Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పట్టణ మహిళా గ్రూపులకూ వడ్డీలేని రుణాలు

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 17: పట్టణ పేదరిక నిర్మూలనా పథకంలో మార్పులు తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. విశాఖ జిల్లాలో మూడురోజులపాటు జరిగే ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తొలిరోజు సోమవారం విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద పారిశ్రామిక ప్రాంత ప్రజలకు 24 గంటలు తాగు నీటి సరఫరా పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్కాపురంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఇందిర కాంతిపథం కింద గ్రామీణ మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, వీటిని పట్టణ మహిళలకూ విస్తరించే చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అర్బన్, రూరల్ ఐకెపిలకు కలిపి ఈ ఏడాది 13 వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారు.
ఈ ఏడాది కేవలం అర్బన్ ఐకెపి కింద 1900 కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వనున్నామన్నారు. దీనిపై 14 శాతం వడ్డీని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. దీనివలన ఏడాదికి 1400 కోట్లు సర్కారుపై భారం పడుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 122 ఐకెపి భవనాలను నిర్మించనున్నట్టు చెప్పారు. ఒక్కో భవనాన్ని 25 లక్షలతో నిర్మిస్తామన్నారు. మహిళలు తీసుకున్న రుణం సరిపోకపోతే, అర్హతను బట్టి మరో 25 వేలు స్ర్తి నిధి నుంచి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అభయ హస్తం కింద రాష్ట్రంలో మరో 10 లక్షల మందిని కొత్తగా చేర్చుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఏడాదికి 6500 మంది శిశువులు చనిపోతున్నారన్నారు. ఆస్పత్రుల్లో వౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు 1000 మంచాలను మంజూరు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఫలితంగా 15 వేలమంది శిశువుల ప్రాణాలను కాపాడగలుగుతామని వివరించారు. ఇక విశాఖ నగరాభివృద్ధికి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద 2084 కోట్లు మంజూరయ్యాయని, రెండో విడతగా 7,500 కోట్లు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పేదలకు భారీ సంఖ్యలో గృహాలను నిర్మించామని, త్వరలో మరో 15 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు చేపల వేట దుర్లభం అవుతున్నందున, దాన్ని సులభతరం చేసేందుకు జిపిఎస్ విధానాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిపిఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శాటిలైట్ ఆధారంతో చేపలు ఎక్కడ ఉన్నదీ కనుగొని, మత్స్యకారులకు తెలియచేయడం అవుతుందని, దీనివలన చేపల వేట సులభం అవుతుందని అన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గంటా శ్రీనివాసరావు, బాలరాజు, తోట నరసింహం, కోండ్రు మురళి, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందా?

కాంగ్రెస్ సదస్సుపై నేతల్లో అనుమానం
పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు
భర్తీ చేయడం లేదన్న అసంతృప్తి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివారం ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన సదస్సు సక్సెస్ కావడంతో ఆ పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొంత ఉత్సాహాన్ని కలిగించింది. అయితే ఇది కింది స్థాయి నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కలిగించిందా? లేదా? అనే అనుమానాలు పార్టీ నేతల్లో కలిగిస్తున్నది. 10వేల మందితో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించినంత మాత్రాన అది ఎంతవరకు పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందన్న తర్జనభర్జన జరుగుతున్నది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకుండా ఇటువంటి సదస్సులు, సమావేశాలు నిర్వహించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సమావేశాలు, సదస్సులు నిర్వహించడంలో తప్పులేదు కానీ పార్టీ కోసం అంకితమైన భావంతో పనిచేస్తున్న వారికి అటు పార్టీ పదవుల్లో గానీ, ఇటు ప్రభుత్వ పదవులు అంటే వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చి ఆదరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గత రెండేళ్ళుగా నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీ చేసేందుకు వీలుకాలేదు. అందుకు కారణం ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది. ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నామినేటెడ్ పదవుల పంపిణీ జరగలేదు. ఈ క్రమంలో ఆదివారం నాటి సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ సంక్రాంతిలోపే నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని ప్రకటించడంతో పార్టీ నాయకుల్లో ఉత్సాహం కలిగింది. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నామినేటెడ్ పదవులు భర్తీ చేసి ఉంటే, ఇప్పటికే ఒక విడత పూర్తి అయి ఉండేదన్న అభిప్రాయం ఉంది. నామినేటెడ్ పదవుల పంపిణీలో పైరవీలకు అవకాశం ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు నివ్వాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు 14 నెలల గడువు మాత్రమే ఉన్నందున, పార్టీ శ్రేణులను సక్రమంగా ఉపయోగించుకుని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు పార్టీ సీనియర్ నాయకులు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

జగన్‌తో కాంగ్రెస్ కుమ్మక్కయందనడానికి
చిరంజీవి వ్యాఖ్యలే ఆధారం!

జైలులో జగన్‌కు సౌకర్యాలపై విచారణ చేయంచాలని టిడిపి డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 17: కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని, దానిలో భాగంగానే చంచల్‌గూడ జైలులో జగన్ నిబంధనలకు విరుద్ధంగా సౌకర్యాలు అనుభవిస్తున్నాడని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రికి సోమవారం లేఖ రాశారు. కాంగ్రెస్ విస్తృత సమావేశంలో కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడుతూ జైలులో జగన్ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు చెప్పారని తెలిపారు. ఈ విషయాన్ని తాము గతంలో అనేకసార్లు జైళ్ల డిజికి ఫిర్యాదు చేశామని, విచారణ జరిపించాలని డిమాండ్ చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు చిరంజీవి సైతం అదే మాట చెబుతున్నందున కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కుమ్మక్కు అయ్యారనడానికి ఇదే నిదర్శనమని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం సహకారం లేనిదే జైలులో జగన్‌కు సకల సౌకర్యాలు ఏ విధంగా లభిస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ విస్తృత సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జగన్‌ను పల్లెత్తుమాట అనలేదన్నారు. ఎన్నికల ముందే విలీనం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు సాగుతున్నాయని ఆరోపించారు. జైలులో జరుగుతున్న అక్రమాలు, జగన్‌కు కలిగిస్తున్న అక్రమ సౌకర్యాలపై విచారణకు ఆదేశించాలని యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. కాగా, ముఖ్యమంత్రికి రాసిన లేఖ ప్రతి ఒక దానిని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా యనమల పంపించారు.

వైఎస్‌ఆర్‌సిపి వైఖరి చెప్పాలి

తెలంగాణపై టిడిపి ఎమ్మెల్యేల డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ అంశంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేయాలని టిడిపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సోమవారం టిడిఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు మాట్లాడారు.
అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబునాయుడు ప్రధానమంత్రికి లేఖ రాయడంతో సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పి టిడిపి ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డి పార్టీ వీడి వెళ్లారని, ఇప్పుడు ఆయన్ని విజయమ్మ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నారని, కాబట్టి తెలంగాణపై ఆ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణకు చెందిన నాయకులు కూడా ఉన్నారు, వారంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారా? చెప్పాలని మండవ ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం డిమాండ్ చేసిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు అంటే ఆ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందా? అలా అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించాలన్నారు. ఇదిలావుంటే రాష్ట్రానికి చెందిన నిధులన్నీ చంద్రబాబు చిత్తూరు జిల్లాకే ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించే వారని గోపాలకృష్ణా రెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకు చేసిందేమీ లేదని ఇప్పుడు విజయమ్మ విమర్శిస్తున్నందున గతంలో వాళ్ల ఆయన చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని ఆమె భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. చిత్తూరు డెయిరీని బాబు మూసివేయించారనే విమర్శల్లో వాస్తవం లేదన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ఆర్, నేడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి అసలు చిత్తూరు డెయిరీకి ఏం చేశారని నిలదీశారు.

సీమలో మొదలైన ‘సహకార’ వేడి

కోస్తాంధ్రలో హడావిడి.. తెలంగాణలో స్తబ్దత
ఎన్నికలపై 20న కేబినెట్ ఉప సంఘం భేటీ
2,949 సంఘాలకు ఎన్నికల ప్రక్రియ మొదలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 17: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా రాయలసీమలో ఎన్నికల వేడి ఊపందుకుంది. చిత్తూరు జిల్లాలో సహకార ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ప్రతికూల పరిస్థితులు తీసుకువచ్చి, మెజార్టీ సంఘాలను కైవసం చేసుకోవడానికి అటు రామచంద్రారెడ్డి, ఇటు వైకాపా నేతలు స్నేహపూర్వక ఒప్పందాలు కుదుర్చుకొని చెట్టాపటాల్‌తో ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి అనుచరులు మాత్రం సహకార ఎన్నికల్లో కష్టపడి పనిచేసే నేతలకు ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో ఈ నెల 20న సహకార ఎన్నికలపై సచివాలయంలో కేబినెట్ ఉప సంఘం విస్తృతంగా చర్చించనున్నది. 10 నుంచి సహకార సభ్యత్వాలను చేర్చుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహాలం నెలకొంది. సీమలో కాంగ్రెస్, వైకాపా నేతలు పోటాపోటీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నందున వివాదాస్పదం అవుతున్నది. జరగనున్న ఎన్నికల్లో తమదే పైచేయి కావాలని చూస్తున్నందున గ్రూపుల ఆధిపత్యంకు ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే కడప జిల్లాల్లో గతంలో సహకార సంఘాలకు చైర్మన్‌గా వ్యవహరించిన నాయకులు, సభ్యుల ఓటర్ల లిస్టుతోపాటు నమోదు పుస్తకాలను దాచివేస్తున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు తెరవెనుక ఉండి రాజకీయాలు నడుపుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు సైతం విమర్శిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటర్ల నమోదులో బోగస్ ఓటర్లను చేర్చుతున్నారంటూ జిల్లా కలెక్టర్‌కు టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఎన్నికలు దాదాపు 45 రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నందున రాజకీయ నేతలు పోటాపోటీగా అనుచరులతో సభ్యత్వ నమోదును చేపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో చేరిన ఎమ్మెల్యేలు అమర్‌నాథ్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డి సహకార ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా చూస్తున్నారు. తమ నియోజక వర్గాల్లో పట్టును నిరూపించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేపట్టారు. పుంగనూరు ఎమ్మెల్యే పీలేరు రామచంద్రారెడ్డి కూడా నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, అనుచరులకు సూచనలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు.
అయితే అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం నేతలు ఎన్నికలపై ఎక్కువ శ్రద్ద చూపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో సభ్యత్వంతోపాటు వాటికి సంబంధించిన ఫీజును చెల్లించడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుగుదేశం కేడర్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తోందని ఆ పార్టీ నేతలు భహిరంగంగానే విమర్శిస్తున్నారు. సభ్యత్వం చేర్చాలంటే ప్రతి వ్యక్తికి కనీసం 350 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సభ్యత్వం చేర్చుకోవడానికి డబ్బులు చెల్లించినా మళ్ళీ ఎన్నికలనాడు ఓటర్లకు డబ్బులు పంచడానికి ఎవరు భరిస్తారనే వాదన టిడిపి నాయకుల నుంచి వినిపిస్తోంది. ఇక తెలంగాణ జిల్లాల్లో సహకార ఎన్నికలపై స్థానిక నేతల్లో ఉత్సాహం ఉన్నా పార్టీ నేతలు ముందుకు రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఇంకా సహకార ఎన్నికలపై కనె్నత్తి చూడడం లేదని కాంగ్రెస్ కేడర్ కనె్నర్ర చేస్తోంది. మరోవైపు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో మంత్రులు ఇంకా సహకార ఎన్నికల వైపు చూడడం లేదని, ఎమ్మెల్యేలు మాత్రం అనుచరులతో సభ్యత్వ నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలావుంటే సోమవారం నుంచి బుధవారం వరకు విశాఖపట్నం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పర్యటన అనంతరం ఎన్నికల వేడి రాజుకుంటుందని ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు. ఇందిరమ్మబాటలో పాల్గొంటున్న కిరణ్ బుధవారం మంత్రులకు ఎన్నికల గురించి వివరించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

నగదు బదిలీపై
నేడు ప్రధాని కీలక భేటీ
1న అమలుకు సమాయత్తం
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక రీతిలో అమలు చేయతలపెట్టిన నగదు బదిలీ పథకానికి మరో పక్షం రోజులే గడువు ఉండటంతో ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం ఇందుకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంత మేరకు సమాయత్తమవుతోందన్న అంశాన్ని ఈ సమావేశంలో పరిశీలిస్తారు. నగదు బదిలీపై జాతీయ కమిటీ సమావేశం ప్రధాని అధ్యక్షతన జరుగుతుందని, ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాల గురించి ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూవాలియా వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. జనవరి ఒకటి నుంచి అమలు చేయతలపెట్టిన ఈ పథకానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో రేపటి సమావేశానికి విస్తృత ప్రాధాన్యత చేకూరింది. తొలి విడతగా జనవరి ఒకటిన 35జిల్లాల్లో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని, పదో తేదీకల్లా మరో 51జిల్లాలకు దీన్ని వర్తింపజేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పథకాన్ని ఆధార్ కార్డుతో ముడిపెట్టడం వల్ల ఈ కార్డుల జారీని ముమ్మరం చేయాలని కూడా పిఎంఓ ఆదేశించింది. రానున్న కొన్ని వారాల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలు ఆధార్ కార్డు జారీపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాగే లబ్ధిదారులందరికీ బ్యాంకు ఖాతాలు ఉండేలా చూడటంతో పాటు ఆధార్ నంబర్లను కూడా నమోదు చేసేందుకు ఈ మంత్రిత్వ శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
నగదు బదిలీ పథకాన్ని
వ్యతిరేకించిన మమత
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అమలుచేయ తలపెట్టిన నగదు బదిలీ పథకాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు సరైన యంత్రాంగం లేనందున నిర్ధేశిత పేద లబ్ధిదారులకు నగదు సక్రమంగా అందదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ పథకాన్ని మేము గానీ మా రాష్ట్రం గానీ అంగీకరించడం లేదు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు యంత్రాంగం ఏది? ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు సక్రమంగా నగదు అందాలంటే సరైన యంత్రాంగం ఉండి తీరాలి’ అని సోమవారం పార్లమెంట్ భవనంలో విలేఖర్లతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు. దేశంలో ఇప్పటికీ బ్యాంకులు, పోస్ట్ఫాసులు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయని, ప్రభుత్వం ముందు వాటిని ఏర్పాటుచేసి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర సామాజిక అభివృద్ధి పథకాల పరిధిలో ఉన్న ప్రజలందరిచేత ఖాతాలు తెరిపించాలని, లేకపోతే పేదలకు అందాల్సిన సొమ్ము సక్రమంగా అందదని ఆమె పేర్కొన్నారు. కేవలం ఒక కప్పు టీ తాగాలంటేనే నాలుగు రూపాయలు వెచ్చించాల్సి వస్తున్న ఈ రోజుల్లో ఐదుగురు కుటుంబ సభ్యులు గల కుటుంబానికి 600 రూపాయలకే నెల రోజులు సరిపడే బియ్యం, గోధుమలు, పప్పులు అందజేయవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మమత అన్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించడం లేదని మమతా బెనర్జీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు తమ పార్టీ అండగా నిలుస్తుందని, వారికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని ఆమె స్పష్టం చేశారు. ఓబిసి రిజర్వేషన్ల బిల్లును తమ రాష్ట్రం ఇప్పటికే ఆమోదించిందని, దీనిద్వారా 13 నుంచి 14 శాతం ముస్లింలకు కూడా లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు.

షర్మిల పాదయాత్రకు ‘బ్రేక్’

మూడు వారాలు విశ్రాంతి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు

హైదరాబాద్, డిసెంబర్ 17: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మహాప్రస్థానం పాదయాత్రకు ‘బ్రేక్’ పడింది. షర్మిల కాలుకు గాయం కావడంతో డాక్టర్ల సలహా మేరకు ఆమె మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత షర్మిల పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. షర్మిల పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన తర్వాత మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించి, వేదిక దిగుతున్న సమయంలో కాలు బెణికింది. దీంతో ఆమె ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. అయినా కాలు గాయం తగ్గకపోవడంతో మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు ఆమెకు సూచించారు. షర్మిల సోమవారం తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతి, ఆమె భర్త అనిల్‌కుమార్, పార్టీ ఇతర నాయకులు వైవి సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

వారంలో ఉత్తర్వులు మత్స్యకారులకు జిపిఎస్ విధానం విశాఖ ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి కిరణ్ వరాలు
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>