బొమ్మనహాళ్, డిసెంబర్ 4: అనంతపురం జిల్లాలో ఆయకట్టుకు హెచ్చెల్సీ నీటి విడుదల చేసే విషయంలో మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. ఆయకట్టుకు హెచ్‌ఎల్‌సి నీరు విడుదల చేయకుంటే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటానని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. దీంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నీరు విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పంటలు ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ఆయకట్టుకు నీరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి రాయదుర్గం ఎమ్మెల్యే, వైకాపా నేత కాపు రామచంద్రారెడ్డి తూము నిద్ర చేశారు. నీరు విడుదల చేసేంత వరకు కాలువగట్టు నుంచి కదలబోనని ఆయన ప్రకటించారు. అయితే రెండు రోజులు ఆగి నీరు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిథుల సూచన మేరకు నీటి పారుదల అధికారులు నిర్ణయించారు. ఇది గమనించిన ఎమ్మెల్యే కాపు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రాబల్యం కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రైతులను బలి చేస్తున్నారని ఆరోపిస్తూ 4వ డిస్ట్రిబ్యూటరీ వద్దకు పురుగుల మందు డబ్బాతో చేరుకున్నారు. వెంటనే సాగుకు నీరు విడుదల చేయకుంటే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ముఖ్యమంత్రితోపాటు జిల్లా మంత్రులు, ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి ఇదే విషయం తెలిపారు. దీంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు షరతులు పెట్టి నీరు విడుదల చేశారు.
- హెచ్చెల్సీ విడుదలలో హైడ్రామా -
english title:
s
Date:
Wednesday, December 5, 2012