నెల్లూరు/తిరుపతి, డిసెంబర్ 4: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. నెల్లూరు నగరం సహా గూడూరు డివిజన్‌లోనే ఎక్కువగా కురిసింది. మంగళవారం ఒక్క రోజే సూళ్లూరు పేటలో 12 సెంటీమీటర్లు, నెల్లూరులో 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు, బజార్లలో కూడా మోకాళ్లలోతు నీరు నిలిచిపోయంది.జాషువానగర్, తదితర ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రభుత్వ కార్యాలయాల్లోకి నీరు ప్రవేశించింది. ఈ వర్షం ప్రయోజనకరమని రైతులు ఆనందంలో ఉన్నారు. కాగా గూడూరు సమీపంలో చల్లకాలువ, పంబలేరు ఏటికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ముందుజాగ్రత్త చర్యగా రాక పోకలను నిషేధించారు. అధికారులు మంగళవారం పంబలేరును సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు. రైల్వే అండర్ బ్రిడ్జి, ఆర్‌అండ్‌బి ఇఇ కార్యాలయం, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం, సమాచార పౌరసంబంధ శాఖ కార్యాలయం, మీసేవ కార్యాలయాలను వర్షపునీరు చుట్టుముట్టడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. ఇలా ఉండగా చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కాళంకి నదికి భారీగా వరద నీరు చేరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి అంజూరు, కాళంగి గ్రామాల వద్ద కాళంగి రిజర్వాయర్‌కు చెందిన 7 గేట్లు ఎత్తివేశారు. మంగళవారం ఉదయానికే కాళంగికి భారీగా నీరు చేరడంతో చెంగాళమ్మ ఆలయ, హైవే పైనున్న బిడ్జిలకు సమాంతరంగా నీరు పారుతోంది. పులికాట్ సరస్సుకు కూడా భారీగా వరదనీరు చేరడంతో నీటి అలలు పరవళ్లు తొక్కుతున్నాయి. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట, వేనాడుకు వెళ్లే మార్గాల్లో రోడ్లకు సమాంతరంగా పులికాట్ నీరు చేరింది. కాళంగి వంతెనను తాకుతూ వరదనీరు ప్రవహిస్తుండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే చార్మినార్, జైపూర్, జిటి ఎక్స్‌ప్రెస్‌లు సూళ్లూరుపేటలో ఆపేశారు. చెన్నైనుంచి సూళ్లూరు పేట వచ్చే లోకల్ ట్రైన్లు తడ వరకు అనుమతించారు.వరదయ్యపాళెం మండలంలో అత్యధికంగా 179 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా మండలంలోని తిమ్మసముద్రం వద్ద వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రేణిగుంటకు చెందిన జేజయ్య(60) వాగు దాటుతూ నీటిలో కొట్టుకుపోయాడు.
దక్షిణ కోస్తాకు వర్ష సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 4: ఈశాన్య రుతుపవనాల ప్రభావం వలన రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలియచేసింది. అలాగే ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.