Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వేట ‘సాగింది!’

$
0
0

** తలాష్ (పర్వాలేదు)

తారాగణం: అమీర్‌ఖాన్, కరీనా కపూర్, రాణీ ముఖర్జీ, నవాజ్ సిద్దిఖి, రాజ్‌కుమార్ యాదవ్, షీబా చద్దా తదితరులు
సంగీతం: రామ్ సంపత్
నిర్మాతలు: అమీర్‌ఖాన్, ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ
దర్శకత్వం: రీమా కడ్కి

అతడు డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు. ఏ విషయాన్నైనా తనదైన కోణంలోంచి చూస్తాడు. అందువల్లనేనేమో? ప్రేక్షకుల్లో ఒక అంచనా. కళ్లు మూసుకొని కథని చూడొచ్చునన్న ధీమా. ‘లగాన్’లో బ్రిటీష్ రాజరికాన్ని వ్యతిరేకిస్తూనే - ‘క్రికెట్’ కానె్సప్ట్‌ని వీక్షకులపైకి వదిలాడు. ‘తారే జమీన్ పర్’ అంటూ పిల్లల మనసు లోతుల్లోకి చొరబడి తారల్ని నేలకి దింపాడు. ఇలా- చెప్పుకుంటూ పోతే.. అమీర్‌ఖాన్ ఆలోచనలు ఎంత బలంగా ప్రేక్షకుల్లో నాటగలడో అర్థమవుతుంది. ఈసారి -‘తలాష్’ అంటూ క్రైం థిల్లర్ కథని నడిపించాడు. ఒకానొక ఆంగ్ల నవల (‘యాక్ట్ ఆఫ్ ప్రావిడెన్స్’) నుంచీ కథని కొట్టేశాడనీ.. ‘షట్టర్ ఐలాండ్’ అనే మరో కథలోంచి కొన్ని సన్నివేశాలు తీసుకున్నాడనీ - అనుకుంటున్నప్పటికీ.. కథని మన నేటివిటీకి తగ్గట్టు ప్రెజెంట్ చేశాడా? లేదా? అన్నది ముఖ్యం. కథాలోతుల్లోకి ప్రేక్షకుల్ని తీసుకువెళ్లాడా? లేదా? అన్నది మరో అంశం. ఏది ఏమైనప్పటికీ - ఈ ‘వేట’ (తలాష్) క్రైం మిస్టరీ కథతో ‘ఖాన్’ మరో ఎపిసోడ్‌కి తెర తీశాడు. ముంబై వీధులూ.. చీకటి రాత్రులు - అట్టడుగు జీవితాలూ.. సెక్స్ వర్కర్స్ సంగతులూ - ఎన్నో కథలు బాలీవుడ్‌లో వచ్చాయి. కానీ - ఎవరూ ఎంచుకోని బొంబాయి పాత వీధుల్ని ఎంచుకొని.. సినిమా మొత్తం చీకటి తెరల మధ్య నడిపించాడు.
అర్ధరాత్రి - ముంబైలోని ఓ వీధి. నిర్మానుష్యంగా. సినిమా పోస్టర్లు అంటించే వ్యక్తి సైకిల్‌పై నెమ్మదిగా వస్తూంటాడు. ఎదురుగ్గా వేగంగా వస్తున్న ఓ కారు. ఉన్నట్టుండి ఎవరో అడ్డు వచ్చినట్టు సడెన్ బ్రేక్‌తో పేవ్‌మెంట్‌కి డాష్ ఇచ్చి.. సముద్రంలో పడిపోతుంది. కారులోని వ్యక్తి ప్రముఖ సినీ నటుడు అర్మాన్. ఇనె్వస్టిగేషన్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ షెకావత్ (అమీర్‌ఖాన్) కేసుని ఇనె్వస్టిగేట్ చేయటానికి బయల్దేరతాడు. గత కొద్ది నెలలుగా ఆ రోడ్డుపై అనుకోని విధంగా యాక్సిడెంట్లు జరుగుతూంటాయి. ఇనె్వస్టిగేషన్‌కి ఎటువంటి ‘క్లూ’ దొరకదు. ఏమిటీ మిస్టరీ? ఈ పజిల్‌ని ఛేదించటం ఎలా? షెకావత్ ఈ కేసుని టేకప్ చేసింత్తర్వాత అతనికి సెక్స్ వర్కర్ రోజీ (కరీనా కపూర్)తో పరిచయం ఏర్పడుతుంది. అమితంగా ప్రేమించే కన్న కొడుకును పోగొట్టుకొని అప్పటికే భార్య రోషిణి (రాణీ ముఖర్జీ)తో ముభావంగా ఉంటూన్న షెకావత్‌కి రోజీ మాటలు కాస్తంత ఊరట నిస్తాయి. కొడుకు తన నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడన్న భావన అతడిలో పాతుకు పోతుంది. రోషిణి ముఖంలో చిరునవ్వు మాయమవుతుంది. దాంతో షెకావత్ వర్క్ హాలిక్‌గా మారిపోతాడు. కేసు ఇనె్వస్టిగేషన్ అంటూ రాత్రిళ్లు ఇంటి పట్టున ఉండడు. ఇంట్లో వొంటరిగా నిద్రలేని రాత్రిళ్లు గడుపుతూంటుంది రోషిణి. ఆమెకి అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటూన్న ఒకామెతో పరిచయమవుతుంది. ఆమెకు ఆత్మలను ఆవాహన చేసుకోవటం తెలుసు. చనిపోయిన మీ అబ్బాయితో నేను మాట్లాడతానంటుంది. రోషిణి ఆమె మాటల్ని నమ్ముతుంది గానీ షెకావత్ నమ్మడు. మరణించిన వ్యక్తితో మాట్లాడ్డం అసాధ్యమంటాడు. మరోవైపు కేసులో ఒకో లింక్‌ని తెగ్గొట్టుకుంటూ వస్తాడు. కేసు విషయంలో సెక్స్ వర్కర్ రోజీ సహాయపడుతుంది. ఈ అంతుచిక్కని యాక్సిడెంట్ల వెనుక ఉన్నది ఎవరు? మరణిస్తున్న వ్యక్తులకూ.. ఆ రోడ్డుకి ఏదైనా సంబంధం ఉందా? సినీ నటుడు అర్మాన్‌ని ఎవరైనా హత్య చేయించారా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ కథ ముగింపునకు వస్తుంది.
హిందీ స్క్రీన్‌పై ఇటువంటి కథలు ఇప్పటికే చూసి ఉన్నప్పటికీ - అమీర్‌ఖాన్ నటన.. కథలో సస్పెన్స్ ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కానీ - కథ ఎంతో స్లోగా నడుస్తుంది - మంద్ర స్థాయిలో సాగే నేపథ్య సంగీతంలా. ఒక్కోసారి లెంగ్తీ సన్నివేశాలు మనల్ని నిద్రలోకి జారుకునేట్టు చేస్తాయి. సముద్రపు ఒడ్డున నిశ్శబ్ద ప్రదేశంలో రోజీ - షెకావత్ మాటలు నర్మగర్భంగా ఉన్నప్పటికీ.. కథ ఎంతకీ సాగదేం అనిపిస్తుంది. ఐతే చక్కటి ముగింపు. సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూకి క్రైం థ్రిల్లర్‌ని జోడించి.. ఇంకోవైపు మనసు తెరల్ని స్పృశిస్తూంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి? అన్న దానితో మొదలై కథ ఒక్కసారిగా సముద్రమంతగా మారుతుంది. నవలగా చదువుకోటానికీ.. సినిమాగా తీయటానికీ మధ్య ‘తెర’ని సరిగ్గా టాకిల్ చేయకపోతే కథలో పట్టు పోతుంది. కానీ అమీర్‌ఖాన్ ఎక్కడా తడబడలేదు. తను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెబుతూ వచ్చాడు. వీటికితోడు కథకురాలు.. దర్శకురాలు కలిసి చక్కటి టీమ్ వర్క్ చేశారు. ముంబై నేపథ్యాన్ని చక్కగా క్యాచ్ చేయగలిగారు. ఇక పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే - అమీర్‌ఖాన్ ఇనె్వస్టిగేషన్ ఇన్‌స్పెక్టర్‌గా.. కొడుకు కోల్పోయిన తండ్రిగా.. చక్కగా నటించాడు. రాణీముఖర్జీ డీ గ్లామర్ రోల్‌ని పండించింది. కరీనా కపూర్ నటనలో పేరు పెట్టాల్సింది లేదు. గ్లామర్ రోల్‌ని కురచ కాస్ట్యూమ్స్‌లో ప్రేక్షకులకు ‘మాస్ మసాలా’ని అందించింది. మిగతావన్నీ చిన్న పాత్రలే. కానీ నవాజుద్దీన్ సిద్దిఖి గురించి కాస్తంత చెప్పుకోవాలి. తనకి తెలిసిన విషయంలోంచి ‘బ్లాక్‌మెయిల్’ చేయటానికి చూసి హత్యకి గురైన పాత్రలో వొదిగిపోయాడు. దర్శకురాలు మేకప్ విషయంలోనూ శ్రద్ధ పెట్టింది. నేపథ్య సంగీతం బాగుంది. హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. ‘జియా లగే న’ పాట వినసొంపుగా ఉంది. ఆనంద్ కాశ్యప్ ఎడిటింగ్ ఓకే. ముంబై రెడ్‌లైట్ ఏరియానూ.. ఇరుకు గల్లీలనూ చక్కగా చిత్రీకరించారు. దర్శకురాలు రీమా ప్రతిభ గురించి చెప్పాల్సిన పనిలేదు. మాటలు ఓకే.

అతడు డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు. ఏ విషయాన్నైనా తనదైన
english title: 
talash
author: 
-బిఎన్కే

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>