తల్లిదండ్రుల చాటున ఉన్నంతకాలం జీవితం ఓ పాటలా సాగిపోతుంది. ఆ తర్వాత వ్యక్తిగత జీవిత వ్యధలు, వింతానుభూతులు, అనుభవాలు.. ఇలా సాగిపోతుంది జీవితం. ఇరవయ్యేళ్లలోపు తమ జీవితాన్ని కొన్ని పాటలతో ముడివేసి, పాటలతో ముడిపడి వున్న జీవితాన్ని చెబుతూ, ఫ్లాష్‌బ్యాక్‌లోకి తొంగిచూస్తూ అలనాటి ఆట పాటల జీవితాన్ని అందంగా మన ముందుంచారు వేదగిరి. ‘పాట వెనుక ఫ్లాష్’లో రాంబాబు చెప్పే విశేషాలతో మనం ఆయన గతంలోకి చూడటమే కాకుండా, చదువుతున్న మనల్ని మన గతంలోకి చూసేలా చేస్తాయి. మిగతా అన్నింటిలా గతం కూడా మనం కష్టపడి కాలాన్ని వెచ్చించి సంపాదించిందే. ఒక్కో సందర్భంలో ఆయన కలిసిన ప్రముఖులను ప్రస్తావిస్తూ కొన్ని.. జర్నలిస్టుగా ఎదిగే సమయంలో కలిసిన వారు మరికొంతమంది గురించి మాట్లాడుతూ - పి.బి.శ్రీనివాస్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఎవరైనా దూరమైతే వాళ్లల్లో విభేదాలే రానక్కర్లేదు. ఎవరితో పరిచయం ఎప్పుడు అవుతుందో, ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. జీవితాన్ని రైలు ప్రయాణంతో పోల్చడం ఎంతో సరైంది. రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎవరెవరో ఎక్కుతుంటారు. దిగుతుంటారు. అలాగే జీవితంలోనూ ఎవరెవరో కలుస్తుంటారు... ఇలా సాగిపోతుందాయన రచన. ఐతే - ఒక్కటి మాత్రం నిజం. ఆయా పాటలతో ఆయనకున్న అనుభూతుల విషయం పక్కనపెడితే.. ప్రతి వ్యక్తి జీవితంలోని ఒక్కో సంఘటన ఒక్కో పాటతో ముడిపడి ఉంటుంది. వాటిని ‘రివైండ్’ చేసుకోవటానికీ.. మనసుని రీచార్జ్ చేసుకోవటానికీ ఈ పుస్తకం దోహదపడుతుంది.
పాట వెనుక ఫ్లాష్
-డా.వేదగిరి రాంబాబు
వెల: రూ.50/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలలో.
నవోదయ బుక్ డిస్ట్రిబ్యూటర్స్
నవయుగ బుక్ హౌస్
శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్