మీనా, సుమన్ తదితరుల నటనా వైభవంతో అలరించిన ఆర్యవైశ్యుల కుల దేవత అయిన శ్రీవాసవి మాత చరితను కనులకింపుగా మలచారు. వైశ్యుల కులాచారాలు, నమ్మకాలు, సంస్కారాలు, సౌమ్యతత్వం, భక్తిప్రపత్తులు మొదలైనవి బాగా చూపారు. శ్రీవాసవిని చెరబట్టబోయిన రాజునుంచి ఆత్మార్పణ ద్వారా విముక్తమై వైశ్య కులదేవతగా అవతరించినట్లు పురాణ కథల ద్వారా తెలుసుకున్నాం. ఈనాడు ఈ చిత్రం ద్వారా చూడగలిగాం. మీనా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. మిగతావారు తమ పాత్రలను సమర్ధంగా పోషించారు. పాటలు, మాటలు, సంగీతం, ఫొటోగ్రఫీ బాగున్నాయి. ప్రతి వైశ్యుడూ తప్పక చూడాల్సిన చిత్రం ఇది.
- ఎ.మోహనరావు, గంపలగూడెం
ఎంతగానో నచ్చాయి
75 సం.ల క్రితం ‘మాలపిల్ల’ సినిమా ఓ శక్తివంతమైన ఆయుధం అంటూ భమిడిపాటి గౌరీశంకర్ చాలా బాగా రాశారు. 30 వసంతాల వంశీ, ఫ్లాష్‌బ్యాక్ బ50, ఈ పాట గుర్తుందా... ఎంతగానో నచ్చాయి. టీవీ ఛానల్స్ విస్తరించి చదివే ఓపిక తగ్గిపోతున్న ఈరోజుల్లో వెనె్నల అన్ని వర్గాల పాఠకులను సంతృప్తిపరచగలుగుతోంది.
- కాళహస్తి వెంకటశేషగిరిరావు, నెల్లూరు
డైలాగ్స్ మీద శ్రద్ధలేదు
‘ఈరోజుల్లో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు మారుతి తీసిన ‘బస్ స్టాప్’ సినిమా పరమ బూతులతో నిండిపోయింది. మొదటినుండి చివరి దాకా డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఫ్యామిలీతో ఇలాంటి సినిమా చూడాలంటే భయం వేస్తుంది. ప్రతి సీన్‌ను ఎంతో నీట్‌గా తీసిన మారుతి, డైలాగ్స్‌మీద శ్రద్ధపెట్టి వుంటే మంచి ఎంటర్‌టైనర్ అయ్యేది. అక్కడక్కడ సీన్స్ బాగానే కుదిరాయి. సంగీతం ఫర్వాలేదు. సినిమాలో మంచి సందేశం వుంది. నేటి యువతకు ఇది సరిపోయే సినిమా. కానీ ద్వంద్వార్థాలు తగ్గిస్తే చాలా బాగుండేది.
- ఎ.గణేష్, రాజమండ్రి
యువతని చెడగొట్టకండి ప్లీజ్..
సినిమా అనేది ప్రజల్ని(ప్రేక్షకుల్ని) రంజింపచేసేదే కాకుండా, వారిపై ప్రభావం చూపే ఒక శక్తివంతమైన సాధనం. ఇటువంటి సినిమా ప్రజల్ని బాగుపరిచే విధంగా ఉంటే బాగుంటుంది లేదా కనీసం వారిమానాన వారిని విడిచిపెట్టే విధంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తూ ‘బస్‌స్టాప్’ అనే ఒక పచ్చి బూతు సినిమాని తీసి యువతని మభ్యపెట్టి, కాస్త సొమ్ముచేసుకుంటే చేసుకున్నారు ఏమోగానీ యువతని ఖచ్చితంగా చెడగొట్టి, పెడద్రోవ పట్టించింది ఈ సినిమా. ప్రేమ అనే పరమ పవిత్రమైన విషయాన్ని, ఇంత వెగటు బూతులతో కలగలిపి ‘బస్ స్టాప్’అనే ఛండాలపు సినిమా తియ్యటం శోచనీయం. వివిధ విశే్లషణల ద్వారా వ్యక్తం అయిన వ్యతిరేకతనీ పరిగణించి, నిర్మాత-దర్శకులు ఇహనుండి యువతని చెడగొట్టే సినిమాలు తియ్యకండి. యువతని చెడగొట్టకండి.
- షేక్ అబ్దుల్ మజీద్, ముదినేపల్లి
‘బస్ స్టాప్’ మారుతి షెడ్డు
‘ఈరోజుల్లో’ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘‘బస్ స్టాప్’’ చిత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కి చేరలేకపోయింది. ఈ సినిమాకి వచ్చిన బూతు సినిమా అనే టాక్ నూటికి నూరుపాళ్ళు నిజమే. సినిమాలో ఆడవారు (సీమలాంటివారు) మగాళ్ళను చెడగొట్టిన, చివరకు ఆమెను మంచిదానిగా చూపిన తీరు, ప్రేమికులను తక్కువచేసి చూపడం, అసలు ప్రేమించడమే పెద్ద నేరంగా (పెండ్లికాని యువతీ యువకుడు) తెరపై మలచిన విధానంతో దర్శకుని లోపం బహిరంగంగానే స్పష్టమవుతుంది. ఇక కథకు వస్తే ప్రిన్స్(శ్రీను), శ్రీదివ్య (శైలు) పెద్దవారికి తెలియకుండా ప్రేమించుకుంటారు. ఈ విషయం తండ్రికి తెలిసి, శైలును ఇంట్లోంచి వెళ్ళమంటాడు. చివరకు ఇంట్లోని ఆంక్షలను భరించలేక శ్రీనుతో, శైలు లైఫ్‌సెట్ చేసుకుంటుంది. తర్వాత శైలు బాధకు చలించిన శ్రీను, పంతాలు (ఇగోలు) పక్కకుపెట్టి శైలును తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడంతో సినిమా ముగుస్తుంది. ప్రిన్స్ డైలాగ్ డెలివరీతోపాటు, నటనలో డాన్సుల్లో చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇతర నటుల పెర్ఫార్మెన్స్ బాగుంది. సెల్‌ఫోన్‌ను అడ్డంపెట్టుకుని, ఇన్‌డైరెక్ట్‌గా బూతులు పలికించాడు. రక్షిత(సీమ), రావురమేష్ పాత్రలు చిత్రంలో ప్రధానమైన రక్షిత (సీమపాత్ర వేస్ట్) 2లైన్ల స్టోరీని 2గంటలు బూతులతో నింపిన మారుతికి సినీ జ్ఞానోదయం ఎప్పుడవుతుందో?
- బి.కృష్ణమాచారి, హైదరాబాద్
ప్రభాకర్‌రెడ్డిని మరిచిన చిత్ర సీమ
క్యారెక్టర్ నటునిగా, విలక్షణమైన విలన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నటుడు డాక్టర్ మందాడి ప్రభాకర్‌రెడ్డి. ప్రస్తుతం అతన్ని తెలుగు చిత్ర పరిశ్రమ మరిచిపోవడం దురదృష్టకరం. అనేక సినిమాలను నిర్మించడమే కాకుండా విలక్షణమైన క్యారెక్టర్ నటునిగా, విభిన్నమైన విలన్‌గా అందరికి సుపరిచితులు ఆయన గతించి ఎళ్లు గడుస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఏనాడు కూడా కనీసం మననం చేసుకున్నది లేదు. నాటితరం నటులు రాజనాల, నాగభూషణం, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అక్కినేని నాగేశ్వరరావు, మోహన్‌బాబు తదితర నటులతో ప్రభాకర్‌రెడ్డి కలిసి నటించారు.
ఆయన 1972లో తీసిన పండంటి కాపురం సినిమాకు జాతీయ అవార్డుతో పాటు 1982లో గృహలక్ష్మి, 1973లో గాంధీపుట్టిన దేశం, 1980లో యువరక్తం, 1981లో పల్లె పిలిచింది, 1990లో చిన్నకోడలు వంటి కుటుంబ కథ సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు. 1935లో నల్గొండ జిల్లా తుంగతుర్తి జన్మించిన ఎం. ప్రభాకర్‌రెడ్డి 1997లో మృతి చెందారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వైద్య శాస్త్రాన్ని అభ్యాసించిన అంతా సినిమాలనే నమ్ముకుని తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఉన్నతమైన భావాలతో చాల చక్కని సినిమాలను రూపొందించారు. అ ప్రాంత నటులకైతే అవార్డులు, రివార్డులు, విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రాంత నటుడని ప్రభాకర్‌రెడ్డిని వివక్షతో మరిచిపోవడం సాటి కళామతల్లి బిడ్డలకు తగదు. ఇప్పటికైనా ఈ ప్రాంత నటులైనా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
- ఎన్ జయపాల్, జగిత్యాల,
కథలో కొత్తదనం వుంది
‘తుపాకి’ సినిమా 2012 సంవత్సరానికి సూపర్‌హిట్ సినిమాగా ఎంపిక కావాలని కోరుతూ వున్నాం. డైరెక్టర్‌కు ప్రత్యేక అభినందనలు. కథలో కొత్తదనం వుంది. ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు. ఎడిటింగ్ బాగుంది. ప్రతీ ఒక్కరి నటన సూపర్. ఈ చిత్రం తెలుగు దర్శకులు, హీరోలు చూసి ఇకనైనా మంచి చిత్రాలుతీస్తే మంచిది. ఎంతసేపూ ఆరు డాన్స్‌లు, 6పాటలు, 6 ఫైట్లు ఉంటే హిట్ అవుతుందని అనుకుంటారు. వెయ్యి థియేటర్లలో రిలీజ్ చేసారు. ఇది రికార్డ్‌బ్రేక్. చక్కనైన కథతో సరిక్రొత్త ప్రయోగం చేస్తామని లేదు. హీరో పెళ్ళి విషయంలో చక్కగా మలుపుతో చిత్రానికి మంచి పేరు వచ్చింది.
- అందవరపు నాగేశ్వరరావు, పలాస
ప్రతిభకు తార్కాణం
నవంబర్ 2 వెనె్నలలో అనువాద చక్రవర్తులు శ్రీశ్రీ, అనిశెట్టిగారి అనువాద చిత్రాలు రచన చేసిన వీరిద్దరి గురించి ‘్ఫ్లష్‌బ్యాక్’లో చదివి సాహిత్య అభిలాష కలిగించినట్లున్నది. ఇక శ్రీశ్రీగారి రచనావ్యాసంలో పలు చిత్రాలు జీవంపోసుకున్నాయి. అలాగే అనిశెట్టి అనువాద చిత్రాలు తెరకెక్కి మంచి ఫలితాలను అందించింది. శ్రీశ్రీ, అనిశెట్టిగార్ల కలంనుండి జాలువారిన గీతాలు, సంభాషణలు వారి ప్రతిభకు తార్కాణం. శ్రీశ్రీగారు మనమధ్య లేకపోయినా అనువాద చిత్రాలకేకాక మిగతా సినిమాలకు, విప్లవాత్మక పాటలు, ప్రబోధగీతాలు కలకాలం గుర్తుండిపోయేలా వున్నాయి. వారు అనువదించిన పాటలన్నీ ఘంటసాల ఆలపించడం కొసమెరుపు.
- మార్కస్‌మణిరాజ్, ముద్దనూరు
‘దేనికైనా రెడీ’ చిత్రం అనుచితం
‘సినిమాను మరో సృష్టిగా’ పోల్చాడు ప్రఖ్యాత రచయిత షేక్స్‌పియర్. సినిమా తెరను ప్రపంచంగా వెండితెరపై పడే వెనె్నలలో వికసించే జీవితాలని ఆధ్యాత్మికంగా తేల్చిచెప్పాడు మహానుభావుడు షేక్స్‌పియర్. ‘సినిమా సినిమా లాగానే చూడాలని’ అంటాడు ఓ ప్రబుద్ధుడు. అంటే చూసే రెండు గంటలు మనస్సు, మెదడు పనిచేయకుండా చూసి నవ్వుకుంటూ పోవాలనా? అప్పుడు చిత్రం పిల్లలకే అవుతుంది. దానికి ‘ఈగ’లాంటి సినిమాలు చాలు. సినిమా కేవలం వినోదానికే అయితే తోలుబొమ్మలాటలు చాలు.
నేటి సినిమాలలో కట్టు, బొట్టు, పిలక, మంత్రోశ్చారణకి హాస్యానికి మసాల అయింది. డబ్బు సంపాదించటానికి నిలయమైంది.
చిత్రసీమలో బ్రాహ్మణుల కట్టుబొట్టు, పిలక, సంస్కార, సంప్రదాయాలపై దాడి చేయబడినది. లోగడ ‘అదుర్స్’సినిమాలో వైష్ణవులకు అవమానం జరిగింది. అప్పుడు వారు దానిని మీడియా ద్వారా ఖండించారు.
అప్పుడు దానిని ఎవరు పట్టించుకోలేదు. నేడు వైదిక బ్రాహ్మణుల యజ్ఞయాగాదుల మీద దాడి జరిగింది. దానికి కారణం బ్రాహ్మణులలో ఐక్యత లోపించటం వలననే జరుగుతున్నది. ఇప్పటికైనా బ్రాహ్మణ సంఘం ఐక్యత ఏర్పడినందుకు సంతోషం. ఇది ఇలానే విడవకుండా సాగితే ఆనందమవుతుంది. మొదటినుండి బ్రాహ్మణులలో అమాయకత్వం, బలహీనత, విధేయత ఉండబట్టే వారిని గోవు, గొఱ్ఱె, మేకలా చూస్తూ వచ్చారు. ఇప్పుడు మూడు కలిసి నమ్ముకున్న దైవస్వరూపాలు కృష్ణుడు, ఏసు, అల్లా వారి కృప బ్రాహ్మణులకు తోడైయింది. వారిలో ఐక్యత, బలము ఏర్పడినది. ఒక చిత్రం ‘బ్రాహ్మణిజం’పై విజయం సాధించారు. మరి ఈ చిత్రం సంప్రదాయ కుటుంబ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న మహిళపై అసభ్య సన్నివేశాల గురించి ఏమి చెపుతున్నారు.
కట్టు, బొట్టు, పిలక, మంత్రోశ్చరణం, సంప్రదాయాలు, పూజలు దేవాలయములందు నిత్యం జరిగేవి. కనుక అపవిత్రం చేయడం మంచిది కాదు. ‘స్ర్తి’అంటే ఓ బ్రాహ్మణ స్ర్తియేకాదు స్ర్తి జాతిని అవమానపరచినట్లవుతుంది. ‘స్ర్తి’అంటే ప్రఖ్యాత దాశరధి రచయిత నిర్వచనం చెప్పాడు. ఆలయాన వెలసిన దేవుడి రీతి ఇల్లాలే రుూ జగతికి మూలమని చెప్పాడు. బ్రాహ్మణులు, పురోహితులు, దేశ క్షేమంకోరేవారు వారిపై దాడి, గాయపరచటం దేశ క్షేమమనిపించుకోదు.
- జమలాపురం ప్రసాదరావు, ఖమ్మం
‘మీ వ్యూస్’కు
మీ అభిప్రాయాలను పంపవలసిన
మా చిరునామా : ఎడిటర్, వెనె్నల,
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ ,
సికిందరాబాద్- 500003