హైదరాబాద్, డిసెంబర్ 12: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకీ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు అధికారులకు అక్రమార్జనను సమకూరుస్తూనే, సామాన్య ప్రజల పాలిట ప్రాణసంకటంగా మారుతున్నాయి. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలకు రాజకీయ, డబ్బు పలుకుబడి అండ కాగా, వీటిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్న అధికారులకు కళ్లెం వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణగూడ మెయిన్‌రోడ్డులో ఓ అక్రమ నిర్మాణం కుప్పకూలి 13 మందిని పొట్టనబెట్టుకున్న దుర్ఘటన నగర ప్రజల మదినుంచి ఇంకా చెరగకముందే రాంనగర్‌లో మరో బహుళ అంతస్తు భవనం బుధవారం స్వల్పంగా భూమిలోకి కూరుకుపోయంది. దాదాపు 40 అడుగుల చదరపు గజాల స్థలంలో యజమాని కమర్షియల్ భవనంగా ఏకంగా ఐదు అంతస్తులు నిర్మించారు. ఈ భవనంలో ప్రస్తుతం పేరుగాంచిన ఓ వస్తద్రుకాణం కొనసాగుతోంది. కేవలం నలభై చదరపుగజాల స్థలంలో గ్రేటర్ బల్దియా అధికారుల కాసుల కక్కుర్తి, స్థానిక రాజకీయ నేతల అండతో ఈ నిర్మాణం కొద్దినెలల క్రితం యధేచ్ఛగా పూర్తయ్యింది. ఓ కేంద్ర మాజీ మంత్రి, శాసన సభ్యుడితో పాటు వివిధ పార్టీలకు చెందిన స్థానిక గల్లీ నేతలకు కూడా ఈ భవన నిర్మాణం ఓ కాసుల పంటగా మారి లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు తెల్సింది. అయితే ఇంతటి చిన్న స్థలంలో ఏకంగా ఐదు అంతస్తులు నిర్మించిన ఈ భవనంతో తమకెపుడైనా ముప్పుపొంచి ఉందంటూ పలువురు స్థానికులు దాదాపు ఆర్నెల్ల నుంచి స్థానిక మున్సిపల్ సర్కిల్ అధికారులకు, పలుసార్లు ఏకంగా కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా, ఫలితం దక్కలేదు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమైన ఈ భవనాన్ని కూల్చివేసేందుకు కమిషనర్ ఏర్పాటు చేసుకోగానే ఓ కేంద్ర మాజీ మంత్రి, మరో ఎమ్మెల్యేలు నేరుగా కమిషనర్‌కు ఫోన్ చేసి రాజకీయంగా వత్తిడి చేస్తున్నట్లు తెల్సింది. ఫలితంగా స్థానికులు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా, ఉన్నతాధికారులు చర్యలు చేపట్టలేకపోయారు. ఫలితంగా ఈ భవనం బుధవారం స్వల్పంగా కూరుకుపోయింది. అంతేగాక, భవనానికి పలు చోట్ల పగుళ్లు కూడా రావటంతో ఈ భవనానికి ఇరుగుపొరుగు, ముందు వెనుక ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
‘ఆదేశాలే’ ఆసరాగా అక్రమార్జన?
అక్రమ నిర్మాణాలు చేపట్టేవారెంతటి వారైనా ఉపేక్షించేలేదంటూ కొన్ని సందర్భాల్లో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, అక్రమ నిర్మాణాలను తొలగిస్తామంటూ మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి, సర్కిళ్ల వారీగా అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేయండి అంటూ కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు జారీ చేస్తున్న ఆదేశాలు టౌన్‌ప్లానింగ్ అధికారుల అక్రమార్జనకు మార్గంగా మారుతున్నాయి. అమాత్యులు, ఉన్నతాధికారుల ఇలాంటి ఆదేశాలను సాకుగా చూపుతూ సర్కిళ్ల స్థాయిలో విధులు నిర్వర్తించే టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటిని తొలగించాల్సి ఉండగా, యజమానుల నుంచి భారీ మొత్తంలో ఆమ్యామ్యాలను స్వీకరించి వౌనం వహిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. రెండు రోజుల క్రితం టౌన్‌ప్లానింగ్ విభాగంపై సమీక్ష నిర్వహించిన కమిషనర్ అక్రమ నిర్మాణాలను గుర్తించటంతో పాటు వాటిని కూల్చివేసేందుకు అధికారులకు టార్గెట్లు విధించిన సంగతి తెల్సిందే. ఆయన ఆదేశాలు జారీ చేసి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి సర్కిళ్లతో పాటు సెంట్రల్ జోన్‌లోని పలు ప్రాంతాల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు అదే పనిగా అక్రమ నిర్మాణాల కోసం వేట ప్రారంభించారు. అయితే అక్రమ నిర్మాణాలు నిర్మించేటపుడే యజమాని నుంచి అందినంత దండుకునే టౌన్‌ప్లానింగ్ అధికారులు మరోసారి పెద్ద మొత్తంలో వసూలు చేసుకునేందుకే అమాత్యులు, ఉన్నతాధికారుల ఆదేశాలను వాడుకుంటున్నారే తప్పా, అయ్యప్ప సొసైటీ మినహా ఇప్పటి వరకు ఎక్కడా కూడా అక్రమ నిర్మాణాన్ని కూల్చిన దాఖలాల్లేవు. పైగా అక్రమ నిర్మాణాల యజమానులకు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోమని సలహాలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫలానా భవనం అక్రమ నిర్మాణమని, దానికి కోర్టు స్టే ఉందన్న విషయం తెల్సుకున్న ఉన్నతాధికారులు సైతం ఆ స్టేను ఖాళీ చేయాలని కనీసం కోర్టులను కూడా కోరకపోవటం వారి అవినీతి, ఆలసత్వం, నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.
కాంగ్రెస్‌కు మరో దెబ్బ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 12: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే! ఇపుడు తాజాగా గ్రేటర్ కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్ కూడా పార్టీ సభ్యత్వానికి, ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం తన రాజీనామా పత్రాన్ని పిపిసికి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ద్వారా పంపినట్లు సమాచారం. గ్రేటర్ కౌన్సిల్‌లోని కాంగ్రెస్ కార్పొరేటర్లు భారీగా వైకాపాలోకి వలసలు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో కార్పొరేటర్లను బుజ్జగించేందుకు ఆ పార్టీకి చెందిన మంత్రులు, అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఫలించటం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఆదం విజయ్‌కుమార్, హబ్సిగూడ కార్పొరేటర్ హరివర్థన్‌రెడ్డి, సురారం కార్పొరేటర్ సూర్యనారాయణరెడ్డిలు వైకాపా పార్టీలో చేరగా, కొద్ది రోజుల క్రితం సత్వంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచిన చర్లపల్లి కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి వైకాపాలో చేరారు. ఇపుడు కాలేరు వెంకటేశ్ కూడా వైఎస్సార్ గూటికి చేరేందుకు సిద్ధం కావటం మరో దెబ్బ అని చెప్పవచ్చు.
దాదాపు పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, ప్రజలకు సేవ చేసిన తాను వైకాపాలో చేరేందుకు, కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పొవటమే కారణమని ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేశ్ వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని, పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించటంలోనూ కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు. అంతేగాక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మెరుగైన సేవలందిస్తుందన్న నమ్మకంతో త్వరలో ఆ పార్టీలో చేరునున్నట్లు కూడా వెంకటేశ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
శిఖం భూములలో ఇళ్లు నిర్మిస్తే క్రిమినల్ కేసులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 12: చెరువుల, కుంటల శిఖం భూములలో ఇళ్లుకాని ఇతర నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జగన్నాథం హెచ్చరించారు.బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమంలో జిల్లా నుండి పలు ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 ముత్యాలరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ మండలం కండ్లకోయి గ్రామం దగ్గరలోని చెరువు శిఖం భూమిలో అశోక్‌రెడ్డి అనే వ్యక్తి రాత్రిపూట ఇళ్లు నిర్మిస్తున్నారని, అదే మండలంలో డబీల్‌పూర్ గ్రామ పరిధిలోని మహాలక్ష్మి వెంచర్ వారు కుంటను కబ్జాకు పాల్పడి లే అవుట్ చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారని జాయింట్ కలెక్టరు దృష్టికి తేగా జెసి స్పందిస్తూ ప్రభుత్వ శిఖం, పట్టా శిఖం భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతిలేదని, శిఖం భూములలో వెలసిన అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరుగుతుందని, సంబంధించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న ల్యాండ్ ప్రొటెక్షన్ అధికారిని ఆదేశించారు.
కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని సర్వే నెంబరు 77లోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఇందులో స్థానిక విఆర్‌ఓ కబ్జాదారులతో కుమ్మక్కయి వారికి సహకరిస్తున్నారని ఫిర్యాదు చేయగా, విఆర్‌ఓపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
సరూర్‌నగర్ మండలం బాలాపూర్‌లోని సర్వే నెంబరు 90లో అక్రమ లే అవుట్ చేస్తున్నారని నరేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా తహసీల్దార్‌చే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ సమాధానమిచ్చారు. విరాసత్‌కు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్టిఫైడ్ కాపీలు ఇతర రెవెన్యూ పరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటూ పూడూరు, శామీర్‌పేట, మర్పల్లి మండలాల నుండి కాలర్లు జాయింట్ కలెక్టరు దృష్టికి తీసుకురాగా సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వటం జరుగుతుందని జాయింట్ కలెక్టరు సమాధానమిచ్చారు.
పశుక్రాంతి పథకం కింద మంజూరైన పశువులను స్థానికంగానే కొనుగోలు చేసి ఇప్పించాలని గండీడ్ మండలం సల్‌బత్తాపూర్ గ్రామస్థుడు విజయకుమార్ కోరగా, పశు సంవర్ధక శాఖకు తగు ఆదేశాలు జారీచేస్తామని తెలిపారు. గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల చెల్లింపులు, మంచినీరు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పనులపై మొత్తం 23 కాల్స్ అందాయి.
అనంతరం ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇళ్ళ స్థలాలపై జాయింట్ కలెక్టరు 2 ముత్యాలరాజు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు లేని వారికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి ఇందిరమ్మ పథకం కింద అర్హత కలిగి ఇళ్ళ స్థలాలు లేని వారికి కేటగిరి-సి క్రింద ఎక్కడెక్కడ ఇళ్ళ స్థలాలు కేటాయించాలో అందుకు సంబంధించి నివేదికను అందించాలని జెసి హౌజింగ్ శాఖ పిడిని ఆదేశించారు.
డివిజన్ స్థాయిలో ఆర్‌డిఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవసరమైన చోట్ల భూమి కొనుగోలు చేసి లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
సమావేశంలో ఇంచార్జి డిఆర్‌ఓ రవీందర్‌రెడ్డి, డిఎస్‌ఓ నర్సింహ్మారెడ్డి, లా అధికారి వేణుగోపాల్, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలపై
అవగాహన కల్పించండి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 12: రాబోయే రోజుల్లో విద్యుత్తు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరిపంట కాకుండా ఆరుతడి పంటలు సాగుచేయాల్సిందిగా రైతులకు తగు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మ్యాథ్యుస్ ఆదేశించారు.
రాష్ట్రంలో రబీసీజనులో పంటల సాగుపై బుధవారం సచివాలయం నుండి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కొంతమేర కరెంటు కొరత ఉన్నందున రబీ సీజన్‌లో వరిసాగుకు అవసరమైన నీరు అందివ్వలేమని, అందువల్ల రైతులందరు మొక్కజొన్న, వేరుశనగ, జొన్న తదితర ఆరుతడి పంటలు సాగుచేసుకొని లబ్దిపొందేందుకు వీలుగా వారిని చైతన్యపర్చాలని సూచించారు. ఇందుకై ప్రత్యేకంగా క్యాంపేన్ నిర్వహించాలని కూడా ఆమె తెలిపారు.రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఎ.వాణీప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో వరి పంట కాకుండా మొక్కజొన్న, పప్పుదినుసులు, వేరుశనగ, కూరగాయలు వంటి పంటలను సాగుచేసేలా ఇప్పటికే రైతులను చైతన్యపర్చడం జరిగిందని, ఇందుకవసరమైన విత్తనాలు కూడా సంసిద్ధంగా ఉంచామని తెలిపారు. జిల్లాలో 2011 సంవత్సరంలో రబీ సీజన్‌లో 13,486 హెక్టార్లలో వరిసాగు చేయగా ఈ సంవత్సరం దాదాపు 10 వేల పైచిలుకు హెక్టార్లలో వరినాట్లు వేస్తున్నారని తెలిపారు.
రైతులు ఈ అంశంపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని ఆమె వివరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వరిసాగు చేయాలనుకునే రైతులు శ్రీవరి, ఎస్.ఎమ్.ఎస్.ఆర్.ఐ. మరియు డ్రమ్ సీడ్ పద్ధతి ద్వారా వరిసాగు చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచనలందజేస్తున్నారని కూడా కలెక్టరు ప్రధాన కార్యదర్శికి వివరించారు. గత రబీలో 5301 హెక్టార్లలో సాగైన శనగ పంట ఈ సంవత్సరం 7364 హెక్టార్లలో సాగు చేశారని, అదేవిధంగా గతంలో 9290 హెక్టార్లలో వేసిన వేరుశనగ ఈసారి 9808 హెక్టార్లకు పెరిగిందని, పెరిగిన ఈ పంట విస్తీర్ణం వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేయాలనుకున్న రైతుల నిర్ణయానికి నిదర్శనమని ఆమె వెల్లడించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టరు విజయకుమార్, ట్రాన్స్‌కో యస్‌ఇ, హార్టికల్చర్ ఎడి తదితరులు పాల్గొన్నారు.
కబ్జాల పర్వం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 12: రోజురోజుకు విస్తరిస్తున్న కాలనీలు, ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ప్రభుత్వ భూములు, శిఖం భూములపై కనే్నసిన కబ్జాదారులు టెక్నికల్ సాకుతో మ్యాప్‌లు మారుస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు నగర శివారు రంగారెడ్డి జిల్లా పరిధిలో కోకొల్లలుగా వినిపిస్తున్నాయి.
నిరుపేదలకు ఇళ్ళంటూ ఒకరు... ఈ స్థలం మాదేనంటూ మరొకరు... చెరువులో ఉన్నా అది ప్రైవేట్ భూమే అంటూ మరికొందరు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాలకు పాల్పడుతున్నా జిల్లా యంత్రాంగం మాత్రం ఏమిచేయలని దీన స్థితిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధానంగా కేవలం సాంకేతిక పరమైన నిర్ణయాలను అనుసంధానం చేసుకుంటూ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, శిఖం భూములను కాపాడుకునే రెవెన్యూ యంత్రాంగానికి భూకబ్జాలను అధికమించడం పెను సవాల్‌గా మారుతోంది. రాజకీయ పలుకుబడితో ఒకరు, మామూళ్ల మత్తులో ముంచెత్తుతూ మరొకరు అధికారుల కళ్లు కప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలతో రోజురోజుకు ప్రభుత్వ పరిరక్షణలో ఉండాల్సిన భూములు కనుమరుగవుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో విలువైన భూములను పరిరక్షించేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించలేమన్న ఆలోచనతో తెలుగుదేశం హయాంలో కొన్ని మండలాల స్థాయిని తహసీల్దార్ నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి పెంచినప్పటికి వీరి ఆగడాలు మాత్రం యధేచ్చగా కొనసాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయ పలుకుబడితో కుర్చీలో కుచున్న కొంతమంది అధికారులు నాయకుల ఆదేశాల మేరకే తప్ప ఉన్నతాధికారుల ఆదేశాలు, నియమ నిబంధనలను పట్టించుకునే పరిస్థితులో లేరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2005లో అప్పటి జాయింట్ కలెక్టర్ శివారు ప్రాంతాల్లోని చెరువులకు ఎఫ్‌టిఎల్ నిర్ధారించి పిల్లర్స్ ఏర్పాటుచేయడంతోపాటు పటిష్టమైన రికార్డులను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సదరు రికార్డుల చిరునామా మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు సరూర్‌నగర్ మండలం మన్సూరాబాద్ పెద్ద చెరువులో అప్పటి డిప్యూటీ కలెక్టర్ రమామణి ఆధ్వర్యంలో ఎఫ్‌టిఎల్ సరిహద్దులను నిర్ణయించేందుకు ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి సర్వేచేసి హద్దులు బిగించి, మ్యాప్‌లు రూపొందించి కబ్జాలను తొలగించినప్పటికి ప్రస్తుతం సదరు మ్యాప్‌లో మార్పులు జరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి సర్వే మ్యాప్‌లో హయత్‌నగర్, సరూర్‌నగర్ మండల సర్వేయర్లు, ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంయుక్తంగా సర్వే చేసి రూపొందించిన మ్యాప్ ఉన్నప్పటికి దాని ప్రకారం కాకుండా ప్రస్తుత అధికారులు నిర్వహించిన మ్యాప్, దానికి భిన్నంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి సర్వే నెంబరు 47లోని పెద్ద చెరువు ట్యాంక్ బెడ్ పరిధిలో సుమారు ఒక ఎకరం భూమిని ఎఫ్‌టిఎల్ పరిధిలోకి రాదంటూ ఇరిగేషన్ అధికారులు హద్దులు ఖరారు చేసారని రెవెన్యూ అధికారులు వివరించారు. గతంలో తొలగించిన అక్రమ కట్టడాలు కూడా ప్రస్తుతం ఎఫ్‌టిఎల్ పరిధిలోకి రాదంటూ ఇరిగేషన్ అధికారులు హద్దులు బిగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నెం.46లో సుమారు 1650 గజాల విస్తీర్ణంలో ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారంటూ అప్పటి డిప్యూటీ కలెక్టర్ సదరు నిర్మాణాలను తొలగించడంతోపాటు పలువురిపై కేసులు నమోదుచేసినప్పటికి ప్రస్తుతం సదరు స్థలం ఎఫ్‌టిఎల్ పరిధిలోకి రాదని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పడంపై రెవెన్యూ అధికారులకు సైతం పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ మేరకు సరూర్‌నగర్ డిప్యూటీ కలెక్టర్ రెండు రకాలుగా నిర్వహించిన ఎఫ్‌టిఎల్ ఖరారు మ్యాప్‌లో తేడాలున్నాయంటూ వీటిలో ఏది వాస్తవమో తెలుపాలంటూ ఇరిగేషన్ అధికారులకు లేఖ రాసినప్పటికి తాము గతంలో చేసిన సర్వేను మర్చిపోయి ఇప్పటివరకు ఎలాంటి సర్వే చేయలేదని, ఇప్పుడే ఎఫ్‌టిఎల్ పరిధిని నిర్దిస్తున్నామంటూ వివరణ ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో సాంకేతికపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం తమకు లేదంటూ రెవెన్యూ అధికారులు చెప్పడంతో కేవలం సర్వేయర్లు తీసుకునే నిర్ణయాల ఆధారంగా ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, యుఎల్‌సి భూములను పరిరక్షించడమే తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. అలాగే చెరువులు, కుంటలు, శిఖం భూములను రక్షించాలంటే ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లను ఆశ్రయించడమే గత్యంతరంగా భావిస్తున్న రెవెన్యూ అధికారులు పూటకో రకంగా హద్దులు నిర్ణయిస్తూ వచ్చే నివేదికలతో ఇబ్బందులకు గురవుతున్నామన్న ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు.
రసాభాసగా వైకుంఠ దర్శన టిక్కెట్ల పంపిణీ
ముషీరాబాద్, డిసెంబర్ 12: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి దర్శనార్థం కంకణాలు కట్టుకోవడానికి టిక్కెట్ల జారీ ప్రక్రియ రసాభాసగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, ఏర్పాట్ల కొరతతో వేలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన ద్వారం వద్ద తొక్కిసలాట జరగడంతో ఓ వ్యక్తి స్పృహ తప్పగా, ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకవచ్చారు. ఈనెల 23న వైకుంఠ ఏకాదశి, 24న ద్వాదశి పురస్కరించుకుని తిరిపతిలోని శ్రీవారి దర్శనార్థం హిమాయత్‌నగర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో టిక్కెట్ల జారీ ప్రక్రియ ఏర్పాటు చేశారు. ఆర్జిత సేవ రూ.300 టిక్కెట్ల కోసం ఉదయం ఏడు గంటల నుంచి వేలాది మంది భక్తులు బారులుతీరారు. కేవలం 1500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండగా దాదాపు 10వేల మంది భక్తులు పోటెత్తారు. కౌంటర్లలో కంప్యూటర్ల మోరాయింపు, తీవ్ర రద్దీ, సౌకర్యాల లేమితో తొక్కిసలాట జరిగింది. ఆబిడ్స్ ఏసిపి లింబారెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
12గంటల ఘంటసాల సంగీత స్వరయాగం 15న
నల్లకుంట, డిసెంబర్ 12: ఘంటసాల వేంకటేశ్వరరావు ఆర్ట్ అకాడమి ఆధ్వర్యంలో ఘంటసాల 90వ జయంతి సందర్భంగా ఘంటసాల సంగీత కళాశాల విద్యార్ధిని విద్యార్ధులు సమర్పించు 12గంటల ఘంటసాల సంగీత స్వరయాగం కార్యక్రమం ఈ నెల 15న చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించనున్నట్లు టి.శరత్‌చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 7 జిల్లాల నుండి ప్రముఖులు అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. 27 మంది విద్యార్ధిని విద్యార్ధులకు డిప్లొమో సర్ట్ఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డా.అక్కినేని నాగేశ్వరరావు, ఆంధ్రసారస్వత కళాపరిషత్ అధ్యక్షుడు డా.సి.నారాయణ రెడ్డి, తెలుగు యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డా.ఎల్లూరి శివారెడ్డి పాల్గొంటున్నట్లు తెలిపారు.
మానవహక్కుల రక్షణకు చట్టాలను అమలు చేయాలి
నేరేడ్‌మెట్, డిసెంబర్ 12: స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లు గడిచినా ప్రజలు తమ హక్కుల కోసం ఇంకా పోరాడుతున్నారని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా దక్షిణ భారత చైర్మన్ ఆర్.రమేష్‌రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రభుత్వాలు మానవ హక్కుల రక్షణ కోసం చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలని కోరారు. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు, బాలకార్మికులు, భవననిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికులు తమ హక్కులను పూర్తిగా పొందలేకపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. హక్కులను హరించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ మానవహక్కుల సంఘం తరపున హక్కుల పరిరక్షణ కోసం పోరాడేందుకు నిరంతరం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక వర్కింగ్ చైర్మన్ శ్యాంచౌదరి, సహాయ కార్యదర్శి అజిత్‌రాజు, రాష్ట్ర మహిళాసెల్ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, నిర్వాహకులు విమలవసంత, ప్రభాకర్ జాన్‌స్టీవెన్, సంజీవరాయుడు పాల్గొన్నారు.
రూ. 3700 కోట్లతో ‘మహా’ బడ్జెట్?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 12: మహానగర పాలక సంస్థ రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్న సంగతి తెల్సిందే. గడిచిన నెలరోజులుగా అధికారులు వివిధ కోణాల్లో కసరత్తు చేస్తూ ఎట్టకేలకు రూ. 3700 కోట్లతో మహాబడ్జెట్‌ను రూపొందించినట్లు తెల్సింది. అంతేగాక, ఈ బడ్జెట్ ముసాయిదాను గురువారం జరగనున్న స్థారుూ సంఘం సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు తెల్సింది. అయితే స్థారుూ సంఘంలో ఈ బడ్జెట్‌పై చర్చ జరిగిన అనంతరం సభ్యుల సూచనలు, సలహాల మేరకు బడ్జెట్‌ను మరో రూ. 200 నుంచి రూ. 300 కోట్లకు పెంచే అవకాశం లేకపోలేదు. రూ 3700 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో రెవెన్యూ ఆదాయం రూ. 2600 కోట్లు, అలాగే రెవెన్యూ వ్యయం రూ. 1535, మిగులు నిధులు రూ. 1065 కోట్లు, పెట్టుబడుల ఆదాయం రూ. 2165 కోట్లు, అలాగే పెట్టుబడుల వ్యయాన్ని రూ. 2165 కోట్లుగా కేటాయించినట్లు తెలిసింది. అయితే వర్తమాన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌తో పోలిస్తే రానున్న ఆర్థిక సంవత్సరానికి అధికారులు రూపొందించిన బడ్జెట్‌ను కేవలం రూ. వంద కోట్లకు మాత్రమే పెంచినట్లు చెప్పవచ్చు. వర్తమాన ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించి గత సంవత్సరం నవంబర్ మాసంలో అధికారులు రూ. 3314 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించిగా, ఆ తర్వాత మేయర్ పగ్గాలు చేపట్టిన మజ్లిస్ పార్టీ బడ్జెట్‌లో పాతబస్తీకి నిధుల కేటాయింపును పెంచుతూ రూ. 3600 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించిన సంగతి తెల్సిందే. కానీ అయితే అధికారులు రూపకల్పన చేసిన రూ. 3314 కోట్ల బడ్జెట్ కాకుండా స్థారుూ సంఘం, కౌన్సిల్‌లలో మజ్లిస్, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేటాయింపులు, ఆదాయం, వ్యయాలపై చేసిన అభ్యంతరాల నేపథ్యంలో అంకెలు మారి ఎట్టకేలకు రూ. 3600 కోట్ల బడ్జెట్ ఆమోదం పొంది, సర్కారుకు పంపారు. అయితే ఇంత ‘మహా’బడ్జెట్‌ను రూపొందించినా, వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా సుమారు మూడున్నర నెలలు మాత్రమే ఉన్నా, ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో కనీసం రూ. రెండువేల కోట్ల పనులు కూడా చేపట్టకపోవటం గమనార్హం. గురువారం జరగనున్న స్థారుూ సంఘం సమావేశం ఇందులో కేటాయింపులపై ఎలాంటి అభిప్రాయాలు, అభ్యంతరాలను వెల్లడిస్తుందో? ఆ తర్వాత ఈ నెల 15న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో కూడా చోటుచేసుకున్న మార్పుల అనంతరం బడ్జెట్ ముసాయిదాకు తుది రూపాన్ని సంతరించుకుని, తదుపరి పరిపాలన ఆమోదం నిమిత్తం అధికారులు సర్కారుకు పంపనున్నారు.