ఈ సినిమా చాలా బాగుంది కాని ఎందుకు సరిగ్గా ఆడలేదు.
అరె ఈ సినిమాలో కథ లేదు లాజిక్ లేదు. కానీ ఇండస్ట్రి హిట్ అటా!
‘మొన్నామధ్య వేదం సినిమా చూసాను ఎమోషనల్‌గా ఉంది కాని, వారం రోజులకే తీసేశారు. అందుకే ఈ ప్రేక్షకులది తప్పు. వీళ్ళకి లాజిక్‌తో సంబంధం లేకుండా అదే మూసధోరణికి మాస్ పేరుతో, నేను అది చేస్తా ఇది చేస్తా, నా ఫ్యాన్స్, నా వంశం అంటూ ఓ ఇంట్రడక్షన్ సాంగ్.
ఇక డ్యాన్స్ కిందమీద పడిలేసి బాగా కష్టపడి రెండుమూడు (మ్యూజిక్‌తో సంబంధం లేకుండా) సర్కస్ ఫీట్స్‌చేస్తే సరి. ఇక ఫైట్ ఎంతమంది ఎన్ని ఆయుధాలతో వచ్చినా అందరు క్రిందపడి చావల్సిందే. ఎందుకంటే ఒకడ్ని కొట్టాక, వాడు కిందపడ్డాకే అవసరం అయితే ఒక పేజి డైలాగ్ చెప్పాకే ఇంకొకడు వస్తాడు కాబట్టి. ఇక ఎంత పవర్‌ఫుల్ విలన్ అయినాసరే క్లైమాక్స్‌లో మన కుర్రహీరో ముందు చతికిలపడాల్సిందే.
తరాలుమారిన దశాబ్దాలుగా ఇవే సినిమాలు తెలుగులో.
తీసేవారికి వేరే చాన్స్‌లేదో లేదా బుద్ధిలేదో తెలియదు కాని చూసే వారిని ఏమనాలా?’’
ఇది ఒక సగటు తెలుగు సినీ ప్రేక్షకుని మనోవేదన.
ఇదంతా కరెక్టే కాని కవి చెప్పినట్లు ‘నీకు తెలిసిందొకటి నాకు తెలిసిందొకటి అసలు నిజం మరొకటి’అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే స్వర్ణయుగం అని మనం చెప్పుకునే 50వ దశకంనుండి 80వ దశకం వరకు. సినిమా ఒక కళ. ఆర్టిస్ట్ దగ్గరనుండి టెక్నిషియన్ల వరకు నిర్మాతల నుండి పంపిణీదారుల వరకు ప్రేక్షకులు కూడా ఎక్కువలో ఎక్కువ కళాత్మక దృష్టితోనే పనిచేసేవారు, చూసేవారు.
కాబట్టి వారికి అనుగుణంగానే ఎక్కువగా కళాత్మక చిత్రాలు, అభ్యుదయ భావాలుగల, మేలుకొలుపు చిత్రాలు వచ్చేవి.
కాని 90వ దశకంనుండి కాలం మారింది. అభిరుచులు మారాయి, పెట్టుబడిదారి వ్యవస్థ తన పంజాను వీలైనంత విశాలంగా చాచింది. సినిమా కూడా దానికి అతిశయోక్తి కాలేకపోయింది. ఇవన్నీ ఒకరోజులోను, ఒక సినిమాతోను మొదలైనవి కావు.
ఇకపోతే మంచి సినిమా అంటే నైతిక విలువలు కుటుంబ నేపధ్యం, అభ్యుదయ భావాలు దేశభక్తిలాంటి అంశాలు గలవి అనుకుంటే ఇప్పటివరకు దాదాపు చాలా సినిమాలు ఈ అంశాల్ని ఏదో ఒక కోణంలో స్పృశించాయి.
స్క్రీన్‌ప్లే అధ్యయనంచేసే వారికి ఒక విషయం చెప్తారు. ‘దేర్‌ఆర్ నో బ్యాడ్ స్టోరీస్ ఓన్లీ బ్యాడ్ స్టోరీ టెల్స్ అని’. అవును ఏ విషయమైన సరిక్రొత్త కోణంలోంచి చూపించగలిగితే వ్యక్తీకరణపరంగా విజయం సాధించినట్లే.
అయినా కథావస్తువుల విషయానికి వస్తే ఇప్పటిదాకా ప్రపంచం మొత్తం మీద 2 లక్షల వరకు సినిమాలు వచ్చి వుంటే దానికి మాతృక మాత్రం 32 కథలే అంటారు. కొన్నిసార్లు ఒకే పోలికగల ఆలోచనలు వేరువేరు వ్యక్తులకు రావచ్చు. అలాంటప్పుడు ఏ ఆలోచన మొదట తెరమీదకు వచ్చిందో దానే్న ప్రామాణికంగా తీసుకుంటాం. రెండో వ్యక్తి ఎంత విభిన్నంగా తీసినా దాన్ని మనం ‘కాపీ’అని పెదవి విరుస్తాం.
కాబట్టి మనం కథ క్రొత్తదా పాతదా అనికాక కథనం క్రొత్తదా అందులో అంశాలు మనకి, మన తరానికి అభివృద్ధి మార్గంగా దోహదం చేస్తాయా లేదా మనల్ని మైమరిపించే మాయచేస్తుందా, అనుభూతి నిచ్చిందా అనే కోణంలోంచి అర్థంచేసుకోవాలి. పై విధంగా ఆలోచించగలిగే స్థాయి దిశలో ప్రేక్షకులు, సత్యజిత్‌రేగారు చెప్పినట్లుగా ‘వి ఫిలిం మేక్స్ నాట్‌ఓన్లీ గివ్ ద ఆడియన్స్ వాట్ దె వాంట్ వి షుడ్ ఆల్సో గీవ్ వాట్ దే నీడ్’ అవును ప్రేక్షకులకు అవసరమయ్యే అంశాలు వారు కోరుకున్న భాషలో చెప్పగల్గే స్థాయికి ఎగబ్రాకే తపన గల దర్శకులు వచ్చేదాకా స్వర్ణయుగం ఆలోచన మానుకోవాలి.
ఈ సినిమా చాలా బాగుంది కాని ఎందుకు సరిగ్గా ఆడలేదు
english title:
classic commercials
Date:
Thursday, December 6, 2012