నిడమర్రు, జనవరి30: కొల్లేరు తీరప్రాంతమైన మారుమూల గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మాగాంధీ ఆశయాలు తమ జ్ఞాపకాల కోసం గాంధీభవనం నిర్మించడం భారతదేశానికే గర్వకారణమని అమెరికన్ దేశానికి చెందిన న్యాయమూర్తి, ఇయస్‌పి టీమ్‌లీడర్ గ్యారీజేబ్రోన్ అన్నారు. సోమవారం రోటరీక్లబ్ ఇంటర్నేషనల్ సంస్ధ సభ్యులు కల్చరల్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా పెదనిండ్రకొలను గాంధీభవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీమ్‌సభ్యులు మాట్లాడుతూ మరణించిన ఓ మనిషిని మహాత్మునిగా కొలుస్తూ పూజించడం భారతదేశప్రజల ఔన్యత్యాన్ని చాటిచెబుతుందన్నారు. గాంధీకోసం ఇంతపెద్ద కట్టడాన్ని నిర్మించి, కార్యక్రమాల్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. గాంధీభవనంలోని గ్రంధాలయాన్ని దర్శించి, చిత్రపటాలను చూచి పులకించిపోయారు. ఈ సందర్భంగా గాంధీభవన అభివృద్ధికమిటీ సభ్యులు వారిని పూలదండలతో ఆహ్వానించారు. గాంధీభవనంలో జరిగిన గాంధీవర్ధంతి వేడుకల్లో పాల్గొని, నివాళులర్పించి, శాంతిప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఫత్తేపురం గ్రామానికి వెళ్ళి మూర్తిరాజు నివాసంలో మూర్తిరాజును కలుసుకుని ఆతిధ్యాన్ని స్వీకరించారు. గాంధీభవనంలో పలువిద్యార్ధులతో వివిధ కార్యక్రమాలు జరిగాయి.
కన్నుల పండువగా శ్రీవారి గ్రామోత్సవం
ద్వారకాతిరుమల, జనవరి 30 : రధసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీవారి గ్రామోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ఆవరణలో శ్రీవారి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తొళక్కం వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి వాహనం తిరువీధులకు పయనమైంది. పలువురు భక్తులు శ్రీ స్వామివారికి నీరాజనాలు సమర్పించుకున్నారు. క్షేత్రంలో రధసప్తమి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యభగవానునికి ప్రత్యేక నమస్కారాలు, పూజలు చేశారు.
విఆర్వో, కార్యదర్శి సస్పెన్షన్
ఏలూరు, జనవరి 30: నిడమర్రు మండలం బువ్వనపల్లిలో అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటుచేసిన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విఆర్వో డి మోజెస్, పంచాయితీ కార్యదర్శి డివి రమణలను సస్పెండ్ చేస్తూ ఏలూరు ఆర్డీవో కె నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్ ఆదేశాల మేరకు వీరిద్దర్ని సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. బువ్వనపల్లిలో ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే విగ్రహాన్ని ఏర్పాటుచేసినా కనీసం సమాచారం అందించకుండా ఈ ఇరువురు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆర్డీవో తెలిపారు.