విజయనగరం, జనవరి 30: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆటోలు,
మాక్సీక్యాబ్‌లు, ఆర్టీసీతో పోటీ పడుతున్న ప్రైవేటు ఆపరేటర్ల ధాటికి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కుదేలవుతోంది. నానాటికీ తగ్గుతున్న
ఆక్యుపెన్సీ రేష్యో (ఒ.ఆర్)ను పెంచుకుని నష్టాలను
నియంత్రించుకునేందుకు ఆర్టీసీ అష్టకష్టాలు పడుతోంది.
ప్రయాణీకులను ఆకట్టుకుని ఓ.ఆర్ పెంచుకునేందుకు ఆర్టీసీ చేయని
ప్రయత్నం లేదు. ప్రవేశపెట్టని పథకం లేదు. ఇప్పటికే నిత్యం తిరిగే
ప్రయాణీకుల కోసం టికెట్‌పై 10 శాతం రాయితీ ఇచ్చే క్యాట్‌కార్డు
పథకాన్ని ప్రవేశపెట్టిన ఆర్టీసీ స్పందన బాగుండటంతో వనిత కార్డులను
సైతం అమల్లోకి తెచ్చింది. తెల్లరంగు రేషన్ కార్డు కలిగిన బి.పి.ఎల్
కుటుంబాలకు సంవత్సరానికి 100 రూపాయలు తీసుకుని
వనితకార్డులను ఆర్టీసీ జారీ చేసింది. దీనిపై ప్రచారం ఉన్నప్పటికీ
రేషన్‌కార్డు దారుల్లో అవగాహన లేనందున వీటి విక్రయాలు ఆశించిన
స్థాయిలో లేవు. దీంతో తెల్లరంగ రేషన్ కార్డు దారులకు వనిత కార్డులు
కట్టబెట్టేందుకు ఆర్టీసీ బృహత్తర పథకాన్ని రూపొందించింది. రేషన్
దుకాణాల డీలర్ల ద్వారా వనిత కార్డుల విక్రయాలకు శ్రీకారం చుట్టింది.
మరి డీలర్లు తమ పనిమానుకుని ఊరకనే ఆర్టీసీ పనులు చేయరని
భావించిందేమో. వనితకార్డుల విక్రయించిన డీలర్లకు కార్డుకు 10
రూపాయల ఇనె్సంటివ్ ప్రకటించిది. ఒక డీలరు 500 వనిత
కార్డులను విక్రయిస్తే వారికి 10 రూపాయల వంతున మొత్తం 5000
రూపాయలతో పాటు అదనంగా మరో 2000 రూపాయల అదనపు
ఇనె్సంటివ్‌ను కూడా ఇవ్వాలని నిర్ణయించిది. ఈమేరకు ఆర్టీసీ
విజయనగరం రీజియన్ డిప్యూటీ ఛీఫ్ ట్రాఫిక్ మేనేజర్ పి.జీవన్ ప్రసాద్
సోమవారం ఇక్కడ రేషన్ డీలర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వనిత ఫ్యామిలీ కార్డులను
విక్రయించే డీలర్లకు సైతం ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు తెలిపారు.
డీలర్లకు వనిత ఫ్యామిలీ కార్డులకు సంబంధించి దరఖాస్తులను,
కరపత్రాలను అందజేశారు. వనిత ఫ్యామిలీ కార్డుదారు ఆర్టీసీ బస్సులో
ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ మరణిస్తే లక్ష రూపాయల ప్రమాద
బీమా సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న
జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షడు బుగత వెంకటేశ్వర రావు మాట్లాడుతూ
ఆర్టీసీ అధికారుల సూచన మేరకు తాము వనిత ఫ్యామిలీ కార్డులను
విక్రయిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పలువురు డీలర్లు
పాల్గొన్నారు