* చాణక్యుడు (బాగోలేదు)
తారాగణం: తనీష్, ఇషితా దత్తా, రంగసాయి, చంద్రమోహన్, రాకీ, బాలయ్య, ప్రభాకర్, పాండా, తా.రమేష్ తదితరులు
సంగీతం: రాహుల్ - వెంగి
నిర్మాతలు: తిరివీధి సంతోష్, కొలన్ నందన్ రెడ్డి, గొట్టిగింటి రామచంద్ర
దర్శకత్వం: గొట్టిగింటి శ్రీనివాస్
నేటి యువత ఎంత త్వరగా ప్రేమలో పడదామా, ఎంత త్వరగా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోయి కాపురం పెట్టేద్దామా అన్న ఆలోచనలోనే ఉంటున్నారా..? అవుననే అంటాడు చాణక్యుడు. అయితే ఉమ్మడి కుటుంబాలు చూద్దామన్నా కరువౌతున్న ఈ రోజుల్లో అలా అందరితో కలిసి బ్రతకాలనుకున్న కథానాయిక కథ ఇది. అయితే చాణక్యుడు అంటే మహా మేధావి అన్న ఆలోచనతో ఉంటాం. కాని అతను శుద్ధ పప్పుసుద్దలా కనిపించడమే జీర్ణించుకోలేం. హీరోయిన్ పెట్టే ఇబ్బందులకు తప్పనిసరి పరిస్థితుల్లో తలవంచటం వంటి విషయాలు చిత్రాన్ని పక్కదారి పట్టించింది.
కథలోకెళితే స్వప్న (ఇషితా దత్తా) ఒక అనాథగా ఆశ్రమంలో బ్రతుకుతుంటుంది. పెద్ద కుటుంబంలో వ్యక్తిని పెళ్లి చేసుకుని మానవ సంబంధాలన్నీ కలుపుకుంటూ జీవించాలని ఆమె కోరిక. అనేకమంది కుర్రాళ్లు ప్రేమ పేరుతో ఎదురుపడినా, ఉమ్మడి కుటుంబాలపై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అలా తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో కలిసి జీవించాలన్న కోరిక ఉన్నవారు దొరకరు. చివరికి స్వప్న స్నేహితురాలి ద్వారా ‘చాణక్య’ (తనీష్) అనే వ్యక్తి విషయాలు తెలుసుకుంటుంది. అతను కుటుంబసభ్యులకు ఇచ్చే విలువను గుర్తిస్తుంది. అతని ఆరాధనలో మునిగిపోతుంది. అతని అమాయకత్వంతో చిన్న ‘గేమ్ ప్లే’ చేసి తన చుట్టూ తిప్పించుకుంటుంది. ఈ కథకు మరో ఉప కథ ఉంది. అదే పగ ప్రతీకారాల వ్యథ. స్వప్న తల్లిదండ్రులను హతమార్చి అనాధను చేసిన ఆమె మేనబావలపై ప్రతీకారం. స్వప్న తన తాత (బాలయ్య) వద్దకు వస్తుంది. తప్పిపోయిందనుకున్న తన మనవరాలు తిరిగి వచ్చినందుకు ఆయన సంతోషిస్తాడు. ఆమె వచ్చిన నాటినుండి ఐదుగురు బావల్లో ఇద్దరు హత్యకు గురవుతారు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారన్నది ముగింపు.
కథాపరంగా చిత్రంలో ఎత్తుకున్న విషయం మంచిదే! కానీ స్వప్న లౌ ట్రాక్ ఒకవైపు సాగితే.. మరోవైపు బావల మారణహోమం జరగడం, ఈ రెండు పాత్రలు (స్వప్నవి) ఒక్కరే అని చెప్పకుండా ముడిని ఖచ్చితంగా వేయలేకపోయాడు దర్శకుడు. అనాథాశ్రమం నుండి వచ్చిన మనవరాలు కారు నుండి దిగడం విచిత్రమే! చిత్రం అలా సాగుతూనే ఉంటుంది. స్క్రీన్‌ప్లేలో హీరోయిన్‌వి రెండుపాత్రలు అన్న అనుమానమూ వస్తుంది. నిర్మాణ విలువలు అన్ని అక్కడికక్కడే ముగించినట్లున్నారు. కొన్ని సన్నివేశాల్లో భారీతనం కనిపించింది. కొన్నిచోట్ల విషయమంతా తేలిపోయింది. నిర్మాతే విలన్‌గా నటించడం కూడా మైనస్సే! ఆ పాత్రకు కనీసం షాయాజీ షిండేను పెట్టుకున్నా కొంతలో కొంత చిత్రం రక్తి కట్టేది. సరైన విలన్ లేనప్పుడు హీరో ఎంత హీరోయిజమ్ చూపినా వృథా! విలన్ ఎంత బలవంతుడైతే హీరో గొప్పదం అంత బాగా ఎలివేట్ అవుతుంది. చిత్రంలో ఉన్న ‘మీ కొంపకు మీరే నిప్పెట్టుకున్నారు’ అనే మాట ఈ సినిమా విషయంలో విలన్‌గా నటించిన నిర్మాతకు చెందుతుంది. ఉండడానికి ఐదుగురు విలన్లు ఉన్నా ఒక్కరూ చిత్రానికి ప్లస్ కాలేదు. చంద్రమోహన్ కుటుంబం ట్రాక్ బాగానే పండించారు. స్వప్న చాణక్యను లవ్ ట్రాక్‌లో ఇరికించే నేపథ్యంలో హాస్యం అల్లుకున్నారు. తాగుబోతు రమేష్ నటన రొటీనే!
నటనలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇషితా దత్తా గూర్చి. చిత్రాన్ని మొత్తం తన నటనతోనే నడిపించింది. ఆమెకు చెప్పిన డబ్బింగ్ కూడా ప్లస్! తనీష్ తన పంథాతో తాను నటించుకెళ్ళాడు. మిగతావాళ్లు ఓకే! సంగీతంలో ‘నా చెలియ నవ్విందంటే గలగల గోదారే’, ‘నా శ్వాసలోనే పొంగింది’ పాటలు బాణీపరంగా, సాహితీపరంగా ఆకట్టుకుంటాయి. ‘అందాల మహిళ అలరించు సఖిలా’ పాటలో ‘వలపు చినుకులా కురిసే’ అన్న పంక్తులు ఆకట్టుకుంటాయి. సినిమాకు నేపథ్య సంగీతం, పాటలు ప్లస్ పాయింటే! ఎడిటింగ్ చాలా చేయవచ్చు. మాటల రచయిత కూడా చక్కని మాటలు రాసాడు. క్లోజప్ షాట్స్‌తో ప్రసాద్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఆడియో సీడీలో ఉన్న ఉన్న మంచి పాట చిత్రంలో లేకపోవడం చిత్రానికి మైనస్. ప్రతిచోటా కాంప్రమైజ్ ధోరణి కనిపించి, సాంకేతికంగా బాగున్నా, నిర్మాణ విలువల లోపంతో చిత్రం అనుకున్న రేంజ్‌కి చేరలేదు.