రాజమండ్రి, డిసెంబర్ 4: గోదావరి ప్రవాహం ఊహించని విధంగా అంచనాలను తలకిందులు చేస్తూ దారుణంగా దిగజారుతుండటంతో సాగునీటి లెక్కలు తారుమారవుతున్నాయి. గోదావరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రబీ సీజన్ నాటికి అసాధారణ స్థాయిలో గోదావరి ప్రవాహం తగ్గిపోతుండటంతో పలు సందేహాలు అటు ఇరిగేషన్ అధికారులను, ఇటు గోదావరి డెల్టా రైతులను ముసురుతున్నాయి. క్రమేపీ దిగజారాల్సిన నీటి లభ్యత హటాత్తుగా దారుణంగా పడిపోవడంతో నీరు దారిమళ్లుంతుందనే అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది. సహజంగా వరదల సీజన్ అంటే జూలై నుండి సెప్టెంబరు వరకు గోదావరి నదిలో నమోదయిన నీటి ప్రవాహం ఆధారంగా డిసెంబరు 15 నుండి మొదలయ్యే రబీ పంటకు ఎంత నీరు గోదావరిలో లభ్యమవుతుందో ఇరిగేషన్ అధికారులు లెక్కలు వేసి ఒక నిర్ణయానికి వస్తుంటారు. ప్రస్తుతం గోదావరిలో జూలై నుండి సెప్టెంబరు వరకు నమోదయిన నీటి ప్రవాహాన్ని, గత 30ఏళ్లలో ఇదే సమయంలో నమోదయిన లెక్కలతో పోల్చి రబీ ఆయకట్టుపై ఇరిగేషన్ అధికారులు ఒక అంచనాకు వస్తారు. ఇదే పద్ధతి ఇప్పటి వరకు నడుస్తోంది. కానీ ఈసారి మాత్రం లెక్కలన్నీ నీటి మూటలయ్యాయి. గోదావరిలో ఈ ఏడాది జూలై నుండి సెప్టెంబర్ వరకు నమోదయిన నీటి ప్రవాహం, సంభవించిన వరదలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కచ్చితంగా రబీలో పూర్తి ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేయవచ్చని అంతా భావించారు.
గోదావరి జిల్లాల్లో జరిగిన సాగునీటి సలహామండలి (ఐఏబి) సమావేశాలు కూడా పూర్తి ఆయకట్టుకు నీటిని సరఫరాచేయాలని తీర్మానాలు కూడా చేసి పంపించాయి. వాస్తవానికి ఈ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు చర్చించిన తరువాత మాత్రమే తీర్మానాలు చేస్తారు. ఒకసారి ఐఎబి తీర్మానం చేసిందంటే, ఇక గ్యారంటీగా పూర్తి ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతుందని గోదావరి డెల్టా రైతులు గట్టిగా నమ్ముతారు. అందువల్ల ఇప్పటికే గోదావరి జిల్లాల్లో చాలామంది రైతులు రబీకి ఏర్పాట్లు చేసుకోవటం, నారుమళ్లు వేసుకోవటం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులోనూ తుపాను కారణంగా ఖరీఫ్ పంటను పూర్తిగా నష్టపోయిన రైతులు రబీపై గంపెడాశతో త్వరగా పనులు మొదలుపెట్టారు. తీరాచూస్తే గోదావరి ప్రవాహం అసాధారణ స్థాయిలో తగ్గుతోందని, పూర్తి ఆయకట్టుకు నీటిని ఇవ్వలేమోనన్న అనుమానాలను అధికారులు వ్యక్తంచేస్తున్నారు. దాంతో రైతుల్లో ఆందోళన మొదలయింది. మరో పది రోజుల్లో రబీ మొదలుకావాల్సిన నేపథ్యంలో ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పూర్తి ఆయకట్టుకు నీరివ్వగలమని ముందు భావించిన అధికారులకు, తాజా పరిణామాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రైతులు, ప్రజాప్రతినిధులకు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిన్నింటి కన్నా ముందు అసలు ఇంత దారుణంగా గోదావరి ప్రవాహం ఎందుకిలా దిగజారిపోతోందో అర్థం కాకుండా పోయంది. ఎగువ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎత్తిపోతల పథకాలు నడుస్తున్నాయన్న అనుమానాన్ని సాగునీటి రంగ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. లేకపోతే ఎప్పుడూ లేని విధంగా ఎందుకిలా గోదావరి అకస్మాత్తుగా తగ్గుతుందని ప్రశ్నిస్తున్నారు. సహజంగా జనవరి మొదటి వారంలో కాటన్ బ్యారేజి నుండి మిగులు జలాల విడుదల ఆగుతుంది. కొన్నిసార్లు డిసెంబరు నెలాఖరు నాటికి ఆగుతుంది. కానీ ఈసారి నవంబరులోనే మిగులు జలాల విడుదల ఆగిపోయింది. ఈ పరిస్థితికి కారణాలేమిటో గుర్తించి సరిదిద్దకపోతే భవిష్యత్తులో రెండో పంటను పూర్తిగా మరిచిపోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది.
గోదావరి ప్రవాహం తగ్గడంతో సందేహాలు *తప్పుతున్న సాగునీటి లెక్కలు
english title:
y
Date:
Wednesday, December 5, 2012