నిజామాబాద్, డిసెంబర్ 4: తెలంగాణకు టిడిపి వ్యతిరేకం కాదంటూ పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ, తమను దెబ్బతీయాలనే కుట్రతోనే టిఆర్‌ఎస్ దుష్ప్రచారం సాగిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ‘వస్తున్నా మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పర్యటించారు. జాడిజమాల్‌పూర్ నుండి రెంజల్ మండలం సాటాపూర్ వరకు పాదయాత్ర కొనసాగించారు. తెలంగాణను అడ్డం పెట్టుకుని కెసిఆర్ తనకు, తన కుమారుడు, కుమార్తె, అల్లుడికి రాజకీయ ఉద్యోగాలు సాధించుకున్నారు తప్ప ప్రజలకు ఒనగూర్చిన ప్రయోజనమేదీ లేదని విమర్శించారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలన్న తపనతోనే తాను అనేక కష్టాలకు ఓర్చి పాదయాత్ర కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. కాగా వైఎస్ హయాంలో జరిగిన అంతులేని అవినీతి కారణంగానే ప్రస్తుతం రాష్ట్రం అధోగతిపాలైందని, అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని వైఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇష్టారీతిన 26జీవోలను జారీ చేసి, ఒక్క హైదరాబాద్ నగరంలోనే 8వేల ఎకరాల భూములను కుటుంబీకులు, అనుయాయులకు అప్పనంలా అప్పగించారని ఆరోపించారు. వైఎస్ జమానాలో జరిగిన అవినీతి డబ్బులను నోట్ల కట్టల రూపంలో లెక్కిస్తే వెయ్యి లారీల నిండా డబ్బు సంచులు కూడబెట్టుకున్నారని ఆయన లెక్కలు కట్టి మరీ చెప్పారు. వైఎస్ కుటుంబానికి అతి సన్నిహితంగా మెలిగే గాలి జనార్దన్‌రెడ్డికి బంగారు సింహాసనం కట్టబెట్టారని విరుచు కుపడ్డారు. జగన్ కేసును విచారిస్తున్న జడ్జిలు సైతం దోపిడీ ధోరణిని చూసి విస్తుపోవాల్సి వచ్చిందని, ఐదేళ్లలో వేల కోట్ల రూపాయలను ఎలా సంపాదించారంటూ ఆశ్చర్యం వెలిబుచ్చారంటే అవినీతి ఏపాటిదో ఊహించుకోవచ్చని అన్నారు. తమ హయాంలో హైదరాబాద్‌ను అభివృద్ధికి చిరునామాగా నిలిపితే, కాంగ్రెస్ హయాంలో పూర్తిగా అవినీతిమయంగా మార్చివేశారని విరుచుకుపడ్డారు. హైటెక్ సిటీని కట్టి, సైబరాబాద్‌ను ఏర్పాటు చేశామని, ఫ్లైఓవర్లు, ఔటర్ రింగు రోడ్డు, ఆరు లేన్ల రహదారులను నిర్మించామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పాలన ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి సిఎంగా మారారని అన్నారు. ధరలను పెంచడమే గొప్పతనమని కిరణ్ సర్కార్ భావిస్తోంది తప్ప, పేదల కష్టాలను పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదని ధ్వజమెత్తారు.
* నిజామాబాద్ పాదయాత్రలో బాబు ధ్వజం
english title:
u
Date:
Wednesday, December 5, 2012