అరుదుగా కొన్ని జీవితాలు, వ్యక్తిత్వాలు ఎంతో స్ఫూర్తిని పండిస్తాయి. అయితే, వాటి గొప్పదనం మబ్బుల్లాంటిదేమో అనిపిస్తుంది. మబ్బులోని నీరు పైకి కనబడనట్లుగానే ఆ జీవితాలు చాలామందికి అసలే తెలియవు. మరికొందరికి అవి మబ్బుల్లానే దూరంగా కనిపించి ఎటో వెళ్లిపోతాయి. కొన్నిచోట్ల పంటలు పండినా అవి ఆ మనోక్షేత్రాలకే పరిమితం. అలాంటి గొప్ప వ్యక్తిత్వాలను అక్షరబద్ధంచేసి, అనంతంగా, ఎందరికైనా స్ఫూర్తిని పండించే ఏ ప్రయత్నమైనా ఎంతో అభినందనీయం. అలాంటి ఒక చక్కని కృషి ఫలితమే ఎం.వి.ఆర్.శాస్ర్తీ షష్టిపూర్తి సంచిక ‘వాక్య విహారం’.
ఒక రచయిత చెప్పినట్లుగా దీనిలో షష్టిపూర్తి అన్నది ఒక సాకు మాత్రమే. వాస్తవంగా ఈ సంచిక ఒక వర్తమాన అవశ్యం. ఈ సంచికకు రాసిన వారిలో సత్యాన్ని ఉపాసించే ఆధ్యాత్మిక వేత్తలు, అతిశయోక్తులకు బద్ధవ్యతిరేకులైన ప్రముఖ సంపాదకులు, విమర్శనాగ్రేసరులు, మహారచయితలు, శాస్ర్తీగారి భావాలతో ఏకీభవించలేని కొందరు కూడా ఉన్నారు తప్ప, సన్మాన పత్ర రచయితలుగా అనుమానించవలసిన వారు మచ్చుకైనా కనిపించరు. ఏరి, కోరి అలాంటివారి అక్షరాలలో పుఠంపెట్టినా, నికార్సుగా మెరిసిన బంగారంగా ఎం.వి.ఆర్.శాస్ర్తీ వ్యక్తిత్వం నవతరం పాఠకులకు ఈ సంచిక ద్వారా తేటతెల్లమవుతుంది. మన ఆంధ్రభూమి సంపాదకులైన శ్రీ శాస్ర్తీగారి అరవై వసంతాల పుట్టిన రోజు నాకు, దేశభక్తులకు, సత్యాన్ని ప్రేమించే వారందరికీ పండుగ రోజు అని సద్గురు డాక్టర్ శివానందమూర్తిగారి నుంచి కితాబు పొందడం ఎందరికి సాధ్యమవుతుంది? కేవలం ప్రశంసలైతే విసుగు కలిగిస్తాయి. అలా ప్రశంసించడానికి కారణమైన అంశాలేమిటి? వాటి నిలకడ ఎంత? ఆ ప్రశంసిస్తున్నదెవరు- అనే సంగతులే వాస్తవంగా ప్రతి గ్రంథాలయానికీ తప్పనిసరి అయిన పుస్తకంగా ఈ సంచికను నిలబెడుతున్నాయి.
పంటలు పండించే వానను సైతం చీదరించుకోవడం మన నాగరికులమందరం చేసే పనే. శాస్ర్తీగారి గురించి ఉగ్రనరసింహుడట కదా అని, ఆయనకు చాలా కోపం అట కదా, ఆయనవి ఛాందస భావాలట కదా అని దూరాన ఉన్నవారు అడుగుతూ ఉంటారన్నది ఆయన సహ సిబ్బందికి బాగా అనుభవం. పరమ కర్కోటకులట, ఎంత పనిచేసినా చాలదట, ఎలా రాసినా నచ్చదట- అంటూ ఆయనకన్నా ముందు ఆయన గురించిన చిలవలు పలవలు తమవద్దకు చేరిన సంగతిని సహచరులు ఇవాళ గళం విప్పి రాస్తూ ఉంటే, చాలా ముచ్చట వేస్తుంది. పుస్తకాలైనా, సంపాదకీయాలైనా ఆత్మసాక్షికి మాత్రమే విధేయుడై రాసే అవకాశం కలగడం ఆయన అదృష్టం, దైవానుగ్రహం, ఆయన గురుభావంతో గౌరవించే మహనీయుడు శ్రీ కందుకూరి శివానందమూర్తిగారి ఆశీర్వచన బలం అని సంపాదకులలో శాస్ర్తీగారి సీనియర్ తరానికి చెందిన పొత్తూరి వెంకటేశ్వరరావు అంటారు. అది నిజమే. కానీ, అంతకుమించిన రహస్యం ఎం.వి.ఆర్.శాస్ర్తీ వ్యక్తిత్వం అనే సంగతిని పత్రికకు వెలుపలి రచయితలైన మల్లాది వెంకట కృష్ణమూర్తి, ఆచార్య జయధీర్ తిరుమలరావు మొదలైనవారు... శాస్ర్తీగారి పర్యవేక్షణలో పనిచేసి, రాటుదేలినవారు బలంగా, సోదాహరణంగా చెప్పడంతో ఈ సంచిక విలువ అపూర్వంగా పెరిగింది. జర్నలిస్టులు శాస్ర్తీగారి నుంచి నేర్చుకోవలసింది ఉంది అన్న టంకశాల అశోక్ మాటలు అక్షర సత్యాలు. ఈ సంచికను ప్రతి జర్నలిజం కళాశాల విధిగా తన విద్యార్థులలో ప్రతి ఒక్కరిచేతా చదివించాల్సిన అవసరముంది.
ఎం.వి.ఆర్.శాస్ర్తీ ఎక్కిన నిచ్చెన మీద కీలకమైన రెండో మెట్టు ఈనాడు దినపత్రిక. అక్కడ ఆయన ప్రతిభ ఈ సంచికలో ఎక్కడో మిణుగురు పురుగులా మాత్రమే దర్శనమిస్తుంది. కారణం స్పష్టమే. ఈనాడులో కొన్ని వందల సంపాదకీయాలను, చీఫ్ ఎడిటర్ రామోజీరావు సంతకంతో కీలక ఘట్టాల్లో ఎన్నో తొలి పుట సంపాదకీయాలను రాసిన కలం ఎం.వి.ఆర్.శాస్ర్తీ. అయితే, పత్రికా సంపాదకీయాలను ఆ సంపాదకీయ రచయిత తనవిగా క్లెయిమ్ చేయడం భావ్యంకాదు గనుక, ఈ సంచికలో వాటిని పరిగణనలోకి తీసుకోరాదన్న ప్రచురణకర్తల విజ్ఞత దీనికి కారణం. ఆనాడు శాస్ర్తీగారి ప్రతిభ పత్రిక యాజమాన్యంతోపాటు తోటి సిబ్బందికి మాత్రమే తెలుసు. పరిశోధకునిగా, చరిత్ర రచయితగా, జర్నలిస్టులు కాగోరిన వారికీ, నవతరం జర్నలిస్టులకూ పాఠంగా నిలిచే సంపాదకవర్గ సారధిగా ఆయన ప్రతిభాపాటవాలు ప్రపంచానికి వ్యక్తంకావడానికి ఆయన ఇప్పుడున్న మెట్టే చక్కని పునాదిగా నిలిచింది. అందుకే ఈ సంచిక ఎం.వి.ఆర్.శాస్ర్తీతో పాటు, ఆయన పనిచేస్తున్న దక్కన్ క్రానికల్ గ్రూప్ చైర్మన్ టి.వెంకట్రామ్‌రెడ్డి ఔన్నత్యాన్ని కూడా ఒక్క పుటతోనే చిరస్థాయిగా వెల్లడిస్తోంది.
శాస్ర్తీగారి గురించిన వ్యాసాలే కాక, వాక్య విహారమ్ అనే శీర్షికకు అర్థం కల్పించేలా శాస్ర్తీగారి కాలమ్‌లు, విమర్శలు, ఆయన పుస్తకాల మీద వచ్చిన సమీక్షలు మొదలైన వాటిని కూడా ఈ సంచికలో కొన్నింటిని అందించారు. అవన్నీ శాస్ర్తీగారి శైలిలోని హాస్యచతురతను, వాడినీ, వేడినీ, నిర్మొగమాటాన్ని వెల్లడించేవే.
ఇంత విలువైన సంచికను తెచ్చిన ఖ్యాతి ఆయన కుమార్తెలు మాధవి, పల్లవి, తన్మయిలది. తాము ఆర్టికిల్ రాయడం ఇప్పుడే మొదటిసారని వారు తెలిపారు. అయితే, ..‘‘మొదలు ఒప్పుకోలేదు, తర్వాత మేము మళ్ళీ అడిగాక మొత్తానికి సరే అన్నారు’’.. అనే లాంటి అమాయకమైన, చక్కని వాక్యాలతో సహజశైలిలో రాసిన ఆ నవకలాలు రాయడం కొనసాగిస్తే, తమ తమ రంగాలలో రాణించడంతోపాటు మంచి రచనలను అందించగలరన్నది తథ్యం.
..................................
వాక్య విహారం
ఎం.వి.ఆర్.శాస్ర్తీ
షష్టిపూర్తి సంచిక
లభించే చోటు : దుర్గా పబ్లికేషన్స్, 1-1-230/9, వివేక్‌నగర్, చిక్కడపల్లి,
హైదరాబాద్- 500 020.
ఫోన్: 94412 57961/62, 040-27632824
www.supatha.in
వెల: రూ.200/-
ఆంధ్రభూమి పాఠకులకు
తగ్గింపు ధర: రు.150/-
అరుదుగా కొన్ని జీవితాలు, వ్యక్తిత్వాలు ఎంతో స్ఫూర్తిని పండిస్తాయి.
english title:
spoorthy
Date:
Sunday, December 16, 2012