విజయనగరం, జనవరి 30: ఆంధ్రా ఒడిషా సరిహద్దులో
మావోయిస్టుల అలజడి ఉన్నప్పటికీ జిల్లా సరిహద్దులో తమ
యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని విశాఖ రేంజ్ డి.ఐ.జి
సౌమ్యామిశ్ర అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలోని
దండుమారెమ్మను సోమవారం దర్శించుకునేందుకు వచ్చిన ఆమె కొద్ది
సేపు విలేఖరులతో మాట్లాడారు. ఇటీవల కాలంలో ఒడిషా రాష్ట్రంలో
చెదురుమదులు సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి
పోలీసులతో కలసి సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు
పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా
అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. జిల్లా సరిహద్దులో
ఇప్పటి వరకూ ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు యువత నుంచి అనూహ్య స్పందన
వచ్చిందన్నారు. ప్రకటించిన పోస్టులకు సుమారు 18వేలకు పైగా
దరఖాస్తులు తమకు అందాయని తెలిపారు. ఇప్పటికే ఎంపిక
ప్రక్రియకు సంబంధించి పరుగు పరీక్ష పూర్తయిందని ఆమె తెలిపారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకతతో
నిర్వహిస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. ప్రతిభ కలిగిన అభ్యర్ధులకు
మాత్రమే అవకాశం ఉంటుందన్నారు.
వెండి కిరీటం బహుకరణ
స్థానిక పోలీసుక్వార్టర్స్ లో ఉన్న దండుమారమ్మ అమ్మవారికి
సౌమ్యామిశ్ర సోమవారం వెండి కిరీటం, వెండి పళ్లెంలను
సమర్పించుకున్నారు. సోమవారం పట్టణానికి వచ్చిన ఆమె ఆలయం
వద్ద నిర్మించిన ముఖద్వారాన్ని ప్రారంభించారు. అనంతర ఆలయంలో
ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి వెండి వస్తువులను
సమర్పించారు. 10ఏళ్లుగా ఆలయం వద్ద ముఖద్వారం
నిర్మిచాలన్న కల నేటితో సాకారమయిందని తెలిపారు. కార్యక్రమంలో
ఎస్పీ కార్తికేయ, ఎఎస్పీ మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.