బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలనుకుంటే ఈ కోర్టూ, వాదనలూ, దీని గురించి ఇంతసేపు మనం మాట్లాడుకోవడాలూ అక్కర్లేదు...’’ఏమంటావ్ అన్నట్లు పవన్‌కేసి చూశారు నరసింహాచారిగారు.
‘‘అవున్సార్! నిందితులకి శిక్ష పడాలి సర్...’’ అన్నాడు పవన్.
‘‘ఇలాంటి దారుణాలకు సంబంధించిన కేసులు ఎన్నో అతీ గతీ లేకుండా ఏళ్లూ కోర్టుల్లో వాయిదాలమీద వాయిదాలు పడుతూ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కనీసం ఈ ఒక్క కేసులోనైనా నిందితులకి కఠిన శిక్ష పడితే ఈ న్యాయవ్యవస్థ మీద, ఈ దేశ చట్టాలమీదా ప్రజల్లో సన్నగిల్లుతున్న నమ్మకం కాస్తయినా చిగురిస్తుంది...’’
‘‘అవునండి...’
‘‘బట్... క్రింది కోర్టూ, పై కోర్టూ, ఆపై కోర్టూ... ఇలా ఎన్ని కోర్టుల చుట్టూ ఈ కేసు తిరుగుతుందో, ఎక్కడ దీనికి ఫుల్‌స్టాప్ పడుతుందో, ఎక్కడ నిందితులకి శిక్ష పడుతుందో... ఎదురుచూడాలి.. చూద్దాం.. అప్పుడు అవసరమైతే నా పాత్రేమిటో నిర్ణయించుకుంటాను...’’ కుర్చీలో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నారాయన.
కొద్దిసేపు నిశ్శబ్దం. పైన తిరుగుతున్న ఫ్యాను హోరు, ఆ గాలికి టేబుల్‌పైనున్న కాగితాల రెపరెపలు తప్ప మరే శబ్దమూ లేనంత నిశ్శబ్దం అలముకుందక్కడ. తొలిసారిగా ఒక కొత్త నరింహాచారిగారిని చూస్తున్నట్లు ఫీలయ్యాడు పవన్.
ఆయన ముఖంలో కొట్టొచ్చినట్లు గాంభీరత్య అలముకుంది. మానసికంగా బాగా విహ్వలుడైనట్లు కనిపించారాయన. రెండు నిముషాలు పోయాక ఆయన కళ్లు తెరిచారు- ‘‘ఏంటోనోయ్! కనకమాలచ్చిమి మృతదేహం టీవీలో చూసి నేను బాగా డిస్ట్రబ్ అయ్యాను. తరచూ అదే కళ్లలో మెదులుతోంది. పాపం అమాయకురాలు... ఇక్కడ తోడేళ్లూ, హైనాలు ఉంటాయని తెలీకొచ్చి బలయిపోయింది. ఐ పిటీ హర్...’’ అన్నారు.
పవన్‌కి ఎలా స్పందించాలో తెలీలేదు. అభావంగా ఆయనవైపు చూస్తుండిపోయాడు.
‘‘అసలు విషయం వదిలేసి ఏవేవో మాట్లాడుతున్నాను.. రేపట్నుంచి నువ్వొక పని చెయ్యాలి ఈ కేసులో పిపి వీరారెడ్డి దగ్గరికెళ్లి అతడికి సహాయపడాలి. ఈ కేసుకు సంబంధించి పోతురాజు ... ఆ అమ్మాయి భర్త పోతురాజే కదూ?’’
‘‘అవునండి’’.
‘‘అతడిని తీసుకుని వెళ్లి వీరారెడ్డిని కలసి కావలసిన ఇన్‌ఫర్మేషన్ అంతా ఇవ్వు... రేపట్నుంచి దాదాపుగా నీ డ్యూటీ అక్కడే... నిన్ననే నాకు వీరారెడ్డి ఫోన్‌చేసి ఈ కేసులో తాను వాదిస్తున్నట్లు చెప్పాడు. అప్పుడు వెంటనే నాకు నువ్వు గుర్తుకొచ్చావ్. నిన్ను పంపిస్తానని చెప్పాను...’’
‘‘్థ్యంక్స్ సర్... ఈ కేసులో నేనేం చెయ్యలేకపోతున్నాననే అని ఇప్పటిదాకా బాధపడ్డాను. ఇప్పుడు నాకు సంతృప్తిగా ఉంది సర్’’ ఉద్వేగంగానే అన్నాడు పవన్.
‘‘ఐ నో... ఐనో పవన్... సో... డూ ద వర్క్... ఆల్ ద బెస్ట్...’’ అన్నారాయన.
‘‘సర్...’’
‘‘ఏంటి కంగారు పడుతున్నావ్.. ఈ కేసులో నువ్వుబాగా సహకారం అందించగలగాలని అన్నాను. అంతే.. నా దగ్గర్నుంచి నిన్ను పంపెయ్యడం లేదు...’’ అంటూ నవ్వారాయన. పవన్ కూడా నవ్వేశాడు.
24
బద్రినారాయణకి చాలా కోపంగా ఉంది. ఉక్రోషంగానూ ఉంది. ఒకటి రెండు ఛానళ్లనూ, పత్రికలనూ మినహా, మిగిలినవాటిని తగలబెట్టెయ్యాలనుంది. కనకమాలచ్చిమి కేసు విషయంలో నిరసనలూ, ధర్నాలూ చేసినవాళ్లని, అడపా తడపా ప్రకటనలిస్తున్న వాళ్లనీ నిలువునా కాల్చెయ్యలనుంది.
‘అసలు తన కొడుకు చేసిన తప్పేంటి?’ అని అతడు తన దగ్గరకొచ్చినవాళ్లని ప్రశ్నిస్తున్నాడు. ఈ సొసైటీనే అలా తగలబడిపోయింది కనక, అందుకు యూత్ చెడిపోతున్నారని, తన కొడుకూ ఆ ప్రభావంతో తప్పుచేసుంటాడనీ, తప్పు ఈ సమాజానిదే కాని, తన కొడుకుది ఎంత మాత్రం కాదనీ- అతడు చాలా బాధపడిపోతూ అంటున్నాడు.
అతడి కొడుకు జయేందర్‌కీ, అతడి మిత్రులకీ కోర్టు బెయిల్ నిరాకరించింది. పైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయించాడు. అక్కడా చుక్కెదురైంది. ఆ పైకోర్టులోనూ బెయిల్ పిటిషన్ వేయించాడు పకడ్బందీగా. అక్కడా బెడిసికొట్టింది.
-ఇంకాఉంది