వనస్థలిపురం, డిసెంబర్ 12: విశిష్ఠ తేదీ అయిన 12-12-12 పురస్కరించుకొని వనస్థలిపురంలోని లోటస్‌ల్యాప్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు వినూతన కార్యక్రమం నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ పతాకాన్ని చేతబూని మధ్యాహ్నం 12 గంటలకు 2012 మంది విద్యార్థులు 12 నిమిషాల వ్యవధిలో 12సార్లు జాతీయ గీతాన్ని ఆలపించి ఆకట్టుకున్నారు. 12 వృత్తుల వేషదారణలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, సామ ప్రభాకర్‌రెడ్డి, లోటస్‌ల్యాప్ విద్యా సంస్థల డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, బిజెపి నాయకుడు గిరిధర్ పాల్గొన్నారు.
బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఉప్పల్, డిసెంబర్ 12: పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యంను బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న గోడౌన్‌లో సివిల్ సప్లయిస్ అధికారులు ఆకస్మిక తనిఖీచేసి 200 క్వింటాళ్ల బియ్యం సంచులు, ప్రభుత్వ నెంబర్ ముద్రతో ఉన్న 346 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకుని రెండు లారీలను సీజ్ చేశారు. పరారీలో ఉన్న నిందితులపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అసిస్టెంట్ సివిల్ సప్లయిస్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే మల్కాజిగిరి ఎస్‌పి నగర్‌లో నివసిస్తున్న బిట్ల అంజయ్య పరిసర ప్రాంతాల్లోని రేషన్ డీలర్లకు గోడౌన్ నుండి షాపులకు రేషన్ బియ్యంను కొంత కాలంగా ట్రాన్స్‌ఫోర్టు చేస్తున్నారు. మంగళవారం రాత్రి అందిన సమాచారం ప్రకారం చెంగిచర్ల- చర్లపల్లి మధ్య ఉన్న సివిల్ సప్లయిస్ గోడౌన్‌లోకి బయట నుండి లారీ నెంబర్ (ఎపి 16టియు 0436)లో రేషన్ బియ్యంను తెప్పించాడు. అన్‌లోడ్ చేసి ఇతర తెల్ల సంచులలో 50కిలోల చొప్పున నింపించి మరో లారీ నెంబర్ (ఎపి 29టిఎ 6666)లో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడే ఉన్న అంజయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా సంచుల్లో నింపినవి రేషన్ బియ్యమేనని ఒప్పుకున్నట్లు ఏఎస్‌ఓ శ్రీనివాస్ తెలిపారు.
అయితే ఎక్కడి నుండి తెచ్చిన విషయం చెప్పడంలేదని ఆయన విలేఖరులకు పేర్కొన్నారు. ఈ సంఘటనలో బాధ్యులైన లారీ డ్రైవర్లు, క్లీనర్లు, హమాలీలు పరారయ్యారని ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువుల చట్టం 6ఎ యాక్టు కింద బియ్యం సంచులను సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు ఆయన వివరించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో సివిల్ సప్లయిస్ అధికారులు మోహన్‌బాబు, నరేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. ఎంతో సెక్యూరిటీ ఉన్న గోడౌన్‌లోకి బయటనుంచి బియ్యం రావడానికి వీలులేదు. ఒకవేళ అధికారికంగా వస్తే ఇందుకు సంబంభించిన బిల్లులు, ఇతర వివరాలు ఉండాలి.
అవేమీ లేకుండా బయట నుండి నేరుగా గోడౌన్‌లోకి వచ్చిన రేషన్ బియ్యం సంచులను లోపల పెట్టకుండా బయట చాటుగా ఇతర తెల్ల సంచులలో నింపుతుంటే అక్కడ ఉన్న అధికారులుగానీ, సెక్యూరిటీగానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో కాలంగా రేషన్ బియ్యం ఇదే ప్రాంతంలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అధికారులు పట్టుకున్నారు.
పేదలపై మోయలేని భారం
మహేశ్వరం, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి కరెంటు, బస్ చార్జీలు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాలరాస్తూ, సబ్సిడీలను ఎత్తివేస్తూ పేదలపై అధిక భారం మోపుతుందని వై.ఎస్.షర్మిల ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. బుధవారం రెండవరోజు మండలంలోని మన్‌సాన్‌పల్లి నుంచి ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మహేశ్వరం, సిరిగిరిపురం, హర్షిగూడ, మంఖల్, తుక్కుగూడ మీదుగా 18 కి.మీ కొనసాగింది. షర్మిల మాట్లాడుతూ, మహేశ్వరంలో సర్వే నెంబర్ 306లోని భూములను ప్రభుత్వం అన్యాయంగా స్వాధీనం చేసుకుని ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తుందని, భూములు కోల్పోయిన పేదలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో మంచినీరు, కరెంటు కోత, సర్‌చార్జీల మోతతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నేటికీ అనేకమంది నిరుపేదలు స్వంత ఇళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారని, మరో ఆరు నెలల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు. మహిళలు, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, పావలా వడ్డీ రుణాలు అందడంలేదని, మహళలు ఆత్మగౌరవంతో బతకాలని వైఎస్సార్ పావలా వడ్డీ రుణాలు అమలు చేసారని గుర్తుచేసారు.
జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రతి మహిళ, రైతుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులకు ఏడువందల రూపాయల పింఛన్లు ఇస్తామన్నారు. కరెంటు కోతతో పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు.
హర్షిగూడలో దివంగత వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. గ్రామస్తులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఆమె వెంట దేప భాస్కర్‌రెడ్డి, జనక్‌ప్రసాద్, లక్ష్మీపార్వతి, శోభానాగిరెడ్డి, ఎస్.రంగారెడ్డి, బి.జంగారెడ్డి, చెరుకు శ్రీను కందుకూరు, సరూర్‌నగర్ తదితర డివిజన్‌ల నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.
కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల పాదయాత్రలో మంగళవారం మండలంలోని కోళ్లపకల్ వద్ద తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మలను అగౌరవపర్చినందున వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం టిఆర్‌ఎస్ నేతలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ధర్నా చేస్తున్న ఆంజనేయులు, లింగం, మల్లేష్, ఎం.నర్సింహ తదితరులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీపై విడుదల చేసారు.
భావితరానికి నేటి విద్యార్థులు దశ-దిశ చూపాలి
శంకర్‌పల్లి, డిసెంబర్ 12: భావితరాలకు, ఈ దేశానికి బంగారు దిశను అందించేలా నేటి విద్యార్థులు ప్రతిభను చూపాలని, కేంద్ర పునరుత్పాదక వనరుల శాఖ మంత్రి ఫారుఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. మండలంలోని దొంతాన్‌పల్లి వద్దనున్న బిజినెస్ స్కూల్ (ఐబిఎస్) విద్యార్థులు నిర్వహిస్తున్న ‘మసన్’ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని, ఈ సంకల్పం రావాలంటే నా దేశం- మన ప్రజలు అన్న భావనను ప్రతి భారతీయుడు అలవర్చుకోవాలన్నారు. దేశానికి కావలసిన కొత్త కొత్త ప్రణాళిలను విద్యార్థులు రూపొందించేలా విద్యాబోధనను సాధించాలని పిలుపునిచ్చారు. మనిషి నిత్యం విద్యార్థేనని తెలుసుకుని కష్టపడితే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవ్చని, డబ్బు జీవితంలో ఒక భాగంగా ఎంచుకోవాలి తప్ప అదే ఆశయమని అనుకుంటే ప్రగతి, పాటవాలు దరిచేరవని తెలిపారు. యువతను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని, రాష్ట్రంలో కూడా సోలార్ ఎనర్జీని పెంపొందించేందుకు కేంద్రం 30 శాతం, రాష్ట్ర వాటా 20 శాతంగా మొత్తం 50 శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించనున్నదని ఆయన తెలిపారు. మరో ముఖ్య అతిథి మురళీ బుక్కపట్నం- వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పే తరుణంలో మంచి బాటను చూపే గురువు మార్గాన నడవడంవల్ల సక్సెస్ వస్తుందన్నారు. ఐబిఎస్ వైస్‌చాన్సలర్ జె.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాలేజీ విద్యార్థులు సాధించిన ఫలితాలను క్యాంపస్‌లో చేపట్టే కార్యక్రమాల గూర్చి వివరించారు. ఇక్ఫాయ్ ఫౌండేషన్ సొసైటీ ప్రెసిడెంట్ శోభారాణి, యశస్వీ, కాలేజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, చేవెళ్ల డిఎస్పీ శిల్పవల్లీ, సిఐ శ్రీనివాస్, తహశీల్దార్ వసంతకుమార్, ఆర్‌ఐ పాండు, ఎస్‌ఐ చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.