ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ కార్యదర్శి డా.మంగళంపల్లి ప్రమీలాదేవి సంపాదకత్వంలో పద సాహిత్య పరిషత్ హైదరాబాద్ వారి ప్రచురణ ‘ప్రజల మనిషి ప్రకాశానికి పద్య కవితా కల్హారమాల’ అనే సుదీర్ఘ నామం గల ఈ పుస్తకం. ఇందులో నిన్నటి ప్రసిద్ధ కవులు విశ్వనాథ, చిలకమర్తి, తుమ్మల, కరుణశ్రీ, గడియారం వెంకట శేషశాస్ర్తీ, మధునాపంతుల, దివాకర్ల, దాశరధి, జాషువా వంటి మహాకవులు మొదలుకుని నేటి మధుర కవులు బాపురెడ్డి, మల్లెమాల వగైరాలనుండి పెక్కుమంది జూనియర్ కవుల దాకా మొత్తం దాదాపు డెభ్భై మంది దాకా కవుల రచనలున్నాయి. కప్పగంతుల లక్ష్మణ శాస్ర్తీ, ముదిగొండ వీరభద్రమూర్తి వంటి సంస్కృత కవితలూ ఉన్నాయి.
పేరులో ‘పద్య కవితా కల్హార మాల’ అని ఉన్నా, ఇందులో పద్యేతర కవితలు చాలానే ఉన్నాయి.
ప్రకాశంగారు సైమన్ కమిషను తుపాకీ గుండుకు ఎదురొడ్డి నిలవడం చాలా ప్రసిద్ధ సంఘటన. దాన్ని చాలామంది కవులు స్పృశించి అజరామరం చేశారు. మచ్చుకు కొన్ని చూద్దాం.
‘జగా తుపాకులకు ఎద చూపించితివంట’-దివాకర్ల వేంకటావధాని
‘ఆంగ్లేయుల తుపాకులడలిపోవగ రొమ్ము/మారొడ్డి నిలచిన వీరవరుడు’-దాశరథి
‘ఎవడా కాల్చెడివాడు, కాల్చవలెరా ఈ రొమ్ముపై’ -తుమ్మల సీతారామమూర్తి.
‘రండిరా ఇది కాల్చుకొండిరా అని నిండు/గుండెలిచ్చిన మహోద్దండమూర్తి’- కరుణశ్రీ
‘తుపాకి గుండ్లకే ఎదురగు తెంపు’-గడియారం వేంకట శేష శాస్ర్తీ
‘పొంగిన నీ గుండె ముందు/వంగినది తుపాకీ గుండు’- జె.బాపురెడ్డి
‘ఈగ వాలిన గాని వేగ జారెడియట్లు/మువ్వంపు కురులను దువ్వినాడు’ అంటూ చిలకమర్తి వారి కవిత, ప్రకాశంగారి ఫోటోను ‘సీసం ఫ్రేము’లో కవిత్వీకరించింది.
‘‘పట్టింపు వచ్చెనా బ్రహ్మంత వానిని గద్దించి నిలబెట్టు పెద్దమనిషి’ అని ప్రకాశం గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు కరుణశ్రీ.
‘‘స్వకుటుంబానికి ఏమి దక్కినది? లక్షల్ వచ్చు ప్రాక్టీసు మానుకొనెన్...దేశము కోసమాయన యొసంగెన్ శక్తి సంపత్తియున్’’ అని ప్రకాశంగారి త్యాగమయ జీవితానికి అద్దం పట్టారు పురాణం కుమార రాఘవశాస్ర్తీ.
‘‘ఆవులించిన చాలు ఆంధ్ర కేసరి, వైరి/ఉక్కు గండియలైన వ్రక్కలగును’‘ అని ఆంధ్రకేసరి ధైర్య సాహసాలకి ఏతం ఎత్తారు కె.సభా.
‘‘గాంభీర్యంలో సముద్రం, ఔన్నత్యంలో మేరువు, దీక్షలో విశ్వామిత్రుడు, శత్రు విజయంలో భార్గవరాముడు అంటూ సాంప్రదాయక ప్రతీకలలో ప్రకాశంగారి మూర్తిమత్వాన్ని సంస్కృతంలో చిత్రీకరించారు కప్పగంతుల లక్ష్మణశాస్ర్తీ .
ఆర్జించిన సొమ్మంతా దేశంకోసం వెచ్చించి, ‘ఎండుడొక్క’తో మిగిలిన ప్రకాశంగారి స్వార్ధ రాహిత్యాన్ని గాడేపల్లి సీతారామమూర్తి ‘రైతులకెనె్నన్నో రాయితీలిప్పించి’ రామరాజ్యం లాంటి గ్రామ స్వరాజ్య నిర్మాణం చేశారని, వారి పాలనా కీర్తి శిఖరాలను వేదగిరి వేంకట రామశర్మ, ‘ఒక అణా జరిమాన నుపసంహరింపగా/కోరాడెనెవరు హైకోర్టు దాక’ అని వారి పట్టుదలను, కరణం బాల సుబ్రహ్మణ్యం గణబద్ధం చేశారు.
‘ప్రకాశంగారి దేశభక్తికీ, త్యాగనిరతికీ, సమర్ధతకీ వారికి జాతీయస్థాయి నాయకులుగా కీర్తి లభించి ఉండాల్సింది’ అన్నది నిర్వివాదాంశం. దానికి ఇప్పుడు చింతించి ప్రయోజనం లేదు. రాజకీయాలు! రాజకీయాల్తో వచ్చిన చిక్కేమిటంటే దానినిండా ‘పాలిటిక్సే!’
ప్రకాశంగారి తల్లి ఛాయాచిత్రం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. ప్రకాశంగారి అభ్యుదయానికి కారకులైన ఇద్దరిలో ఆవిడ ఒకరు. రెండవవారు ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు. ఆ ఫోటో అంతర్జాలంలో ఉంచ తగినది. పుస్తకంలో అచ్చుతప్పులు ‘టాలరెన్స్ లిమిట్’ దాటి ఉన్నాయి. ఏనాడో కీర్తిశేషులైన మహా మహుల పద్యాల సేకరణ, సంకల్పించడం వాటిని సంకలించడం మాటలు కాదు. శ్రమకోర్చి ఈ పుస్తకం వెలువరించిన సంస్థలూ, వాటి సారధి ప్రమీలాదేవి అభినందనలకి అర్హులు.
ప్రజల మనిషి ప్రకాశానికి పద్యకవితా కల్హారమాల
సంపాదకులు: డా.మంగళంపల్లి ప్రమీలాదేవి
వెల: రూ.90/-
దొరుకుచోటు: పద సాహిత్య పరిషత్, న్యూమీర్జాలగూడ, మల్కాజిగిరి, హైదరాబాద్-47
ఫోన్ 27056388