ఏలూరు, జనవరి 30 : సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలతో కలెక్టరేట్, పరిసర ప్రాంతాలు దద్ధరిల్లాయి. ఉదయం నుంచి తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనకారులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దీనితో కలెక్టరేట్ ప్రాంతమంతా ఆందోళనకారులతో కిక్కిరిసిపోయింది. కొన్ని సందర్భాల్లో ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని బారికేడ్ల సహాయంతో వెనక్కి పంపి వేశారు. మరోవైపు ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
సమస్యలు పరిష్కరించాల్సిందే : అంగన్‌వాడీలు
కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలును తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వందలాది మందిగా అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నానుద్దేశించి సి ఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల బాబూరావు మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్ల పరిధిలో పోటీ సెంటర్లు ఏర్పాటు చేసి అంగన్‌వాడీల్లో విభజన తెచ్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో కష్టించి పనిచేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి పి భారతి, నాయకురాళ్లు పి లక్ష్మీశ్రీ, పి ఎల్ ఎస్ కుమారి, కె ఝాన్సీలక్ష్మి, బి కరుణకుమారి, సి ఐటియు నాయకులు డి ఎన్‌విడి ప్రసాద్, ఎస్ భగత్, డివి వర్మ, పళ్లెం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
క్వింటాలుకు రూ. 15 వేలు ఇవ్వాలి : పసుపు రైతులు
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం పసుపు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ, డెల్టా ప్రాంతాల్లోని సుమారు 15 నుంచి 20 మండలాల్లో వేలాది ఎకరాల్లో పేద, సన్న కారు రైతులు, కౌలు రైతులు పసుపు పంటను పండిస్తున్నారన్నారు. అయితే పంటకు మద్దతు ధర లేకపోవడం వలన తీవ్రంగా నష్టపోతున్నారని, పసుపు క్వింటాలుకు 15 వేల రూపాయలు ధర ఇవ్వాలని, ప్రభుత్వమే మార్కెట్‌యార్డులు, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, మార్కెట్‌యార్డుల్లో పసుపు నిల్వకు అవకాశం కల్పించాలని, పసుపు అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని, జిల్లా పరిశోధనా కేంద్రంలో పసుపు పంటను చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కట్టా భాస్కరరావు, తూంపాటి సత్యనారాయణ, చిలుకూరి శ్రీనివాస్, చింతపల్లి రామారావు, ములకల వీరబోగ వసంతరాయుడు, కె సుబ్బరాజు, పెన్మత్స రామరాజు పాల్గొన్నారు.
ఎస్‌జిటికి అవకాశం కల్పించాలి : బి ఇడి విద్యార్ధులు
డి ఎస్‌సిలో బి ఇడి అభ్యర్ధులకు ఎస్‌జిటికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ డివై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద బి ఇడి అభ్యర్ధులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు ఏడు లక్షల మంది బి ఇడి అభ్యర్ధులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అయితే ప్రభుత్వం బి ఇడి అభ్యర్ధులకు ఎస్‌జిటి అవకాశం లేదని పేర్కొనడం వలన సుమారు ఏడు లక్షల మంది బి ఇడి అభ్యర్ధులు నష్టపోతారని పేర్కొన్నారు. అలాగే టెట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బి ఇడి అభ్యర్ధులు కలపల సోమరాజు, దొండపాటి రవికుమార్, మంగం తాతారావు తదితరులు పాల్గొన్నారు.
104 ఉద్యోగుల వినూత్న నిరసన
గత కొద్దిరోజులుగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న 104 కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసనకు దిగారు. స్థానిక పాతబస్టాండ్ నుంచి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తూ కలెక్టరేట్‌కు చేరుకున్న వారంతా ధర్నా నిర్వహించారు. నవంబర్ 9వ తేదీ నుంచి సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడం దారుణమని యూనియన్ నాయకులు కొసరాజు సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 3 ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి జీతాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డి ఎన్‌విడి ప్రసాద్, పి భారతి, కె విజయలక్ష్మి, పి కిషోర్, ఎ సునీల్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
* అంగన్‌వాడీల ధర్నా* అర్ధనగ్నంగా 104 ఉద్యోగుల ఆందోళన* సమస్యలు పరిష్కరించాలన్న పసుపు రైతులు* పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు
english title:
collectorate
Date:
Tuesday, January 31, 2012