ఈ పద్మవ్యూహ ప్రపంచంలో కవిత్వమొక తీరని దాహం అన్నాడు శ్రీశ్రీ. ఆ దాహం సత్యవోలు సుందరసాయిని పట్టి కుదిపేసింది. అందుకే ఆయన వోలేటి పార్వతీశంతో అనేక సందర్భాల్లో ‘ఎప్పుడో ఓసారి నేనూ వ్రాస్తాను కవిత్వం. అసలు కవిత్వం ఎలా ఉండాలో ఈ లోకానికి రుచి చూపిస్తాను’ అన్న మాట నిజం చేయక తప్పలేదు.
ఇలా సరికొత్త రుచులతో వడ్డించిన పట్టెడన్నమే సత్యవోలు సుందరసాయి కవితా సంకలనం ‘ఇది అబద్దాలు కావు’. అయితే ఈ కవితలు జిహ్వకోరుచినిస్తాయి. ఉదాహరణకు ‘సంపాదనకత్వం, పాత్రికేళీయం’ కవితలు ఆ రంగంలో ఉన్నవారికి వేపపూవుల్లా రుచిస్తే, అవును నిజమే సుమీ అనుకునే పాఠకుడికి బెల్లం ముక్కల్లా ఉంటాయి.
ఇదివరకే వచన రచనల సృష్ట అయిన సత్యవోలు ‘ఇవి అబద్ధాలు కావు’ అంటూ కవితాప్రియుల గుండెల్లో తన చేదు నిజాల చెణుకులతో తగు ముద్ర వేసే పనిలో పడ్డాడు. తనకు తెలిసిన ప్రపంచాన్ని, దాని నిజ స్వరూపాన్ని తన పరిధిలో కవిత్వీకరించాడు. ఆయన చూపులు సమాజపు దూర తీరాలకు వెళ్లకున్నా పరిమితి మేరకు ప్రతి అంశాన్ని కవితగా మలిచే ప్రయత్నం చేశాడు.
మనకు కథకులైన కవులున్నారు గాని కవులయిన కథకులు తక్కువే. కవిత ఏకాగ్రతతో వేసే ముత్యాల ముగ్గు కాగా, కథ ఆడుతూ, పాడుతూ చల్లే కల్లాపి. రెంటికీ నేలే ఆధారం. కాని ముగ్గు రూప ప్రధాన ప్రక్రియ. సుందరసాయి మూలతః వచనకారుడు కాబట్టి కావ్యం ఆయనతో పలుమార్లు దాగుడు మూతలు ఆడింది. అయినా ఏ అంశంపైనైనా కవిత్వం రాయగలననే ధీమాయే ఆయనను కాపాడింది.
‘ఆవేశం, అభిమానం, అనురాగం, అంతర్మథనం, ఆనందం... అలా ఎన్నో... ఎనె్నన్నో మనసును కుదిపినపుడు వాటిని భరించలేక బహిర్గతపరిచిన భావావేశం ఈ సంపుటి’ అంటాడు కవి తన ‘నా మాట’లో. అందుకే గాలి, నీరు, నిజం, రీతి, బంధం, సతి, భ్రమ, భజన, కోపం, కేక అన్నీ కవితా వస్తువులే. బావ, అధికారి, వైద్యుడు, న్యాయవాది, మేస్ర్తి, కాంట్రాక్టర్ అందరూ కవితకు అర్హులే. అయితే స్వీకరించిన కవితా వస్తువును కొత్త కోణంలో, సొంత శైలిలో ఆవిష్కరించి మెప్పించడంలోనే కవి విజయం దాగి ఉంది. ఈ సంపుటిలోని కొన్ని కవితల ద్వారా కవి తన విజయబావుటా ఎగరేశాడు.
‘దోచేవాడే దొర/దొరకనివాడే దొంగ/కుల, మతాలు కల్ల/ డబ్బుంటే పెద్ద కులం/ లేకుంటే అలగాజనం’ అంటూ కవి తన కవితా దిశ, దశను బహిర్గతం చేశాడు.
‘కదలిక’ కవితలో-నీటి బుడగలాంటి జీవితంలో/స్వార్ధమనే జలధి ఎందుకు ప్రవేశిస్తుంది?’ అంటాడు. ‘పచ్చదనం’లో-పుర్రెలోని భావాలు మంగళకరమైతే/ పుడకల్లో కాలినా అవి జ్వలిస్తాయి’ ద్వారా చివరకు మిగిలేవి భావాలే అంటాడు.
పై ఉదాహరణలన్నీ సరికొత్త అభివ్యక్తులే. అయితే వాసితో కూడిన రాశిపైనే సంకలనం యొక్క తూకం ఆధారపడి ఉంటుంది. ఈ సంపుటిలోని రెండు కవితల్లో కవి పత్రికా రంగంపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు చాలా సూటిగా ఉన్నాయి.
‘నాడు సంపాదకత్వం/ నేడు సంపాదనపర్వం/ ఆనాటి లక్ష్యం సమాజపరం/ ఈనాటి ధ్యేయం స్వీయభోగం’. ఇది అబద్ధాలే కావు.
‘స్వేదాభిషేకం’లో పాలమూరి కూలీల ఔన్నత్యాన్ని చాటినా, ‘్భజన’లో సేవా పరాయణత లేని భక్త శిఖామణుల బండారం బద్దలు కొట్టినా-ఈ నిరసనలో, నిలతీతలో కనుమరుగవుతున్న మనిషితనంపై కవి బెంగ వ్యక్తమవుతుంది. మంచితనాన్ని పంచి పెడుతున్న ఈ అక్షరాలను స్వాగతిద్దాం.
ఇవి అబద్ధాలు కావు
(కవితా సంకలనం)
రచన:
సత్యవోలు సుందరసాయి
వెల రూ: 100/-
ప్రతులకు: రచయిత 9299152060
ప్రచురణ: కినె్నర
పబ్లికేషన్స్-హైదరాబాద్