సినిమాల్లో హీరోగా రాణించాలని.. చిన్న పాత్రలోనైనా తళుక్కున మెరవాలని.. టెక్నీషియన్‌గా పేరుతెచ్చుకోవాలని యంగ్ స్టర్స్‌లో చాలామంది కలలుకంటారు. కానీ సినిమా ప్రపంచం చాలా విచిత్రమైంది. టాలెంట్ కంటే ఎక్కువ శాతం వారసత్వాలకు, రికమెండేషన్‌లకే అక్కడ స్థానమని తెలిసినా, ఆశను గుండెల్లో దాచుకుని ఛాన్స్‌కోసం షూటింగ్ స్పాట్‌ల వెంట.. స్టూడియోల చుట్టూ కసిగా తిరిగేవారి శాతం ఎక్కువగా కనిపించడం తెలిసిందే!
ఒకప్పటికంటే యిప్పుడు కొత్తవారితో సినిమాలకు శ్రీకారంచుట్టే సంస్థలు ఎక్కువయ్యాయి. వీటిలో అవకాశం యిస్తే మాకేంటంట! అని ప్రశ్నించేవీ లేకపోలేదు. అయితే కొన్ని సంస్థలు ప్రధాన పాత్రలతోపాటు సపోర్టింగ్ పాత్రలను కూడా కొత్తవారికే అని బిల్డప్ యిచ్చినా కొద్ది రోజుల తర్వాత ప్రధాన పాత్రధారుల బ్యాక్‌బోనులు యిండస్ట్రీ పెద్దలేనని తెలిసి వాపోక తప్పదు.
సినిమా యిండస్ట్రీలో యిలాంటి చిత్రాలు కామనైపోవడంతో యంగ్‌స్టర్స్ తమ ఆశలపై కాసిన్ని నీళ్ళు జల్లి చల్చార్చుకుని కెరీర్ వైపు పరిగెడుతున్నారు. కాలం తీసుకొచ్చిన మార్పుల ఫలితంగా నేడు యంగ్ స్టర్స్ తమ సినిమా కలను పండించుకోవడమే కాదు కాసులను కూడా సంపాదించుకుంటున్నారు. తమ టాలెంట్‌కి తగినంత గుర్తింపుని తెచ్చుకుని వెండితెర ఆహ్వానాలను సైతం అందుకుంటున్నారు.
అదెలా? అంటారా?! అదంతా అంతర్జాలం (ఇంటర్‌నెట్) మహిమ. ప్రపంచానే్న కుగ్రామంచేస్తున్న ఈ టెక్నాల జీలో యూత్ సినిమా కలలను నెరవేర్చడానికి యూట్యూబ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే నేడు సినిమా వ్యామోహం వున్న వేలాది మంది తమ కలలకు లఘు చిత్రంగా రూపం యిచ్చి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. హిట్స్ (చూసేవారి సంఖ్య)ను పెంచుకోవడానికి ఫేస్‌బుక్..ఆర్క్యూట్.. ట్విట్టర్ వంటి అనేక సైట్లను వుపయోగించుకుంటున్నారు.
సినిమాకి ఆది లఘు చిత్రమే. లఘు చిత్రమంటే కేవలం నిమిషాల్లోనే ముగిసిపోతుంది. ఎన్ని తక్కువ నిమిషాల్లో విషయాన్ని చెప్పగలిగితే అంత క్రియేటివిటీ దర్శకుడి దగ్గర వున్నట్టన్నమాట. నిడివి 10-15 నిమిషాలు కూడా వున్న చిత్రాలు యూ ట్యూబ్‌లో దర్శనమిచ్చినా అవి నెటిజన్లకు (నెట్ చూసేవారు) నచ్చాలి. అప్పుడే హిట్స్ సంఖ్య పెరుగుతుంది.
లఘు చిత్రం తీయాలంటే ముందుగా చిన్న థీమ్‌ని తయారుచేసుకోవాలి. అంతిమంగా మెసేజ్ (నీతి) వుంటుంది. ఒకటి రెండు పాత్రలైతే మరీ మంచిది. ఆసక్తికరమైన టైటిల్ పెట్టాలి. అప్పుడే ఎక్కువ మంది క్లిక్ చేస్తారు. మాటలు తక్కువగా వుండేటట్లు చూసుకుంటే రీరికార్డింగ్ అవసరం వుండదు. పైగా ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్పడంలో దర్శకుడి ప్రతిభ ఎక్కువగా గుర్తించబడుతుంది. యిలాంటి చిత్రాలకు పాటల అవసరం వుండదు. ఒకవేళలా పెట్టాలనుకుంటే ఓ నాలుగు లైన్లు సరళమైన యింగ్లీషులో వుంటే సరిపోతుంది. (ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కనుక)
లఘు చిత్రాలను తీయడానికి అయ్యే ఖర్చు రానురాను పెంచుకుపోతున్నారు. మొదట్లో వందల్లోనే ఈ ఖర్చు వుండేది. యిప్పుడు క్వాలిటీ పేరుతో వేలల్లోకి తీసుకుపోతున్నారు. నిజానికి అంత అనవసరం. ముఖ్యంగా మధ్యతరం యువకులు తమ సినిమా కలను రూ.500 నుండి 1000 లోపు పండించుకునే విధంగా థీమ్ రెడీ చేసుకోవాలి. క్వాలిటీ కలిగిన సెల్‌ఫోన్ల ద్వారా కూడా లఘుచిత్రాలు తీయవచ్చును. అయితే ఎడిటింగ్ ఫెసిలిటీ తప్పనిసరిగా వుండాలి. అలా కానిపక్షంలో తీసే ప్రతి షాట్ ప్రాక్టీస్ చేసి ఒకే షూట్‌లో ఓకే చేసుకోవాలి.
థీమ్ ఏదైనప్పటికీ షూటింగ్‌కి అనువుగా ముందే ప్రిపేర్ చేసుకోవాలి. నటీనటుల విషయంలో మీ ఫ్రెండ్స్‌ని ఎంచుకోవడం బెటర్. షూటింగ్ సమయం వీకెండ్స్.. సెలవుల్లో ఒకటిరెండు రోజులు మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. సహజమైన లైటింగ్‌నే వీలైనంతవరకు ఉపయోగించుకోవాలి. మాటలు తప్పకుండా తక్కువగా వుండేలా చూసుకుంటే స్పాట్‌లోనే రికార్డింగ్ అయ్యే విధంగా నటీనటుల చేత బిగ్గరగా చెప్పిస్తే సరిపోతుంది. లఘు చిత్రం పూర్తయ్యాకా సీన్స్‌కి అనుగుణంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేయాలంటే ఆల్‌రెడీ స్టోర్ చేయబడిన బిట్స్ వుపయోగించుకుంటే సరిపోతుంది.
నేడు 5డి కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అద్దెకిచ్చేవారి సంఖ్య కూడా పెరిగింది. కాకపోతే రోజుకి 8నుండి 10వేలు తీసుకునే పరిస్థితి. అలాంటప్పుడు నిడివి 10 నిమిషాల లఘుచిత్రమైనా 30వేలు వరకు అయ్యే అవకాశం వుంది. ఇదికాక రీ-రికార్డింగ్‌కి పోతే మరింత ఖర్చు పెరుగుతుంది. యిలా తీయాలంటే ముందుగా మనం లఘు చిత్రాల మేకర్‌గా మంచి పేరు సంపాదించుకోవాలి. అప్పుడే కాస్ట్ పెంచుకున్నా మనకు హిట్స్ సంఖ్య పెరిగి ఆదాయం పెరగవచ్చును.
లఘు చిత్రం తీసాకా దానిని యూట్యూబ్‌కి అప్‌లోడ్ చేసి దానిని నెట్‌జెన్‌లు చూడ్డానికి వీలుగా సైట్ వివరాలను సోషల్ సైట్లలో వుండేవారికి పోస్ట్ చేసుకోవాలి. మీరు నిర్మించిన లఘుచిత్రం ఎక్కువ హిట్స్ సాధిస్తుంటే ఆటోమేటిక్‌గా లఘుచిత్రాలను పొందుపరిచే సంస్థలు మీకు ఆహ్వానం పలుకుతాయి. ప్రకటనల ఆదాయం పెరిగితే మీకు ఆదాయం పెరుగుతుంది. హిట్స్ సంఖ్య పెరుగుతుంటే మీ ఆదాయం కూడా పెరుగుతుంది.
లఘు చిత్రాల ఫెస్టివల్స్‌కి కూడా మీ చిత్రాలను పంపుకోవచ్చును. యిలా పంపిన చిత్రాలకు అవార్డులతోపాటు బహుమతులను కూడా అందుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియకు కూడా ఇంటర్‌నెట్ తోడ్పడుతుంది. అతి తక్కువ ఖర్చుతో సరైన స్పార్క్ థీమ్స్‌ని లఘు చిత్రాలుగా మలచే సత్తా మీలో వుంటే ఈ రంగంలో మీరు కన్నకలలు నిజవౌతాయి. సినిమాకల వున్నవారిని ఎంచుకుంటే లఘుచిత్రాల నిర్మాణం మరింత శ్రద్ధగా జరుగుతుంది.
లఘు చిత్రాల ప్రదర్శనకు థియేటర్ల కొరత లేదు. అతి పెద్ద థియేటర్ అంతర్జాలమే. మీ చిత్రాలకు పోటీ చిత్రాలు విడుదలయినా మీరు నిశ్చింతగా వుండవచ్చు. పబ్లిసిటీ విషయంలో మీరే శ్రద్ధచూపుకోవాల్సి వుంటుంది. మీ చిత్రం నచ్చిందంటే మరో సినిమాకోసం మీ సైట్‌ని క్లిక్ చేసే అభిమానుల సంఖ్య పెరుగుతుంది. ప్రపంచంలో యూట్యూబ్ చిత్రాలను తిలకించే వారిలో భారతీయుల సంఖ్య 20శాతం వరకు కనిపిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.
నేడు గ్రామస్థాయిలో కూడా ఇంటర్‌నెట్ వినియోగంలో వుంది. కాబట్టి మీరు ఏమాత్రం వెనుకంజ వేయకుండా లక్షలాది థియేటర్లలో (చూసేవారికి) మీ లఘుచిత్రంను రిలీజ్ చేయవచ్చును. ఇది గమనించే నేడు హైప్రొఫెషన్ నుండి చదువుకునే విద్యార్థుల వరకు లఘు చిత్రాలను తీయడంలో ఆసక్తిని కనబరుస్తున్నారు.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో ప్రముఖులుగా కొనసాగుతున్న కొందరు టెక్నీషియన్లు.. నటీనటులు లఘుచిత్రాల నుండి వచ్చినవారే! లఘు చిత్రాల నిర్మాణంపై మీకు పట్టుదొరికిందంటే హోమ్‌ప్రొడక్షన్‌గా వరస చిత్రాలు తీసేయవచ్చు. మీ చిత్రాలకోసం వేచిచూసే నెటిజన్లు కూడా ఏర్పడిపోతారు. పైగా పైరసీ బాధ కూడా వుండదు.
ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అంటూ కాళ్ళు అరిగెలా తిరిగే బాధ.. కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూసే అవసరం మీకు లేకుండా చేస్తుందీ యూ ట్యూబ్ లఘుచిత్రం. మీరు కన్నకలలు సాకారమైనపుడు మీరు పొందే ఆనందం అంతాయింతా కాదు. పాకెట్ మనీతో మొదలైన మేకింగ్ గణనీయమైన పెట్టుబడులు పెట్టేంతవరకు వెళ్ళిందంటేనే లఘుచిత్రాలు ఏ విధంగా ఇంటర్నెట్‌లో ఆదరించబడుతున్నాయో అర్థవౌతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా శ్రీకారం చుట్టండి. యూ ట్యూబ్ చిత్రాలతో కలలు పండించుకోండి! స్టార్లూ కండి!!
సినిమాల్లో హీరోగా రాణించాలని.. చిన్న పాత్రలోనైనా తళుక్కున
english title:
you tube
Date:
Friday, December 7, 2012