హైదరాబాద్, డిసెంబర్ 17: ‘నేను తెలంగాణ అమర వీరులను అవమానించలేదు, వారి మనోభావాలకు భంగం కలిగించ లేదు..’ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఆదివారం ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సులో తాను తెలంగాణ అమర వీరులను అవమానించానని, క్షమాపణ చెప్పాలని కొంత మంది డిమాండ్ చేసినట్లు మీడియాలో చూశానని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. అయితే తాను ఎవరినీ కించపరచలేదు, అవమానించలేదని అన్నారు. ఎవరికైనా ఆ విధమైన భావాన్ని కలిగించి ఉంటే, భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తాము ఈ సమావేశానికి రాలేకపోతున్నామని కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముందుగానే తనకు తెలియజేశారని అన్నారు. అయితే ఎంపి కావూరి సాంబశివరావు తాను ఇంకా ఆలోచించుకోవాల్సి ఉందని చెప్పారని ఆయన తెలిపారు. సదస్సులో మాట్లాడేందుకు తమకు అవకాశం కల్పించలేదని జిల్లా పార్టీ అధ్యక్షులు (డిసిసి) పలువురు అసంతృప్తిని వ్యక్తం చేశారన్న ప్రశ్నను బొత్స తోసిపుచ్చారు. రాబోయే రోజుల్లో నాలుగైదు జోన్లలో సదస్సులు నిర్వహించబోతున్నామని, అక్కడ వారికి మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. కేంద్ర మంత్రి చిరంజీవి ఫొటోలను సదస్సులో పెట్టలేదని ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదని ఆయన చెప్పారు. ఈ సదస్సు ధ్యేయం, లక్ష్యం నెరవేరిందని మరో ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.
తెలంగాణ అంశాన్ని సత్వరమే పరిష్కరించాలని కేంద్రాన్ని, పార్టీ అధిష్ఠానాన్ని కోరామని ఆయన తెలిపారు. త్వరగా పరిష్కరించకపోతే అభివృద్ధి కుంటుపడుతుందన్న ఆందోళనను తెలియజేశామని వివరించారు. కాగా, ఈ నెల 28న ఢిల్లీలో జరగబోయే అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరఫున ఎవరిని పంపించాలన్న విషయం ఇంకా నిర్ణయించలేదని అన్నారు. అయితే 28వ తేదీలోగానే తమ పార్టీకి చెందిన అన్ని ప్రాంతాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి, ఒకే అభిప్రాయాన్ని వెల్లడించేందుకు యత్నించనున్నట్లు ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ వంటి అనేక పథకాలు కాంగ్రెస్ పథకాలని ఆయన పునరుద్ఘాటించారు. వ్యక్తులు ముఖ్యం కాదని, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. సోనియా గాంధీ ఒక్కరే తమ నాయకురాలని ఆయన విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా అన్నారు. పార్టీ, ప్రభుత్వం ఇంకా సమన్వయంతో ముందుకు నడవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ సూచించారే తప్ప అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పారు.
త్వరలో అన్ని ప్రాంతాల నేతలతో సమావేశం
english title:
t
Date:
Tuesday, December 18, 2012