ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: బాబ్రీ మసీదు విధ్వంసంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాక్ అంతరంగిక భద్రతా మంత్రి రెహ్మాన్ మాలిక్ భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం తెలియచేయక పోవడంపై బిజెపి మండిపడింది. రాజ్యసభ జీరో అవర్‌లో బిజెపి ఉపనాయకుడు రవిశంకర్ ప్రసాద్ ఈ అంశాన్ని లేవనెత్తారు. రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించేందుకు వచ్చిన మాలిక్ తన పరిధిని అతిక్రమించి వ్యవహరించారని విమర్శించారు. రెండు దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మాలిక్ పర్యటనతో మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేతపై పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు క్షంతవ్యం కాదని ఆయన చెప్పారు. మాలిక్ వ్యాఖ్యలపై కేంద్ర ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడి చేసి తీవ్ర విధ్వంసం సృష్టించి మూడేళ్లయినా ఇంతవరకూ పాక్ ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. హోమ్ మంత్రి షిండే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
12 రోజులు ఎన్‌ఐఎ
కస్టడీకి రాజేంద్ర చౌదరి
పంచకుల, డిసెంబర్ 17: పాకిస్తాన్ వెళ్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబులు అమర్చి 68 మంది ప్రాణాలను బలిగొన్న రాజేంద్ర చౌదరి అలియాస్ పెహల్వాన్‌ను స్థానిక కోర్టు సోమవారం 12 రోజుల కస్టడీ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు అప్పగించింది. హైదరాబాద్‌లోని మక్కా మసీద్‌లో జరిగిన పేలుళ్లలోనూ కీలకపాత్ర పోషించినట్టు అనుమానిస్తున్న రాజేంద్ర సింగ్‌ను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ సమీపంలో ఎన్‌ఐఎ బృందం ఈ నెల 15వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ట్రాన్సిట్ రిమాండ్‌పై రాజేంద్ర చౌదరిని అక్కడి నుంచి తీసుకువచ్చిన ఎన్‌ఐఎ బృందం సోమవారం నాడు చండీగఢ్ సమీపంలోని పంచకుల కోర్టులో హాజరుపరిచింది. సముందర్‌గా కూడా పరిచితుడైన రాజేందర్ చౌదరి ఈ నెల 28వ తేదీ వరకూ ఎన్‌ఐఎ కస్టడీలో ఉంటాడని అధికార వర్గాలు తెలిపాయి.
మరో అనుమానితుడి అరెస్టు
ఇదిలావుంటే, సంఝౌతా ఎక్స్‌ప్రేస్ పేలుడు కేసులో ధన్ సింగ్ అనే మరో ప్రధాన అనుమానితుడిని ఎన్‌ఐఎ అధికారులు సోమవారం మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో రాజేంద్ర చౌదరి అరెస్టు తర్వాత మధ్యప్రదేశ్‌లో కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఇది రెండో అరెస్టు. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ధన్ సింగ్‌ను అరెస్టు చేశారని, 2008లో మాలెగావ్‌లో జరిగిన పేలుళ్లలోనూ ధన్ సింగ్ ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
మమ్మల్ని పాక్
సరసన చేర్చొద్దు
మా వ్యాపారం మమ్మల్ని చేయనివ్వండి: బంగ్లా
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: భద్రత విషయంలో భారత్ తమ దేశాన్ని పాకిస్తాన్ సరసన చేరుస్తోందంటూ బంగ్లాదేశ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన ఎన్నో సంస్థలు ఢాకాలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నాయని, అయితే తమ వ్యాపారులు మాత్రం భారత్‌లో శాఖలను ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని బంగ్లాదేశ్ వాపోయింది. ప్రత్యేకించి బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో ఈ సమస్య మరీ అధికంగా ఉందని, దీనిని భారత అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని బంగ్లాదేశ్ పేర్కొంది. ‘్భరత్‌కు చెందిన వందకు పైగా బ్రాండ్లు (వాణిజ్య సంస్థలు) ఢాకాలో చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాయి. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ఒక్క బ్రాండ్ కూడా భారత్‌లో కనిపించడం లేదేమిటని స్వయంగా మా కుటుంబ సభ్యులే నన్ను ప్రశ్నిస్తున్నారు. బంగ్లాదేశ్ వ్యాపారులు కొందరు భారత్‌లో తమ శాఖలను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అవి తిరస్కరణకు గురయ్యాయి. భద్రత విషయంలో బంగ్లాదేశ్‌ను, పాకిస్తాన్‌ను భారత్ ఒకే గాటన కట్టి చూడటమే ఇందుకు కారణం’ అని భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ తారిక్ అహ్మద్ కరీం దక్షిణాసియా ఆర్థికాభివృద్ధిపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో అన్నారు.
సైనికుల నియామకాలలో
నిబంధనలు సడలించాలి
రాజ్యసభలో బిజెపి సూచన
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: రాష్ట్రాల జనాభా ప్రాతిపదికపై సైనిక దళాలలో నియామకాలను చేయాలన్న నిబంధనను సడలించి వీలైనంత ఎక్కువ మందిని రిక్రూట్ చేయాలని రక్షణ మంత్రి ఆంటోనీకి బిజెపి సభ్యుడు శాంతకుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ నిబంధనను సడలించని పక్షంలో రక్షణ దళాలలో సిబ్బంది కొరత పెరిగిపోతుందని ఆయన అన్నారు. తద్వారా దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాజ్యసభలో ప్రతిపాదించిన ఒక తీర్మానంలో హెచ్చరించారు. త్రివిధ దళాలలో పెరిగిపోతున్న సిబ్బంది కొరత దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. సిబ్బంది, ఆయుధాల కొరతపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వికే సింగ్ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా రక్షణ మంత్రి ఈ నిబంధనలు సడలించాలని కోరారు
ఢిల్లీలో అమర జవాన్ల స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలి
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల సంస్మరణార్ధం రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఓ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని బిజెపి సభ్యుడు తరుణ్ విజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఇండియాగేటు సమీపంలో ఈ జాతీయ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలన్న ఆంటోనీ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రకటించటం సిగ్గుచేటని ఆయన రాజ్యసభలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. బ్రిటిష్ పాలకుల ప్రభావం నుంచి బయటపడలేని వారు మాత్రమే ఈ విధమైన బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తారని ఎద్దేవా చేశారు.
చైనాపై
కనే్నసి ఉంచాం
లోక్‌సభలో ఆంటోనీ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ స్పష్టం చేశారు. దేశ భద్రత, ఆర్థిక అంశాల విషయంలో చైనా కార్యక్రమాలను గమనిస్తునే ఉన్నామని సోమవారం ఇక్కడ వెల్లడించారు. చైనాకు సంబంధించి ప్రధానంగా భద్రత విషయంలో పొరుగుదేశం చైనా తీరుతెన్నులను దగ్గర నుంచి గమనిస్తున్నామని ఆయన అన్నారు. జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పేర్కొన్నారు. అకసయ్ ప్రాంతంలో చైనా జరుపుతున్న ఖగోళ ప్రయోగాలపై సభలో అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ దేశ ప్రయోజనాల విషయంలో కఠిన వైఖరినే అవలంబిస్తున్నట్టు చెప్పారు. జపాన్, దక్షిణ కొరియా సహాయంతో చైనా ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ప్రయోగాలు జరుగుతున్న షిఖ్వనే ప్రాంతం చైనా భూగాగంలోకే వస్తుందని ఆంటోనీ స్పష్టం చేశారు. కాగా జమ్మూకాశ్మీర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ)ను రద్దుచేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి కూడా చట్టం ఉపసంహణ లేదా రద్దు చేయడం జరగలేదని రక్షణ మంత్రి ప్రకటించారు. కాశ్మీర్ సమస్యపై ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీలోని ఓ వర్గం ఎఎఫ్‌ఎస్‌ఎను సవరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
కోటా బిల్లుపై పోరాడి గెలిచాం: మాయావతి
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్‌సి, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును సోమవారం రాజ్యసభ ఆమోదించడం తన ఘనతేనని బిఎస్‌పి అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఈ బిల్లు కోసం తాను గట్టిగా పట్టుబట్టడం వల్లే రాజ్యసభ ఆమోదం సాధ్యమైందని విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఎస్‌సి, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం తాము పోరాడి ఉండక పోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదన్నారు. ఈ విజయం బిఎస్‌పికి ఎంత ఆనందాన్ని కలిగించిందో అంతే ఆనందం తమకు మద్దతు ఇచ్చిన వారికీ కలిగి ఉంటుందని అన్నారు.
రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ కోటా బిల్లును లోక్‌సభ కూడా ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొన్న మాయావతి ‘లోక్‌సభలో కూడా మాకు విజయం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఇందుకోసం సహకరించాల్సిందిగా యుపిఏ మిత్ర పక్షాలను, బిజెపి తదితర పార్టీలనూ అభ్యర్థిస్తున్నాం’అని అన్నారు. గత వారం రాజ్యసభ చైర్మన్ అన్సారీతో మాయావతి తీవ్ర స్థాయి వాగ్వాదానికి దిగడం వల్లే కోటా బిల్లును ప్రవేశ పెట్టడం దానిపై రెండు రోజుల పాటు చర్చ జరగడం సాధ్యమైంది. ఈ బిల్లును వ్యతిరేకించిన సమాజ్‌వాది పార్టీపైనా మాయావతి విరుచుకు పడ్డారు.