* మైత్రి (బాగోలేదు)
తారాగణం: నవదీప్, సదాఫ్, బ్రహ్మానందం, ఉత్తేజ్, ‘చిత్రం’ శీను, సుమన్‌శెట్టి, ‘సత్యం’ రాజేష్ తదితరులు
సంగీతం: వికాస్
నిర్మాత: రాజేష్ కుమార్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సూర్యరాజు
చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనని ఆకళింపు చేసుకోవటం - ఎడతెగక చదవటం.. కథకుడి లక్షణం. ఇండస్ట్రీలో కొన్నాళ్లు ఉండాలనుకుంటే.. వస్తూన్న వచ్చిన సినిమాల్ని చూట్టం అన్నది మరో క్వాలిఫికేషన్. కానీ - ఈ లక్షణాలేవీ లేకుండా అవగాహనా రాహిత్యంతో కాస్తంత వచ్చిన అక్షరమ్ముక్కల్ని కొత్త పాళీతో రాసేస్తానంటే అస్సలు కుదర్దు. అది క్రైం కథ కావొచ్చు.. శృంగార కథ కావొచ్చు. సెంటిమెంటల్ స్టోరీ కావొచ్చు- సీమ సినిమా అవ్వొచ్చు. కామెడీ కథ కావొచ్చు. ఇలా ఒక్కో కథకి ఒక్కో స్క్రిప్ట్ వర్క్ ఉంటుంది. స్టోరీ డిస్కషన్స్ ఉంటాయి. ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి సైతం తెలిసిన అంశాలు. ప్రేక్షకుడు తన ఆలోచనల్లోంచి మాత్రమే ఆలోచిస్తాడు. రీజనింగ్‌లూ లాజిక్‌లూ అంతగా పట్టించుకోడు. కానీ - ఒక కథని చెప్పేప్పుడు కథకుడు ఒక ‘కన్‌క్లూజన్’కి రావాలి. చెప్పాలనుకున్నది ఏమిటి? అన్నది మొదటిది. దర్శకుడు ఇటువంటి ఆలోచనలేవీ పెట్టుకున్నట్టు లేదు. మొదటి పేజీలో క్రైం సస్పెన్స్ స్టోరీ అని రాసేసుకొని -అక్కడ్నుంచీ సన్నివేశాలు మొదలుపెట్టినట్టుంది. దర్శకుడి అవగాహనా రాహిత్యం ఎక్కడ కనిపిస్తుందంటే - లొకేషన్ ఎంపికలోనే. ‘మంత్ర’ లొకేషన్‌ని తన కథకి అన్వయించుకోవటం ప్రధాన లోపం. పావుపేజీ కథని ‘్భయపెట్టడం’ అనే కోణంలోంచి చూసినప్పటికీ అన్నీ చీకట్లో తప్పటడుగులే.
అసలు కథేంటి? హను టీవీ ఛానెల్ ఓనర్ వన్ అండ్ వోన్లీ జీనియస్ మూర్తి (బ్రహ్మానందం). డిఫరెంట్‌గా ఆలోచించి డిఫరెంట్ కానె్సప్ట్‌తో డిఫరెంట్ ఆల్బమ్ రిలీజ్ చేయాలని అతగాడి తాపత్రయం. దీపూ ఉరఫ్ దీపక్ (నవదీప్) ఓ క్రియేటివ్ డైరెక్టర్. ‘చీర కట్టులోని గొప్పతనం’ అన్న డిఫరెంట్ (? - ఈ కానె్సప్ట్‌నీ ఎంతోమంది వాడి పడేశారు) కానె్సప్ట్‌తో ‘జీనియస్’ని కలుస్తాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఆ కానె్సప్ట్ చేస్తేనే అవకాశం ఇస్తానంటాడు జీనియస్. ఇండస్ట్రీలో బతకాలంటే ఇటువంటి చిన్నచిన్న అడ్జెస్ట్‌మెంట్స్ తప్పనిసరి అన్న ఫ్రెండ్స్ మాట ప్రకారం ‘ఆల్బమ్’ చేయటానికి ఒప్పుకుంటాడు. హైటెక్ సిటీ శివార్లలోని ఒక పాత బంగ్లాని షూటింగ్ లొకేషన్‌గా ఎంచుకొంటారు. ఆ పాత బంగ్లాలోని వాచ్‌మెన్ చూపులు అదోలా ఉంటాయి. (వెరీ కామన్ పాయింట్). రాత్రిళ్లే కాదు - పగలు కూడా గజ్జెలు చప్పుడు వినిపిస్తుంది. చెట్ల చాటున ఏవేవో నీడలు. ఈ లొకేషన్‌లోకి బంగ్లా ఓనర్ మైత్రి వస్తుంది. మైత్రి (సదా) ఫారిన్‌లో టాప్ మోడల్. ఎన్నో డిఫరెంట్ కానె్సప్ట్స్ చేసి ఉంటుంది. తన కానె్సప్ట్ కలల రాణి ఈమె అని నిర్ధారించుకొని - తమ ఆల్బమ్‌లో నటించేందుకు ఆమెని ఒప్పిస్తాడు దీపూ. మైత్రికి 23 ఏళ్లు నిండితే తాతగారి ఆస్తి ఆమెకు వారసత్వంగా సంక్రమిస్తుంది. దాంతో ఎవరో ఆమెని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇంతకీ అతడెవరు? చీకట్లో కనిపించే నీడలు ఎవరివి? ఇంటి ముందు ‘మంత్ర’ ముగ్గులు ఎవరు వేస్తున్నారు? ఇలాంటి కాక్ అండ్ బుల్ స్టోరీలన్నీ కామన్‌గా కనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాడు దీపూ.
‘మంత్ర’ లొకేషన్ చూట్టంతోనే ప్రేక్షకుడికి సగం నీరసం వస్తుంది. ఇంతకీ దర్శకుడు ఏం చెప్తాడు? పాత కథేనా? అన్న సందేహం నీడలా వెంటాడుతుంది. అక్కడ్నుంచీ - కిర్రు చప్పుళ్లు.. చిమ్మచీకట్లో వెలుగులు.. ఇలా మనల్ని ‘్భయపెట్టే’ ప్రయత్నం చేస్తాడు దర్శకుడు ఎంతో రొటీన్‌గా. ‘మంత్ర’ స్ఫూర్తి తీసుకుంటే సరిపోదు- దానికి తగ్గ ‘కథ’ని అల్లుకోవాలి. అటువంటి చిన్నచిన్న అంశాలేవీ కథకుడి బుర్రలో లేనట్టున్నాయి. కాబట్టి - ప్రేక్షకుడు కూడా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చూసేయటమే. అంతకు మించి ఆశిస్తే.. తప్పు మనదే. ఎవరికీ నటించటానికి స్కోప్ లేదు. కథ అటువంటిది మరి. సంగీతం ఎంతో రొటీన్‌గా కర్ణ కఠోరంగా భయపెట్టింది. అసలు దర్శకుడు ఆత్మలున్నాయని చెప్పాలనుకున్నాడా? లేక ఇదంతా వొఠ్ఠి భ్రమ అని చెప్పాలనుకున్నాడా? అన్నది సందిగ్ధం. లేకపోతే - చీకట్లో నడుచుకుంటూ తాతయ్య సమాధి దగ్గరికి మైత్రి ఎలా వెళ్లగలిగింది? బంగ్లాలో ఏవో చప్పుళ్లు వినిపిస్తే - అప్పుడే దీపూకి చెప్పాలి గానీ.. తెల్లారింత్తర్వాత తాపీగా చెప్పటం ఏమిటి? బంగ్లాలో ‘హత్య’ జరుగుతుందన్న సంగతి జీనియస్ మూర్తికి ఎలా తెలుసు? ఆ బంగ్లా గురించి అప్పటికే ఏవైనా వార్తలు విని ఉన్నాడా? ఎవరూ చనిపోలేదా? అంటూ నిట్టూర్చటం ఏమిటి? దీపూకి రాత్రిళ్లు ఎవరో మైత్రిని గమనిస్తున్నారన్న విషయం తెలిసీ - యూనిట్‌తో పాటు వెళ్లిపోవాలనుకోవటం ఏమిటి? ‘సత్యం’ రాజేష్ మతిస్థిమితం కోల్పోయాడని చూపాడు అంతవరకూ ఓకే. కానీ - ఎవరో మాంత్రిక పూజలు చేసి ముగ్గులు వేస్తే.. వాటిని చూసి విపరీతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వటం కూడా అర్థంకాని విషయం. ఇవేవీ కాకండా - షూటింగ్ పూర్తయిన తర్వాత ‘ఎడిటింగ్’ చేసేప్పుడు లొకేషన్‌లో ఎవరో కనిపిస్తున్నారన్నట్టు చూపించినా కథకి మరింత బలం చేకూరేది. భయపెట్టడం కథలో ఒక పార్ట్‌గా ఉండాలి తప్ప - ఇది కేవలం భయపెట్టటానికి తీసిన సినిమా అన్న వర్మ డైలాగ్ అన్ని వేళలా పనిచేయదు.
నటనాపరంగా - ఎవరికీ స్కోప్ లేదు కాబట్టి - కామెడీనన్నా ప్రస్తావించుకుందామంటే - అదీ లేదు. సూర్య రాజుని ఒక్క విషయంలో మెచ్చుకోవాలి. ‘మేడిన్ ఇండియా’ అంటూ ‘తెలుగుతనం ఉట్టిపడే చీరకట్టు’ పాట చిత్రీకరణ ఫర్వాలేదనిపించింది. సదా - నవదీప్‌లపై చిత్రీకరించిన పాట బాగుంది. కాస్తంత సెక్సపీల్ కనిపించింది. వికాస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో కొత్తదనం లేదు.