మధ్య ఇంటర్నెట్‌లో ఆలోచనలు రేకెత్తించే కథ ఒకటి సర్క్యులేట్ అవుతున్నది. ఒక ఎమర్జన్సీ ఆపరేషన్ చెయ్యడానికి డాక్టర్ని పిలిచారు. ఆయన వచ్చిన వెంటనే హడావుడిగా డ్రెస్సు మార్చుకుని ఆపరేషన్ థియేటర్‌కి వచ్చాడు. అక్కడ ముందు రోగి తండ్రి డాక్టరు కోసం ఎదురుచూస్తూ పచార్లు చేస్తున్నాడు. డాక్టర్ని చూస్తూనే ఆయన అరిచాడు.
‘ఇంతసేపా రావడానికి? నా కొడుకు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడని తెలియదా? ఇదేనా మీ వృత్తికి మీరిచ్చే గౌరవం?’’
డాక్టరు చిరునవ్వుతో ‘‘క్షమించాలి. హాస్పిటల్లో లేను. విషయం విన్న వెంటనే వచ్చాను. మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటే నా పని నేను చేసుకుంటాను’’ అన్నాడు.
‘‘ప్రశాంతంగా ఉండాలా? మీ కొడుకే ఈ గదిలో ఉంటే మీరు శాంతంగా ఉంటారా? మీ కొడుకే మరణిస్తే శాంతంగా ఉండగలరా’’ అని తండ్రి గట్టిగా అరిచాడు.
డాక్టరు మళ్లీ నవ్వి ‘‘్భగవద్గీతలో ఏముందో గుర్తుతెచ్చుకోండి. పుట్టిన వాడు గిట్టక తప్పదు. గిట్టిన వాడు పుట్టక తప్పదు. పండితులు దీనికై శోకించరు. డాక్టర్లు ఆయుష్షును పొయ్యలేరు, పెంచలేరు. కూర్చుని ప్రార్థించుకోండి. మేం చెయ్యగలిగింది చేస్తాం’’ అన్నాడు.
తండ్రి ‘‘వేదాంతం వద్దు. సలహాలివ్వడం అన్నిటికన్నా సులభం’’ అంటూ రంకెవేశాడు.
డాక్టరు వౌనంగా లోపలకు వెళ్ళాడు. ఆపరేషన్ చాలా క్లిష్టమైనది. కొన్ని గంటలయ్యాక డాక్టరు బయటకు వచ్చి ‘‘దేవుడి దయ. మీ అబ్బాయి బతికాడు’’ అంటూ వేగంగా నడుస్తూ ‘‘మిగతావన్నీ నర్సు చెప్తుంది’’ అని వెళ్లిపోయాడు.
తండ్రి నర్సుమీద విరుచుకుపడ్డాడు. ‘‘ఏమిటమ్మా మీ డాక్టరుకంత పొగరు? కాస్త ఆగి మా వాడి గురించి నాకు వివరాలు చెప్పి నేనడిగినవాటికి జవాబు చెప్పచ్చుగా. ఇంకో హాస్పిటల్‌కి పరుగా? ఇప్పుడీ డాక్టర్లంతా అంతే’’
నర్సు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ‘‘నిన్ననే డాక్టరుగారి అబ్బాయి ఆక్సిడెంటులో పోయాడు. పొద్దునే్న కొడుక్కి కొరివిపెట్టే దుర్గతి పట్టింది. మీ అబ్బాయికి ఆపరేషన్ ఆయన తప్ప ఇంకెవరూ చెయ్యలేరు. పిలవగానే వచ్చారు. ఇప్పుడు అస్థి సంచయానికి వెడుతున్నారు’’గొంతు గద్గదమై ఆమె మాట్లాడలేకపోయింది.
కథలో కొంత అతిశయోక్తి ఉందనిపించవచ్చును. ఎవరైనా కూడా కొడుకు మరణించిన రోజునే హాస్పిటల్‌కి వచ్చి ఆపరేషన్ చేస్తారా? అని ప్రశ్నించవచ్చు. కానీ అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న వేసుకోడం అవసరం. అందరం కూడా ఆపరేషన్ అయిన కుర్రవాడి తండ్రిలాగే ఆలోచించడం లేదా? ప్రవర్తించడంలేదా? మనకు జీవితంలో అతి సన్నిహితుల విషయంలో కూడా స్వార్థచింతనే కానీ, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా?
విమల సాయంత్రం మంచి డ్రెస్ వేసుకుని అలంకరించుకుని కూచుంది. భర్త ఆఫీసు నుంచి వచ్చాక సినిమాకూ, ఆపైన హోటల్‌కూ తీసుకెడతానన్నాడు. అయిదున్నరయింది, ఆరయింది, ఏడయింది. భర్త రాలేదు. విమల కోపంతో వేడెక్కిపోయింది. భర్త ఏడున్నరకు వచ్చాడు. ఆమె విరుచుకుపడింది.
‘‘పొద్దున చెప్పిన విషయం గుర్తుందా? సినిమాకూ, హోటల్‌కూ వెడదామన్నారు. ఇప్పుడా రావడం? అవునులెండి. నా విషయం మీకు ఏనాడు పట్టింది కనుక...’’
జరిగిందేమిటి? హెడ్డ్ఫాసునుంచి కొంత ఇన్‌ఫర్మేషన్ కావాలని బ్రాంచి ఆఫీసుకు ఆర్డర్సువచ్చాయి. మర్నాడు ఉదయం పదిలోగా వివరాలన్నీ ఇ-మెయిల్‌లో పంపించెయ్యాలి. విమల భర్త కంప్యూటర్ ముందు నుంచి కదలలేదు. చిన్న పొరపాటుకి ఆఫీసరు అతనిమీద రంకెలేశాడు. కళ్ళమంటలతో, మనస్సులో బాధలతో ఇంటికి వచ్చాడు. విమల స్వాగతం తీరిలా ఉంది.
ఆమె ఒక్క క్షణం భర్త గురించి ఆలోచిస్తే, ఆలస్యమెందు కయిందోననుకుంటే... వాస్తవం తెలిసేది.
ఉదయం పేపర్ చదువుకుంట్ను సుబ్రహ్మణ్యం ‘కాఫీ’ అని అరిచాడు. పది నిమిషాల తర్వాత భార్య కాఫీ తెచ్చింది. కప్పు నోట్లో పెట్టుకుని వెంటనే రంకెవేశాడు.
‘‘ఇది కాఫీయా? కొత్త గోదావరి నీళ్ళా? అడిగి అరగంటైంది. ఇప్పుడా తేవడం? పోనీ ఆ తెచ్చి తగలెట్టిందైనా బాగుందా? ఏం చేస్తున్నావు వంటింట్లో? మా అమ్మలా కుంపట్లమీద వంటా...’’
ఏం చేస్తోంది వంటింట్లో? మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళిస్తే పట్టుకుంటోంది. పనిమనిషి వస్తే అంట్లు వేసింది. పిల్లవాడు ఏడిస్తే సముదాయిస్తూనే కాఫీ పెట్టి తెచ్చింది.
అతను ఒక్క క్షణం భార్య గురించి ఆలోచిస్తే, ఆలస్య మెందుకయిందోననుకుంటే... బాగుండేది.
వయస్సులో ఉన్నవారికి మనస్సు పరిపక్వం కాకపోవచ్చును. తమ కోరికల మీద ఉన్న మనస్సు ఇతరుల కష్టాలమీదకు పోకపోవచ్చును. వయస్సు మీరినా మనుషుల ప్రవర్తనలో మార్పు రాదు.
‘‘ఏరా అబ్బాయ్, రేపు పూజ చేసుకుని తాంబూలాలిచ్చుకుందుకు తమలపాకులూ, బత్తాయిలూ తెమ్మన్నాను తెచ్చావా?’’ ఆఫీసునుంచి వచ్చిన కొడుకుని తల్లి అడుగుతుంది.
‘‘లేదమ్మా. రేపు ఉదయమే తెస్తాను’’కొడుకు జవాబు.
‘‘ఒరేయ్, ఈ కుర్చీ టీవీ దగ్గరగా వెయ్యి. మంచి ప్రోగాం వస్తోంది. దూరం నుంచి వినబడ్డం లేదు’’
‘‘ఒక్క నిమిషం నాన్నా. లోపలకు వెళ్లి బట్టలు మార్చుకొస్తాను’’
తల్లితండ్రులు రెచ్చిపోతారు. తామెంత కష్టపడి పెంచారో, ఎన్నివంటకాలు వండి పెట్టారో, అడిగినవన్నీ ఎలా కొనిచ్చారో దండకం సాగిపోతుంది. కానీ అబ్బాయి ఎందుకు బత్తాయిలు తేలేదో తల్లి ఆలోచించదు, ఒక్క నిమిషం ఆగడానికి తండ్రి అంగీకరించడు.
ప్రతి ఒక్కరికీ కోరికలుంటాయి, ఆశలుంటాయి, ఆశయాలుంటాయి, భయాలుంటాయి. అలాగే ఎదుటివాళ్ళకి కూడా ఉంటాయన్న స్పృహ ఉండదు. ఆఫీసులో పనిచేసేవారికి పై అధికారుల తిట్లు, ప్రమోషన్లలో అన్యాయాలు, ట్రాఫిక్‌లో కష్టాలు, సహోద్యోగుల మోసాలు.. ఇలా ఎన్నో సమస్యలు. గృహిణికి పనిమనిషి రాకపోకలు, కరంట్ కట్, నీళ్ళు, పిల్లల అల్లరి, గ్యాస్, ధరల పెరుగుదల... ఇలా ఎన్నో కష్టాలు. మనం చెప్పినపనిని ఎదుటివాళ్ళు చెయ్యడం లేదా? లేక చెయ్యలేకపోతున్నారా? అన్న ప్రశ్నలు వేసుకోవడం మాత్రం చాలా అరుదు.
ఇక్కడే ఇంకొక వింత పోకడ కన్పిస్తుంది. కాశీయాత్ర చేయించలేని కొడుకు మీద కోపగించిన తల్లిదండ్రులు జూదమాడి అప్పులపాలైన కొడుకుని ఆదుకుంటారు. పరాయి ఆడవాళ్ళతో తిరిగే భర్తను ‘‘మావారు గోపాలకృష్ణుడమ్మా’’ అని వెనకేసుకొస్తారు. వంట చెయ్యకుండా టివికి కళ్ళప్పగించి కూచునే భార్యకు హోటల్ నుండి కారియర్ రెడీ. ఎన్నటికీ అర్థంకానిదొక్కటే. అదే మానవ ప్రవృత్తి.
-అనామిక
english title:
eppudu
Date:
Monday, January 30, 2012