హైదరాబాద్, డిసెంబర్ 11: దళితులు, గిరిజనుల భావితరాల మేలు కోసమే ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికను తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, చట్టాల ద్వారా శాసనాలను అమలు చేయడానికి సలహాలు, సూచనలు తీసుకోవడానికే చట్టసభల్లో చర్చించడం జరుగుతోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శాసన మండలి సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలు సబ్‌ప్లాన్ అమలుకు ప్రయత్నాలు చేయలేదని, ఆ అవకాశం తనకు దక్కిందని ముఖ్యమంత్రి అన్నారు. ఉప ప్రణాళిక అమలుకు ప్రయత్నం చేయనిది తెలుగుదేశమా? కాంగ్రెస్ పార్టీనా అన్నది అప్రస్తుతమని, సబ్‌ప్లాన్ అమలుతో ఎస్సీ,ఎస్టీ వర్గాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. సబ్‌ప్లాన్ అమలు ఘనత తమదంటే తమదని కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆ ఘనత ఎవరిదోనని తెలుగుదేశం సభ్యుడు దాడి వీరభద్రరావుచెబుతుండగా మంత్రి జానారెడ్డి కలుగచేసుకొని ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదేనని సమాధానం చెప్పారు. వ్యక్తుల గురించి మాట్లాడడం కంటే సబ్‌ప్లాన్ అమలుకు చేపట్టాల్సిన అంశాలపై లోతుగా చర్చించాలని, దేవుని పెళ్ళికి అందరూ పెద్దలేనని మండలి చైర్మన్ చక్రపాణి వ్యాఖ్యానించారు. దాడి వీరభద్రరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాల్లో సబ్‌ప్లాన్ కోసం భారీగా ఖర్చుపెట్టిన గణాంకాలను వివరిస్తూ ఇక్కడ మాత్రం తక్కువ శాతం నిధులను ఎస్సీ,ఎస్టీ వర్గాలకు ఖర్చు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా అంబుడ్స్‌మెన్ ఏర్పాటు చేయడం ద్వారా సబ్‌ప్లాన్ ఫలితాలు వస్తాయన్నారు. మంత్రి గీతారెడ్డి కల్పించుకొని ఎస్సీ,ఎస్టీ వర్గాలకు 50 లక్షల రూపాయలు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం లభించేలా ప్రభుత్వం హమీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ సభ్యుడు ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ సబ్‌ప్లాన్ ఘనత కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కిందని చెప్పారు. సిపిఐ సభ్యుడు జల్లి విల్సన్ మాట్లాడుతూ నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. సిపిఎం సభ్యుడు సీతారాములు మాట్లాడుతూ సిపిఎం ఉద్యమాలతో నేడు సబ్‌ప్లాన్ అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సబ్‌ప్లాన్‌కు పునాది వేసిన ఘనత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దక్కిందని అధికార పార్టీ సభ్యుడు రెడ్డప్పరెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచ తెలుగు మహాసభులు జరుపుకుంటున్న నేపథ్యంలో సభ్యులు ఇంగ్లీష్‌లో మాడ్లాడడం ఏమిటి మహాప్రబో అంటూ టిడిపి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. చెంగల్‌రాయుడు మాట్లాడుతూ సబ్‌ప్లాన్ ఘనత కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కిందని అన్నారు. ఉన్న చట్టాలు అమలు చేయలేక కొత్త చట్టాలపై గంటల తరబడి చర్చలు జరుగుతున్నాయని అయినా సబ్‌ప్లాన్ అమలు అవుతుందా అంటూ జార్జి విక్టర్ అనుమానాలు వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతుంటే వెనక రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారని సభను అదుపులో పెట్టాలని మోహన్‌రెడ్డి చైర్మన్‌కు సూచించారు. చట్టాల్లో ఉన్న మూలాలను బయటకు తీసి వాస్తవంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రిని అభినందిస్తున్నానని జూపూడి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. సబ్‌ప్లాన్‌పై శాసనాలను తీసురావడం చారిత్రాత్మక ఘట్టమని ఆయన చెప్పారు.
ఇంటినుండే
తెలుగు భాషా వికాసం
తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: ఇంటి నుండే తెలుగు భాషా వికాసం జరగాలని తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వ్యాఖ్యానించారు. మూడున్నర దశాబ్దాల తర్వాత జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలను అందరూ విజయవంతం చేయాలని పేర్కొన్నారు. తెలుగు మహాసభలు భాషా సంస్కృతుల పునర్‌వైభవానికి దోహదం చేస్తాయని అన్నారు. మంగళవారం నాడు ఆయన సాంస్కృతిక మండలి చైర్మన్ డాక్టర్ రమణమూర్తి, సంచాలకుడు డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్‌లతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. తానా సభ్యులు అంతా ఈ మహాసభల్లో భాగస్వామ్యులు అవుతారని అన్నారు. వచ్చే ఏడాది మే 25, 26, 27 తేదీల్లో డల్లాస్‌లో 19వ తానా మహాసభలు జరుగుతాయని కన్వీనర్ వెన్నం మురళీ పేర్కొన్నారు. రాళ్లబండి కవితా ప్రసాద్ మాట్లాడుతూ వెటర్నరీ యూనివర్శిటీ పరిధిలో ఉన్న 23 ఏకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఓట్ ఆన్ అకౌంట్ ఒక నెలకే
కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: కొత్త ఆర్ధిక సంవత్సరం ఓట్ ఆన్ అకౌంట్‌కు ఆర్ధిక శాఖ రంగం సిద్ధం చేసింది. తొలి ఆర్థిక మాసానికి ఓట్ ఆన్ అకౌంట్‌ను అమలు చేస్తూ మే నుంచి సాధారణ బడ్జెట్ అమలు చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో నెల రోజుల పాలనావసరాల కోసం ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్ ప్రతులను పరిశీలించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన స్థాయి సంఘాలకు అందిస్తారు. బడ్జెట్‌ను 18 రోజులపాటు స్థాయి సంఘాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అనంతరం స్థాయి సంఘాలు చేసే సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మేరకు సవరణలతో బడ్జెట్‌ను ఆమోదిస్తారు. ఈ కొత్త బడ్జెట్ వచ్చే ఏడాది మే నుంచి అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ఆర్ధిక లావాదేవీలను కొనసాగించేందుకు వీలుగా ఏప్రిల్ నెలకు ఓట్ ఆన్ అకౌంట్ అమల్లో ఉంటుందని ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరివారంలో దాదాపు ప్రారంభమయ్యే అవకాశాలు ఉండటంతో ఆర్ధిక సంవత్సరంలో చివరి మాసమైన మార్చి నెలాఖరుకు సమావేశాలు పూర్తికాక పోవచ్చునని ఆర్ధిక శాఖ భావిస్తోంది. ఇదే జరిగితే ఆర్ధిక సంవత్సరం ప్రారంభం ఇబ్బందుల్లో పడుతుందన్న భావనతో ఓట్ ఆన్ అకౌంట్‌కు ఆర్ధిక శాఖ మొగ్గు చూపిస్తోంది. ఒకవేళ మార్చి నెలాఖరులోగా బడ్జెట్ సమావేశాలు పూర్తియినప్పటికీ ముందుగా అనుకున్న మేరకు తొలి మాసాన్ని ఓట్ ఆన్ అకౌంట్‌తోనే కొనసాగించాలని ఆర్ధిక శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్‌కు, తరువాత స్థాయి సంఘాల అధ్యయనం కోసం రూపొందించే పూర్తిస్థాయి బడ్జెట్ కోసం ఆర్ధిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి రెండోవారంలోగానే బడ్జెట్ కసరత్తును కొలిక్కి తేవాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే అనేక శాఖల నుంచి ప్రతిపాదనలు రావడం ప్రారంభమైందని, నెలాఖరు నుంచే శాఖల వారీ చర్చలు ఉంటాయని భావిస్తున్నారు.
ట్రాన్స్‌ట్రాయ్‌కు చెక్!
పోలవరం టెండర్లు మళ్ళీ మొదటికి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందున టెండర్‌ను ఎందుకు రద్దు చేయరాదో తెలపాలంటూ పోలవరం టెండర్లలో ఎల్-1గా వచ్చిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి అధ్వర్యంలో మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పోలవరం టెండర్ల వ్యవహారం మళ్ళీ మొదటికి రానుంది. నీటి పారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం పనుల నిర్మాణానికి గతంలో టెండర్లు పిలవగా పలు ఇతర సంస్థలతో పాటు ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ కూడా టెండర్ దాఖలు చేసింది. తర్వాత అధికారులు టెండర్లను పరిశీలించినపుడు అతి తక్కువ మొత్తాన్ని కోట్ చేసిన ట్రాన్స్‌ట్రాయ్ ఎల్-1గా ఎంపికైంది. కానీ ట్రాన్స్‌ట్రాయ్ జాయింట్ వెంచర్‌లోని రష్యాకు చెందిన యుఇఎస్ సంస్థపై పలు అభియోగాలు వచ్చాయి. వీటిని పరిశీలించేందుకు భారత విదేశాంగ శాఖ ద్వారా రష్యాకు పంపించారు. రష్యా నుంచి అందిన అధికారిక సమాచారం మేరకు టెండర్ల దాఖలు సందర్భంగా ఈ సంస్థ సమర్పించిన పత్రాలు తప్పని తేలింది. ఒకటి రెండు రోజుల్లో ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు నోటీసు జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
మోడీపై తప్పుడు
ఆరోపణలు: బిజెపి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై లేనిపోని తప్పుడు ఆరోపణలకు ఒడిగడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. గుజరాత్ రాష్ట్ర ఆహ్వానం మేరకు మూడు రోజులుగా గుజరాత్ పర్యటిస్తున్న కిషన్‌రెడ్డి మంగళవారం నాడు సూరత్‌లో మాట్లాడారు. డిసెంబర్ 13,17 తేదీల్లో గుజరాత్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికలు దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని సృష్టిస్తాయని అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి గెలుపును గుజరాత్‌లోని తెలుగు వారంతా ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వారే సూరత్‌లో వస్తప్రరిశ్రమలో పనిచేసుకుంటున్నారని చెప్పారు. మోడీ గెలుపును అడ్డుకోలేని కాంగ్రెస్ గుజరాత్ ప్రభుత్వంపైనా, మోడీ పాలనపైనా తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. గుజరాత్‌లో మోడీని ఓడించే సత్తా ఏ రాజకీయ పార్టీకీ లేదని , మోడీపై కాంగ్రెస్ పసలేని విమర్శలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. బహిరంగ సభలో పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. లక్ష్మణ్, సూరత్ తెలుగు ఫౌండేషన్ చైర్మన్ శర్మ పాల్గొన్నారు.
షిండే లేఖ వచ్చాకే
ప్రతినిధుల ఎంపిక: బొత్స
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ, సమైక్య రాష్ట్రం అంశాలను తెల్చేందుకు తాము ఈ నెల 16న పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం లేదని, కేవలం పార్టీ పటిష్టత కోసమే నిర్వహిస్తున్నామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. ఎల్‌బి స్టేడియంలో పార్టీ నిర్వహించబోయే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లను బొత్స, రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ఈ నెల 28న జరగబోయే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ షిండే నుంచి లేఖ అందిన తర్వాతే ఎవరు వెళ్ళాలన్నది నిర్ణయిస్తామని అన్నారు. స్టేడియంలో నిర్వహించబోయే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్, ఎఐసిసి నాయకుడు, కేంద్ర మంత్రి వాయలార్ రవి, రాష్ట్ర పార్టీ పరిశీలకుడు కెబి కృష్ణమూర్తి హాజరవుతారని ఆయన చెప్పారు. ఈ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలన్న సూచన తమకు రాలేదని, కాగా రెండు రోజుల పాటు నిర్వహించాలని తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కోరారని ఆయన తెలిపారు. మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ కేంద్ర మంత్రి షిండే అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశానికి ఎవరు వెళ్లాలన్నది పిసిసి నిర్ణయిస్తుందని అన్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీ తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రం ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నానన్నారు.
ఇక బీసీ ఉప ప్రణాళిక!
మంత్రులకు సిఎం హామీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు ఆమోదం లభించడంతో అందరి దృష్టీ ఇపుడు బీసీ ఉప ప్రణాళికపైనే పడింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇదే అంశంపై కొంతమంది మంత్రులకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే రెండు మూడు దఫాలుగా మంత్రులు కూడా ముఖ్యమంత్రితో చర్చించారు. వాస్తవానికి వారం ముందు నుంచే దీనిపై చర్చ జరుగుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై శాసనసభ, శాసన మండలిలో చర్చ జరుగుతున్న సమయంలో బీసీ ఉప ప్రణాళికపై బాహాటంగా చర్చిస్తే ఎస్సీ ఉప ప్రణాళికకు ఇబ్బందులు వస్తాయన్న భావాన్ని ముఖ్యమంత్రి తన సహచర మంత్రుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. అందుకే ఉభయ సభల్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు ఆమోదం లభించిన అనంతరం బీసీ ఉప ప్రణాళికపై చర్చకు తెర తీయవచ్చునన్న భావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేయడంతో మంత్రులు సైతం మిన్నకుండిపోయినట్టు సమాచారం. ఇదే సమయంలో బీసీ సంక్షేమ శాఖను నిర్వహిస్తున్న సారయ్య వద్ద కూడా ఇతర బీసీ మంత్రులు ఉప ప్రణాళికపై చర్చించి ముఖ్యమంత్రితో మాట్లాడాలని సూచించినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక తరహాలోనే బీసీ ఉప ప్రణాళికకు కూడా చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్ బీసీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మంత్రులు కూడా ఇదే భావాన్ని ముఖ్యమంత్రి వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. అధికార కాంగ్రెస్ నుంచి కూడా బీసీ ఉప ప్రణాళికపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఉప ప్రణాళికపై అడుగు ముందుకేసేందుకు హామీనిచ్చినట్టు సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు.
పురంధ్రీశ్వరి, దగ్గుబాటిపై
బాలకృష్ణ ఫైర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: చాలా కాలం తరువాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మధ్య రాజకీయం మరోమారు ఊపందుకుంది. తాజాగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. విగ్రహం ఏర్పాటుకు అనుమతి సాధించిన ఘనత మొత్తం చంద్రబాబుదే అని ఈ వ్యవహారంలో దగ్గుబాటి దంపతులే రాజకీయం చేస్తున్నారని బాలకృష్ణ ఒక ప్రకటనలో విమర్శించారు. నిబంధనలు మార్పించి పార్లమెంటు అవరణలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు సాధించిన ఘనత చంద్రబాబుదే అని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విగ్రహం ఇచ్చేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిరాకరించినప్పుడు మీరు ఏ గుర్రాలు, గాడిదల పళ్ళు తోమారు అని పురంధ్రీశ్వరి, దగ్గుబాటిలను ప్రశ్నించారు. ఎన్టీఆర్‌తో వైఎస్‌ఆర్‌ను పోల్చడమే కదా మీరు సాధించింది అని ఎద్దేవా చేశారు. ఆ రోజు లేఖలో సంతకాల కోసం చంద్రబాబే నన్ను మీ వద్దకు పంపించారు.. మొదట సరేనన్నారు ఆ తర్వాత మీ దగ్గర నుండి సమాచారం లేదు.. సంతకం విషయమై ఆ తరువాత నేనే మూడుసార్లు ప్రత్యేకంగా ఢిల్లీకి ఫోన్ చేసి నీతో మాట్లాడాను’ అని బాలకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. కట్టుకథలు చెప్పి కాలయాపన చేశారు. విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తూ లోక్‌సభ స్పీకర్ ఇచ్చిన గడువు పూర్తయ్యే వరకు ఎదురు చూశావు. ఆ తరువాత నేనే పెడతానని స్పీకర్‌కు లేఖ రాశావు. కుటుంబం మొత్తాన్ని కాదని నేనే విగ్రహం పెడతానన్న నీవు మళ్లీ ఇప్పుడు కుటుంబం అంటున్నావు. చంద్రబాబుకు దీంట్లో వేరే ఉద్దేశాలు లేవు. కాబట్టే పార్టీ ఇచ్చిన విగ్రహమైనా , కుటుంబ సభ్యులు ఇచ్చే విగ్రహమైనా ఏదో ఒకటి సత్వరమే నెలకొల్పాలని స్పీకర్‌కు లేఖ రాశారు, ఈ రాద్ధాంతం అంతా చేస్తోంది క్రెడిట్ అంతా నువ్వు పొందాలనా? కుటుంబం పొందాలనా? జరిగిన దాన్ని అంతా వక్రీకరించారు. చంద్రబాబును ప్రజల్లో దోషిగా చేయాలని చూస్తున్నారు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. డ్రామా ఆడేది ఆయనా? మీరా?’ అని బాలకృష్ణ లేఖలో ప్రశ్నించారు. బాలకృష్ణ సంతకం లేకుండానే టిడిపి కార్యాలయం నుంచి లేఖ మీడియాకు పంపించారు.
ధర్మానకు క్లీన్‌చిట్ ఎలా ఇస్తారు?: డిఎల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: సుప్రీం కోర్టులో 26 జివోలకు సంబంధించిన అంశాలపైన, సిబిఐ చార్జిషీట్‌పై న్యాయ స్థానాలు విచారణ జరుపుతున్న సమయంలో రాష్ట్ర కేబినెట్ ధర్మాన ప్రసాదరావుకు క్లీన్‌చిట్ ఎలా ఇస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మరో మారు ప్రశ్నించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ కేబినెట్‌లో కొంత మంది మంత్రులపైనా సిబిఐ విచారణ చేపడుతోందని, వారికి కూడా కేబినెట్ క్లీన్‌చిట్ ఇస్తుందా? అంటూ డిఎల్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేబినెట్ తీర్మానాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న విశేష అధికారాలు గవర్నర్‌కు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు పెరిగిపోతున్నాయని దీన్ని నివారించడానికి స్వీడన్ ప్రభుత్వంతో ఆరోగ్య అంశాలపై ఒప్పందాలు జరిగాయని మంత్రి చెప్పారు. స్వీడన్ దేశంలో సాధారణ ప్రసవం జరగడానికి ముందస్తుగా గర్భిణీలు ఆరోగ్య నియమాలు చేపడతారని తెలిపారు. స్వీడన్‌లో 90 శాతం ప్రసవాలు ఆపరేషన్ లేకుండా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. అదే మన దేశంలో సాధారణ ప్రసవనాలు జరక్కపోవడంతో తల్లిపిల్ల అకాల మరణాలకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్య అంశాలపై చర్చించడానికి స్వీడన్ దేశానికి చెందిన అంబాసిడర్ ఇక్కడికి వచ్చారని చెప్పారు. బిడ్డపుట్టిన 45 రోజుల వరకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై నర్సులకు శిక్షణ ఇవ్వడానికి ప్రాంతాల వారిగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ముందస్తుగా గర్భిణీలు కొత్త టెక్నాలజీతో తమ బిడ్డను కాపాడుకోవడానికి పాటించాల్సిన అంశాలపై నర్సులు వివరిస్తారని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులపై కూడా అవగాహన ఒప్పందాలు జరిగాయని మంత్రి చెప్పారు.
15నుంచి బస్తీబాట: కెసిఆర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన పల్లెబాట ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు బస్తీబాట కూడా చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి బస్తీబాట చేపట్టాలని మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలను ఆదేశించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం సాయంత్రం పల్లెబాట ఇంచార్జీలు, బస్తీబాట సమన్వయకర్తలతో కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 150 డివిజన్లకు ఒక్కోరు చొప్పున బస్తీబాట కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సమన్వయకర్తలను నియమించారు. బస్తీబాట పర్యవేక్షణకు పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ విజయరామారావును ఇంచార్జీగా నియమించినట్టు ప్రకటించారు. అలాగే పల్లెబాట కార్యక్రమం పర్యవేక్షణకు 119 నియోజకవర్గాలకుగాను 65 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు.
చట్టబద్ధత సరే... అమలు ముఖ్యం
* మైనారిటీలకు, బీసీలకు కూడా ఉప ప్రణాళిక ఉండాలి
* శాసనమండలిలో పాలక, విపక్ష సభ్యుల డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా మైనార్టీలకు, వెనుకబడిన తరగతుల వారికి కూడా ఉప ప్రణాళికను ఏర్పాటు చేయాలని శాసనమండలిలో విపక్షాలతో పాటు, పాలకపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించినంత మాత్రాన సరిపోదని, దానిని పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై శాసనమండలిలో మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, సిపిఐ, సిపిఎం, టిఆర్‌ఎస్ సభ్యులతో పాటు పాలకపక్షానికి చెందిన సభ్యులు కూడా మైనార్టీలకు, వెనుకబడిన తరగతులకు ఉప ప్రణాళికను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేయాలని వారు సూచించారు. చర్చలో పాల్గొన్న టిడిపి సభ్యులు బోడకుంట్ల వెంకటేశ్వర్లు, గంగాధర్‌గౌడ్, నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, ఉప ప్రణాళిక సక్రమంగా అమలు కావాలంటే ఇందులో పలు సవరణలు తప్పని సరిగా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉప ప్రణాళికకు కేటాయించిన నిధులు దారి మళ్లకుండా చూడటంతో పాటు, మురిగిపోకుండా చట్టంలో సవరణలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించడాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తుందని జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. ఇది చారిత్రక నిర్ణయమని ఆయన కొనియాడారు. స్వతంత్ర సభ్యుడు చుక్కా రామయ్య మాట్లాడుతూ, చట్టానికి పది సంవత్సరాలు కాలపరిమితి విధించడం సమంజసం కాదన్నారు. సిపిఐ సభ్యుడు చంద్రశేఖర్ ఆజాద్, సిపిఎం సభ్యుడు సీతారాములు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలు ప్రస్తుతం ఉన్న దుర్భరస్థితికి సమాజంలో అందరు బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. చట్టంలో ఎస్సీ, ఎస్టీ మహిళల గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడం పెద్ద లోపం అని సిపిఐ సభ్యుడు చంద్రశేఖర్ ఆజాద్ విమర్శించారు. కాంగ్రెస్ సభ్యుడు సుధాకర్ బాబు మాట్లాడుతూ, అణగారిన వర్గాలకు ఏదైనా చేయాలంటే, అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. కాంగ్రెస్ సభ్యురాలు పుల్లా పద్మావతి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల గురించి ఏనాడు పట్టించుకోని టిడిపి, ఉప ప్రణాళికను అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. టిడిపి హయాంలో ఈ వర్గాలకు ఏమైనా చేయాలని కనీసం ఆలోచన కూడా చేయలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారం రేపాయి. పుల్లా పద్మావతి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని టిడిపి సభ్యులు పట్టుబట్టారు. మంత్రి శ్రీ్ధర్‌బాబు జోక్యం చేసుకుంటూ, పద్మావతి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సూచించడంతో టిడిపి సభ్యులు శాంతించారు. పాలకపక్ష సభ్యులు తిప్పేస్వామి, ఫరూఖ్ హుస్సేన్, కందుల దుర్గేశ్, పీర్ షబ్బీర్ అహ్మద్ తదితరులు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే మైనార్టీలకు, వెనుకబడిన తరగతులవారికి ఉప ప్రణాళిక ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు: లక్ష్మీపార్వతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు, కేంద్రమంత్రి పురంధ్రీశ్వరికి లేదని ఎన్టీఆర్ సతీమణి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో ప్రతిష్టించే విషయాన్ని వివాదాస్పదం చేయడం వల్ల ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని ఆమె మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు ఎన్టీఆర్ ధర్మపత్నినైన తన సంతకాన్ని తీసుకోవాలన్న కనీస జ్ఞానం వారికి లేదా అని ఆమె దుయ్యబట్టారు. ఈ విషయంలో లోక్‌సభ స్పీకర్‌కు తాను లేఖ రాయనున్నట్లు లక్ష్మీపార్వతి చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుగానీ, కేంద్రంలో చక్రం తిప్పుతున్నట్లు గొప్పగా చెప్పుకునే రోజుల్లోగానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టించలేదని ఆమె విమర్శించారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పురంధ్రీశ్వరి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టించేందుకు చర్యలు చేపట్టకపోగా, అనవసరమైన వ్యాఖ్యలతో వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు.
దీంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని లక్ష్మీపార్వతి తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ పేరు వాడుకోవద్దని ఆమె హెచ్చరించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని ఆమె ధ్వజమెత్తారు.
ఆలయ ప్రవేశానికి ముస్లింల అనుమతి కావాలా?
విహెచ్‌పి నేత తొగాడియా ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: దేవాలయానికి వెళ్లేందుకు కూడా ముస్లింల అనుమతి పొందాలా అని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయని, ముస్లింల కనుసన్నల్లో ఆంధ్రాపోలీసులు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజధానిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రవీణ్‌భాయ్ డాక్టర్లతోనూ, న్యాయవాదులతోనూ, చిన్న వ్యాపారులతోనూ సంభాషించారు. సహకార్యదర్శి రాఘవులు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, ఉపాధ్యక్షుడు వి సురేంద్రరెడ్డి, నగర కార్యదర్శి భరత్ వంశి, ఉపాధ్యక్షుడు యామన్‌సింగ్, జిల్లా కార్యదర్శి భగత్, భాగ్యనగర విభాగ్ సత్సంగ్ సభ్యుడు ఎన్‌ఆర్‌కె రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రయాగలో మహాకుంభమేళ జనవరి 14న ప్రారంభం అవుతుందని, దానికి పదికోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 7వ తేదీన అక్కడే విరాఠ్ సంత్ సమ్మేళనం జరుగుతుందని, దేశంలోని ప్రముఖ ధర్మాచార్యులు, సంత్‌లు, సాధువులు ఈ సమ్మేళనంలో పాల్గొంటారని పేర్కొన్నారు. రామమందిరం సహా హిందువుల అన్ని అంశాలపై ఈ సమ్మేళనంలో చర్చిస్తామని, జనజాగరణ్ అభియాన్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముస్లిం ఛాందసవాదుల ఆగడాలు హెచ్చుమీరిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే అయోధ్యలోనూ, అమర్‌నాధ్ భూమి విషయంలోనూ, రాం సేతు విషయంలో ఏం జరిగిందో అదే జరుగుతుందని హెచ్చరించారు. ఛాందసవాదుల అంతుచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. నల్లగొండలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజాం పాలన కనిపిస్తోందని, హిందువులపై అత్యాచారాలు హెచ్చుమీరాయని రాష్ట్రంలో గోహత్యలు పెరిగాయని అన్నారు. అంతకంటే ముందు ప్రవీణ్‌భాయ్ శృంగేరి మఠం శంకరాచార్యుల ఆశీస్సులు పొందారు. సినిమాల్లో ఈ మధ్య చూపుతున్న హిందూ వ్యతిరేక దృశ్యాలను చూస్తుంటే ఇదో సినిమా జిహాదీలా ఉందని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ గత రెండు నెలలుగా హైదరాబాద్‌లోనూ, రాష్ట్రంలోనూ పనిగట్టుకుని ఎంఐఎం ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. నగరంలో విచ్చలవిడిగా హిందువుల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని, దేవాలయాల్లో దోపిడీలు చెప్పి చేస్తున్నారని, నిజామాబాద్‌లో ఎంఐఎం నేతలు బహిరంగ సభలోనే సుప్రీంకోర్టునూ, హైకోర్టునూ తూలనాడుతూ మాట్లాడినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డిఐల వల్ల పెను ముప్పు పొంచి ఉందని ఆయన వివరించారు.