హైదరాబాద్, డిసెంబర్ 12: ఆధార్ కార్డులు పూర్తి స్థాయిలో జారీ కాకపోయినా అయిన కాడికి లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లు తెరచి వచ్చే జనవరి ఒకటి నుంచి నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించాలని ప్రణాళిక, ఐటి రంగాలకు చెందిన ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. కార్యక్రమాన్ని కొనసాగిస్తునే వచ్చే ఏప్రిల్ నెల ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అందివ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నగదు బదిలీ కోసం రాష్ట్రంలో ఐదు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలను తొలుత నగదు బదిలీ పథకం అమలుకు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన జిల్లాల్లో ఇప్పటి వరకు 65 శాతం మాత్రమే ఆధార్‌కార్డులు జారీ కాగా, ఇంకా 35 శాతం పూర్తి చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ పథకాలకు చెందిన సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు చేరేవిధంగా నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నారు. వచ్చిన చిక్కు అంతా విద్యార్థులకు ఇస్తున్న ఉపకార వేతనాల అంశంలో లెక్కలు తేలడం లేదు. సబ్సిడీలకు చెందిన ఖచ్చితమైన విధానం లేనందున అమలు చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కేంద్రం దాదాపు 46 పథకాలకు చెందిన సబ్సిడీలను నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించడంతో రాష్ట్ర అధికారులు పరుగు తీస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాల్లో ఆధార్‌కార్డుల జారీ వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 49,94,523, అనంతపురం 35,11,397, చిత్తూరు 34,68,648, రంగారెడ్డి 26,38,044, తూర్పు గోదావరి 43,22,276 మందికి ఆధార్‌కార్డులు పంపిణీ చేశారు. కేంద్రం వివిధ రకాల శాఖలకు చెందిన లబ్దిదారులకు ఇస్తున్న పథకాలు విద్యాశాఖకు చెందిన ఎస్సీ, ఓబిసి విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు రాజీవ్ గాంధీ ఫెలోషిఫ్, మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్ ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, జాతీయ ఉపాధి మిషన్, గృహ నిర్మాణాలకు చెందిన సబ్సిడీ ఇస్తారు. బీడీ కార్మికులు, పెన్షన్లు, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం ఇచ్చే నగదును చెల్లిస్తారు.గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్లు, నిత్యావసరాలకు చెందిన సరుకులకు ఇచ్చే సబ్సిడీని ఇస్తారు. ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్ కార్డులకు ఇస్తున్న సబ్సిడీని ఆధార్‌కార్డులతో లింక్ చేస్తారు.
పాక్షికంగానైనా అమలు చేయాలని నిర్ణయం విద్యార్థుల ఉపకార వేతనాలతోనే చిక్కు రాష్ట్రంలో 65 శాతం ఆధార్ కార్డుల జారీ
english title:
ba
Date:
Thursday, December 13, 2012