** కృష్ణం వందే జగద్గురుమ్ (పర్వాలేదు)
తారాగణం: రానా దగ్గుబాటి, నయనతార, వెంకటేశ్, సమీరారెడ్డి, కోట శ్రీనివాసరావు
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: సాయ బాబు జాగర్లమూడి, వై.రాజిరెడ్డి
దర్శకత్వం: రాధాకృష్ణ
క్రిష్.. తెలుగునాట కాస్తయినా సృజన కనబర్చాలని ప్రయత్నించే అతి కొద్దిమంది దర్శకుల్లో ఒకడు. మానవీయ సంబంధాలను, సామాజికాంశాలను నిజాయతీగా తెరకెక్కించాలని ప్రయత్నించేవాడు. గమ్యం, వేదం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న క్రిష్, తొలిసారి, కమర్షియల్ అంశాలను మేళవించి, తాను అనుకున్నది చెప్పాలనే కొత్త బాట పట్టే ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నమే కృష్ణం వందే జగద్గురుమ్.
సురభి నాటక సమాజం పెద్ద సుబ్రహ్మణ్యం (కోట). ప్రేక్షకులు నాటకాలను ఆదరించడం మానేసారన్న ఆవేదన, సరిపడా సంపాదన రావడం లేదన్న ఆక్రోశం కలిసి, అతగాడి ట్రూప్‌లో వున్నవారు వేరే మార్గాల వైపు నడవాలని చూస్తారు. సుబ్రహ్మణ్యం పెంచుకున్న బీటెక్ బాబు(రానా) కూడా అలాగే ఆలోచించడంతో, కలత చెంది, కనుమూస్తాడు. దీంతో తాత ఆఖరి కోర్కెలు తీర్చేందుకు బళ్లారి వస్తారు నాటక సమాజం సభ్యులు.
అక్కడ ఇనుప ఖనిజం మైనింగ్ కోసం భూమిని దొలిచేస్తూ, అడ్డు వచ్చిన వారిని అంతం చేస్తూ, లక్ష కోట్లు గడించి భూబకాసురిడిలా తయారవుతాడు రెడ్డప్ప(మిలింద్ గునాజి). అతగాడి వ్యవహారాలను, రహస్యంగా డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి వెల్లడించాలని ప్రయత్నిస్తుంటుంది దేవకి (నయనతార). ఈ నేపథ్యంలో అనుకోకుండా రెడ్డప్ప మనుషులతో తగాదా వస్తుంది నాటకం బృందానికి. అప్పుడు తెలుస్తుంది బీటెక్ బాబుకు, తాను అనాధను కానని, మేనమామ చక్రవర్తి (మురళీశర్మ) తనను అనాధను చేసాడని. దీంతో పగతీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆఖరుకు దుష్ట శిక్షణ ఏ విధంగా జరిగిందన్నది మిగిలిన సినిమా.
క్రిష్‌కు మొదట్నించీ ఒకే సినిమాలో రెండు లేదా అంతకు మించిన అంశాలను మేళవించి, వాటి విభిన్న పార్శ్వాలను స్పశించడం అలవాటు. అదే కనిపిస్తుంది గమ్యం, వేదం సినిమాల్లో. అయితే గమ్యంలో నటులు చిన్నవారు కావడం, వేదంలో అల్లు అర్జున్ హీరోయిజమ్‌ను పక్కన పెట్టడంతో, క్రిష్‌కు స్క్రిప్ట్ రాసుకోవడం సులువయింది. అయితే ఈసారి మాత్రం మాస్ జనాన్ని కూడా సినిమాకు కచ్చితంగా రప్పించాలని, కమర్షియల్ ఫార్ములాలు సైతం ఇందులో ఇమడాలని క్రిష్ అనుకున్నాడో, లేక రానాబాబు కాంపౌండ్ మహత్యమో, స్క్రిప్ట్ పక్కదారి పట్టింది. రెండు అయిటమ్ సాంగ్‌లు, అతకని కామెడీ ట్రాక్, రివెంజ్ డ్రామా వంటివి చోటు చేసుకుని, దర్శకుడు తాను చర్చించాలని అనుకున్న అంశాలను అలా అలా పైపైన టచ్ చేసి వదిలేయాల్సి వచ్చింది. అసలు కృష్ణం వందే జగద్గురుమ్ అన్న టైటిల్‌ను, దేవుడంటే..సాయం, అన్న కొత్తఅర్థం చెప్పిన వైనానికి కానీ, అటు పర్యావరణానికి పెనుముప్పు అయిన మైనింగ్ మాఫియా, దాని వెనుక వున్న రాజకీయాలను కానీ, ఇటు అసలు నాటకాలు ఎందుకు జనానికి దూరమవుతున్నాయన్న సంగతిని కానీ, ఇలా దేని విషయంలోనూ సరియైన చర్చను స్క్రీన్‌పైకి తేలేకపోయాడు. గత సినిమాల్లోలా రాజీపడకుండా, కమర్షియల్ అంశాలను పక్కన పెట్టి వుంటే, ఆ స్పేస్ అంతటినీ ఈ చర్చలకు వాడుకునే అవకాశం లభించేది. పైగా కీలకమైన కృష్ణం వందే జగద్గురుమ్ అన్న కానె్సప్ట్ ఏమిటో? సాయమే దేవుడు అన్న దానికి పరమార్థం ఏ విధంగా కీలకమో అన్నది కామన్ ప్రేక్షకులకు చేరవేయడంలో కూడా విఫలమయ్యాడు దర్శకుడు.
సురభి సమాజపు థ్రెడ్, హీరో రానా స్టామినాను తెరపైకి తేవడానికే పరిమితమైంది. జనానికి కనిపించేది ఒకటే, అమ్మా, నాన్నను చంపినవాళ్లపై హీరో పగతీర్చుకున్నాడన్న సగటు తెలుగు సినిమా ఫార్ములా. బళ్లారిలో ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికే భయపడేంత బిల్డప్‌ను విశ్రాంతి వరకు నడిపించి, చాలా మంది సగటు తెలుగు దర్శకుల్లాగానే, క్లయిమాక్స్‌ను చటుక్కున జారవిడిచి, హీరో చేతిలో విలన్‌ను పుటుక్కున చంపేయడం కూడా అతి పెద్ద మైనస్. సెకండాఫ్‌లో అయిటమ్ సాంగ్, బ్రహ్మానందం కామెడీ ఇవన్నీ క్రిష్ చేతులు కట్టేసాయి. బహుశా రానాను కాకుండా మళ్లీ శర్వానంద్‌లాంటి మీడియమ్ రేంజ్ హీరోను తీసుకుని వుంటే, క్రిష్ మరింత స్వేచ్ఛగా ఈ సబ్జెక్ట్‌ను డీల్ చేసి వుండేవాడేమో?
స్క్రిప్ట్‌లో తడబడినంత మాత్రాన క్రిష్‌ను తక్కువ చేయడానికి లేదు. దాదాపు నటీనటులందరి నుంచి, మంచి నటన రాబట్టడంలో కానీ, సాంకేతిక నిపుణుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవడంలో కానీ, అద్భుతమైన పనితీరును ప్రదర్శించాడు. అందువల్ల రానా బాగా చేసాడు. మిలింద్ గునాజీ బాగా సూటయ్యాడు, నయనతార పాత్రలో ఇమిడిపోయింది.. అని చెప్పుకోనక్కరలేదు. అదే సమయంలో సినిమాటోగ్రాఫర్ విఎస్ గుణశేఖర్, మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ మంచి సహకారం అందించారు. సన్నివేశాలకు తగిన మూడ్‌ను లైటింగ్ ద్వారా తీసుకురావడంలో, చేజింగ్ సీన్లలో గుణశేఖర్ సామర్థ్యం ప్రశంసాపాత్రం. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో కాస్త డెప్త్ వున్న డైలాగులు ఈ సినిమాలో వినిపించాయి. కొన్నింటిని ఇక్కడ కోట్ చేయడం అంటే, చాలా వాటిని వదిలేయడమే అవుతుంది.
మొహమాటం లేకుండా చెప్పాలంటే, ఆపాటి డైలాగులు కూడా లేకపోతే, క్రిష్ చెప్పాలనుకున్నది తెరపై నుంచి పూర్తిగా మాయమయ్యేది. మణిశర్మ మరోసారి బాణీల విషయంలో విఫలమయ్యాడు. నేపథ్యం ఓకె. కానీ పదే పదే కృష్ణం వందే జగద్గురుమ్ అంటూ అరుపులే ఆర్ ఆర్ అనుకుంటే ఎలా అనిపిస్తుంది. సిరివెనె్నల రాసిన ‘జరుగుతున్నది జగన్నాటకం’లో పదాలు, వాటి అల్లిక బాగా వుంది కానీ, మణిశర్మ వాయిద్య హోరులో అవి సరిగ్గా ప్రేక్షకులకు రీచ్ కాలేదు. పైగా క్లయిమాక్స్ హడావుడిలో అది కలిసిపోవడం మరో మైనస్.