విజయనగరం (కలెక్టరేట్), జనవరి 30: ప్రభుత్వం నిర్వహించనున్న
డిఎస్సీలో బి.ఇడి అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, ఎస్జీటీ
పోస్టులకు బి.ఇడి అభ్యర్థులకు అవకాశం కల్పిచాలని డిమాండ్ చేస్తు
బి.ఇడి అభ్యర్థులు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి తమ
నిరసన తెలిపారు. ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న అనంతరం
అభ్యర్థులు కలెక్టరేట్ జంక్షన్‌వద్ద మానవహారం నిర్వహించి రాస్తారోకో
నిర్వహించారు. దీంతో పోలీసులు కలుగ చేసుకుని వారిని
వారించడంతో అభ్యర్థులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన
ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సి.ఎం డౌన్‌డౌన్
అంటు నినాదాలు చేశారు. ఉపాధ్యాపోస్టులకు టెట్, డిఎస్సీ అంటూ
పలు రకాలైన అర్హత పరీక్షలు నిర్వహించడంతో ఎంతో మంది
అభ్యర్థులకు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, ఏ ఉద్యోగాలకు లేని
ఇన్ని పరీక్షలు ఒక ఉపాధ్యాయ పోస్టులకు ఎందుకంటు నిలదీశారు.
ఈ సమయంలో డి.ఇ.ఒ సుబ్బారావు వారి వద్దకు రాగా అభ్యర్థులు
సమస్యను డి.ఇ.ఒకు వివరిస్తు కలెక్టర్ బయటకు రావాలని
పట్టుబట్టారు. దీనితో డిఇఓ అక్కడ నుంచి నిష్క్రమించారు. మరికొద్ది
సేపటికీ ఎ.జె.సి రామారావు ఆందోళన చేస్తున్న అభ్యర్థుల వద్దకు
రాగా సమస్యను మరలా విన్నవించినఅభ్యర్థులు తక్షణమే సమాదానం
చెప్పాలని పట్టుబట్టారు. దీనికి స్పందించిన ఎ.జె.సి రామారావు తమ
డిమాండ్‌లను తక్షణమే ఫ్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి వివరిస్తానని చెప్పి
వెల్లిపోయారు. అయినప్పటికీ అభ్యర్థులు మధ్యాహ్నంవరకు కలెక్టరేట్
వద్ద తమ ఆందోళనను కొనసాగించారు. దీనితో పట్టణ ఎస్.ఐ
ఉమాకాంత్ ఆద్వర్యంలో పోలీసులు వారిని వారించి అక్కడ నుంచి
పంపివేశారు. ఈ దశలో అభ్యర్థులు తమ సమస్య పరిష్కారం కాని
పక్షంలో మరింత ఉద్యమించేందుకు సిద్దంగా ఉన్నామంటు
హెచ్చరించారు. కార్యక్రమంలో బి.ఎడ్ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు
తదితరులు పాల్గొన్నారు.