కర్నూలు, డిసెంబర్ 4: దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం హంద్రీ-నీవా ప్రాజెక్టు రాజకీయాలకు వేదికగా మారింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర తమదంటే తమదంటూ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో హంద్రీనీవా పేరు చెప్పి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో రెండు పార్టీల నేతలు మునిగిపోయారు. ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. దీంతో కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లికి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు తరలిస్తున్నారు. తొలిదశ ప్రాజెక్టును మల్యాలలో ప్రారంభించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జీడిపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రఘువీరా కాలువగట్ల వెంట పాదయాత్ర చేపట్టారు.
సుమారు 50 సంవత్సరాల క్రితం తెరపైకి వచ్చిన ఈ ప్రాజెక్టుకు 1986లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు హంద్రీ-నీవా, సుజల-స్రవంతిగా నామకరణం చేశారు. తరువాత 1993లో దివంగత కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక కోసం రూ.5 కోట్లు విడుదల చేశారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదాన్ని తెలిపి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జీడిపల్లి వద్ద ప్రాజెక్టుకు ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు ఇటీవలే పూర్తి కావడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించడంతో రాయలసీమలోని నాలుగు జిల్లాలకు కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రచారాస్త్రంగా మారుతోంది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను రంగంలోకి దింపింది. మంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన భగీరథ విజయయాత్రలో దారి పొడవునా చిరంజీవితో సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులంతా తమ ప్రసంగాల్లో కోట్లను పొగడ్తలతో ముంచెత్తారు. దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని ఏకరువు పెట్టారు. చివరకు తమిళనాడు గవర్నర్ రోశయ్య అనంతపురం నగరానికి వచ్చి తనదైన బాణీలో అదే మాట చెప్పి వెళ్లారు. అప్పటికే తేరుకున్న వైకాపా నేతలు ఎదురుదాడికి దిగారు. ఎవరు పేరు పెట్టినా ఎవరు ప్రతిపాదించినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే మూలన పడిన హంద్రీ-నీవా పథకం ఫైలు బూజు దులిపి వేల కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభమయ్యాయని ఢంకా భజాయిస్తున్నారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసునని అంటున్నారు. ప్రాజెక్టును పూర్తి చేసిన వైఎస్ పేరును కూడా ప్రస్తావించకుండా ఆయనను అవమానపర్చడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి జోక్యం చేసుకుని హంద్రీ-నీవా వల్ల ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం తప్పిస్తే ఈ పథకానికి నీటి వాటాను సాధించడంలో ఎవరికీ శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి చేసిన ఘనత మాదంటే మాదంటున్న పార్టీలు
english title:
p
Date:
Wednesday, December 5, 2012