హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రం నుంచి పార్టీ అధ్యక్షులే హాజరుకావాలని టిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. తమ పార్టీ తరఫున తనతోపాటు తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) చైర్మన్ కోదండరామ్ వస్తారని ఆయన తెలిపారు. టిజెఎసి నాయకులు కోదండరామ్, దేవిప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తదితరులు సోమవారం కెసిఆర్‌తో భేటీ అయ్యారు. అఖిలపక్ష సమావేశం, ఈలోగా టిజెఎసి చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణపై వారు కెసిఆర్‌తో చర్చించారు. అనంతరం కోదండరామ్‌తో కలిసి కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల అధ్యక్షులు హాజరై లిఖిత పూర్వకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖ ఇవ్వాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుని హోదాలో తాను వెళ్లినట్టుగానే, టిడిపి నుంచి చంద్రబాబు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి విజయమ్మ రావాలని సూచించారు. తెలంగాణకు అనుకూలమని ఇంతకాలంగా చెబుతోన్న పార్టీల అసలు బండారం ఏమిటో అఖిలపక్ష సమావేశంలో బయట పడిపోతుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వని పార్టీలకు ఈ ప్రాంతంలో పుట్టగతులు లేకుండా చేస్తామని కెసిఆర్ హెచ్చరించారు. అఖిలపక్ష సమావేశానికి బిజెపి, సిపిఐ పార్టీల నుంచి జాతీయ నాయకులతోపాటు రాష్ట్ర అధ్యక్షులు హాజరుకావాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. టిఆర్‌ఎస్ తరఫున కోదండరామ్ అఖిలపక్షానికి రావడంలో తప్పులేదని, టిజెఎసి అధ్యక్షుని హోదాలో ఆయన్ను తాము తీసుకెళ్తామని ఆయన స్పష్టంచేశారు. దివంగత జయశంకర్‌కు ఏ హోదా లేకపోయినా గతంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి తనతోపాటు వచ్చారని కెసిఆర్ గుర్తు చేశారు. కోదండరామ్‌ను తాను ఆహ్వానించకపోయినా, ఇతర పార్టీలు అఖిలపక్షానికి ఆహ్వానించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, సీమాంధ్ర మీడియా పక్షపాత బుద్ధితో వ్యవహారిస్తోందని కెసిఆర్ ఆరోపించారు. తమ పల్లెబాట కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలావుంటే అంతకుముందు సిరిసిల్లకు చెందిన పత్తిలక్ష్మి అనే మహిళకు శస్త్ర చికిత్స కోసం రూ. 2.50 లక్షల చెక్కును కెసిఆర్ అందజేశారు.
కెసిఆర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ ఒత్తిడిని తట్టుకోలేక సురేఖ చిల్లర, మల్లరగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముందు కొండా సురేఖను ఆత్మహత్య చేసుకోమనండి తెలంగాణ వస్తుందేమో చూద్దాం అని ఆయన వ్యాఖ్యానించారు.
భేటీకి ముందు బంద్ యోచన
అఖిలపక్ష సమావేశానికి ముందు బందా? ఇతర ఆందోళన కార్యక్రమాలు ఏవైనా నిర్వహించాలా? అనే అంశంపై యోచిస్తున్నామని కోదండరామ్ తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి బిజెపి, సిపిఐ పార్టీల రాష్ట్ర అధ్యక్షులతో పాటు, ఆ పార్టీ జాతీయ నేతలను రావాల్సిందిగా టిజెఎసి తరఫున ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.
సోమవారం టిజెఎసి నేతలతో భేటీ అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న కెసిఆర్. చిత్రంలో టిజెఎసి చైర్మన్ కోదండరామ్ తదితరులు.
అఖిలపక్ష సమావేశంపై కెసిఆర్ డిమాండ్ టిఆర్‌ఎస్ నుంచి కోదండరామ్ హాజరు కెసిఆర్‌తో టిజెఎసి నేతల భేటీ
english title:
p
Date:
Tuesday, December 18, 2012