* రెడ్ డాన్ (బాగోలేదు)
తారాగణం: క్రిస్ హేమ్స్‌వర్త్, జోష్‌పెక్
జోష్ హెచర్‌సన్, ఆడ్రియన్ పాల్క్
ఎడిటింగ్ : హ్యూజెస్ బోర్న్
ఫొటోగ్రఫీ : మిచెల్ అమిడ్సన్
దర్శకత్వం: డాన్ బ్రాడ్లీ
హాలీవుడ్ చిత్రాలంటే వినోదానికి, కాలక్షేపానికి పెట్టింది పేరు. వైవిధ్యం పేరిట ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగమే రీమేక్ చిత్రాల నిర్మాణం. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా రీమేక్ చిత్రాలు మాత్రం పరాజయానే్న చవిచూస్తున్నాయి. 1984లో వచ్చిన ‘‘రెడ్ డాన్’’కు రీమేక్‌గా వచ్చిన కొత్త ‘రెడ్ డాన్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై పరాజయాన్ని మూటగట్టుకుంది.
అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతంలో వున్న ఒక పట్టణం హఠాత్తుగా ఉత్తర కొరియా వైమానిక దాడులకు లోనవుతుంది. వారు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఉదయం నిద్రలేచిన స్థానికులకు తమ వీధుల్లో తిరుగుతున్న టాంకులు, పహరా కాస్తున్న సైనికులు కనిపిస్తారు. కొరియన్లు భవనాలను పేల్చివేయడంతో ప్రజలు సహాయంకోసం అరుస్తుంటారు. స్థానిక హైస్కూలు గ్రాడ్యుయెట్స్ ఏకమై, సైన్యంకోసం ఎదురుచూడకుండా, కొరియన్ సైన్యాలను ఎదుర్కోవాలని ప్లాన్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను అడవిలో వున్న ఇంట్లో దాక్కొని చాటుగా వచ్చి పట్టణ ప్రజలను ఆదుకోవాల్సిందిగా చెబుతారు. జెడ్, మాట్ ఇతర విద్యార్థులను కలుపుకుని ఒక గ్రూప్‌గా తయారై ‘వోల్వరిన్స్’గా పేరుపెట్టుకుంటారు. జెడ్ టీనేజర్లకు శిక్షణ ఇస్తాడు. పోరాడటానికి ఆయుధాలు కావాలి. వీళ్ళు కొరియన్ సైన్యాల దృష్టిని మరల్చి లేదా వారిపై గెరిల్లా దాడులు చేసి, వాళ్ళను చంపి ఆయుధాలను ఎత్తుకుపోతుంటారు. వీళ్ళు షూట్ చేసి కొరియన్ సైనికులను చంపడమే కాకుండా వాళ్ళ గర్ల్‌ఫ్రెండ్స్‌ను కాపాడుకోవడం, వాళ్ళ తల్లిదండ్రుల సమస్యలను తీర్చడం కూడా చేస్తారు. కొరియన్ సైన్యం వీళ్ళ ఉనికిని గుర్తించి అడవిలో వున్న భవనాన్ని నాశనం చేస్తుంది. తర్వాత ఎలక్ట్రో మాగ్నిటిక్ పల్స్ సహాయంతో అమెరికా పవర్‌గ్రిడ్స్‌ను పేల్చివేయాలనుకుంటుంది. వోల్వరిన్స్ వాళ్ళ ఆటను ఎలా కట్టించిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
1984లో వచ్చిన ఒరిజినల్ ‘రెడ్ డాన్’ చిత్రం, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో నిర్మించబడింది. ఇందులో సోవియట్, క్యూబా సంయుక్త సైన్యాలు కలిసి కొలరాడోలో వున్న చిన్న పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు.
కొంతమంది యువకులు కలిసి, ఆ సైన్యాలను ఎదిరించి తమ పట్టణాన్ని ఎలా విముక్తం చేసుకున్నారో తెలిపే ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ కొత్త చిత్రంలో ఉత్తర కొరియన్లు అమెరికామీద దాడి చేసినట్టు చూపించారు. అమెరికా-ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు క్షీణించాయి. నిజమే కానీ అవి దాడి చేసేంత తీవ్రస్థాయిలో లేవు. ఆర్థికపరంగా, సైనికపరంగా అమెరికా దరిదాపుల్లో కూడా రాలేని ఉత్తర కొరియా- ఎక్కడో ఆసియా ఖండంలో మారుమూలన వున్న చిన్న దేశం ఉత్తర కొరియా, అమెరికా మీద దాడులకు దిగడం అసంభవం, ఆత్మహత్యా సదృశ్యం కూడా. ఈ ఆలోచనే సినిమా స్థాయిని దిగజార్చడమే కాకుండా సినిమాను నవ్వులపాలు చేసింది. నిజానికి చైనా సైనిక శక్తిమీద అపనమ్మకం వున్న అమెరికా, చైనానుండే ఆ భయాన్ని ఎదుర్కొంటుంది. అందుకే యం.జి.యం.వారు ‘రెడ్‌డాన్’ను పునర్నిర్మిస్తూ సోవియట్ల స్థానంలో చైనీయులను పెట్టారు. ఈ సంగతి నెట్‌లో లేకపోగా చైనీయులు ఊరేగింపులు తీసి తమ అసమ్మతిని తెలియజేశారు. దాంతో విశాలమైన చైనా మార్కెట్‌ను కోల్పోవడం ఇష్టంలేక చైనా స్థానంలో ధూర్త దేశమైన ఉత్తర కొరియాను పెట్టాల్సి వచ్చింది. అప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో తిరిగి- చైనా స్థానంలో విలన్‌గా ఉత్తర కొరియాను పెట్టి చాలా సీన్లను మళ్ళీ తీయడం, అనేక మాటలను తిరిగి డబ్బింగ్ చేయడం, జెండాలు- యూనిపారంలు- టాంకులు- ట్రక్కుల మీద గుర్తులను డిజిటల్ అడ్జస్టమెంట్ చేయడం లాంటి పనులను చేపట్టారు. దీనికితోడుగా యం.జి.యం. స్టూడియో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంవల్ల, వేరే డిస్ట్రిబ్యూటర్స్‌కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఓ పట్టాన డిస్ట్రిబ్యూటర్లు దొరక్క ఈ చిత్రం మూడేళ్ళు ఆలస్యంగా, ఇప్పుడు విడుదలయింది.
హాలీవుడ్ భారీ చిత్రాలతో పోల్చుకుని చూస్తే ‘రెడ్ డాన్’ 65 మిలియన్ డాలర్ల ఖర్చుతో చౌకలోనే తీశారని చెప్పాలి. యాక్షన్ సీన్లన్నీ లోబడ్జెట్‌లో తీసినవే. ఫొటోగ్రఫీ కూడా చెప్పుకోదగిన రీతిలో లేదు. తేలిపోయే కథనం, చెత్త నటన, నాసిరకం టెక్నాలజీతో తయారైన ఈ సినిమా ప్రేక్షకులను బోలెడు నిరాశపరిచింది.