ఆకివీడు, జనవరి 30: సృష్టిలో పరమాత్ముడు లేనిదే ఏదీ లేదని మైసూరు దత్తపీఠాధిపతి, అవధూత, నాదబ్రహ్మ, యోగబ్రహ్మ శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామీజీ పేర్కొన్నారు. స్థానిక దత్తక్షేత్రంలో నిర్మించిన పంచముఖ ఆంజనేయస్వామికి ఆదివారం స్వామీజీ 158లీటర్ల ఆవుపాలతో క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామీజీ అనుగ్రహభాషణ చేశారు. రథ సప్తమి పర్వదినాన సూర్యుడి కిరణాలు శుభసూచకాలుగా మారుతున్నాయన్నారు. రానున్నకాలమంతా కొద్దిపాటి అనిశ్చితవాతావరణం ఏర్పడినప్పటికీ ప్రజలంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో తులతూగుతారని అన్నారు. పరమాత్ముడి కృపలేనిదే ఏదీ జరగదన్నారు. నడుస్తున్న కాలం సాఫ్ట్‌వేర్ రంగాలతో ముడిపడి ఉన్నప్పటికీ ఆదిమూలం భగవంతుడేనన్నారు. విమానప్రయాణం దగ్గరినుండి ప్రతీదీ సైన్స్‌తో నడుస్తోందని మనం భావించినప్పటికీ భగవదనుగ్రహం లేనిదే ఏదీ జరగదన్నారు. ప్రమాదం నుండి బయటపడటం నుండి ప్రతీదీ భగవత్ కృపేనన్నారు. భూకంపం వంటి ప్రళయాలు వచ్చే ముందు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు కారణంగా వాటి లక్షణాలు గుర్తిస్తున్నారని, అయితే స్వామే ప్రపంచాన్ని రక్షిస్తున్నాడని స్వామీజీ ఉద్ఘాటించారు. రామాయణంలో హనుమంతుని లీలలు ముఖ్యమైనవన్నారు. మైరావణుడు, శతకంఠుడు వంటి వారిని సంహరించే కీలకమైన పాత్ర హనుమంతుడిదన్నారు. అటువంటి ఆంజనేయనామస్మరణ చేయడం శుభసూచకమన్నారు.
బాపూతీస్తే మంచిది
శ్రీరాముడు, సీతాదేవి గురించి ఎంతో అందంగా వివరిస్తూ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు బాపూను సచ్చిదానందస్వామీజీ ప్రత్యేకంగా అభినందించారు. మారుతున్న ప్రపంచీకరణ సమయంలో ఇటువంటి ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి చిత్రాల ద్వారా ప్రతీఒక్కరిలోనూ దైవభక్తి పెరిగి ఆధ్యాత్మిక చింతనవైపు పయనిస్తారని తెలిపారు. అదే విధంగా రామాయణం వంటి ఇతిహాసాల్లోని శతకంఠుడు వంటి పాత్రలను తెరకెక్కించే సత్తా బాపూకే దక్కిందన్నారు. సినీ నిర్మాతలు కూడా ఈ తరహా వ్యక్తుల వివరాలు, హనుమంతుడు చేసిన సాహసాలను వివరిస్తూ చిత్రాలు నిర్మిస్తే శుభపరిణామమన్నారు.
ఘనంగా రథ సప్తమి వేడుకలు
స్థానిక దత్తక్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిపారు. ఉదయానే్న దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామీజీ సూర్యనమస్కారాలు చేసి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. సూర్యనమస్కారం ఆర్ఘ్య ప్రదానం, ఆవుపాలతో పొంగలి చేసి సూర్యునికి నివేదించారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యునికి నమస్కారాలు ఆచరించడం ద్వారా మానవుడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, లోకం సుభిక్షంగా ఉంటుందని స్వామీజీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం శ్రీ చక్రపూజ తదితర విశేష పూజలు నిర్వహించారు.
మైసూరు దత్తపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామీజీ
english title:
paramatmudu lenide
Date:
Tuesday, January 31, 2012