కడప, డిసెంబర్ 17: ‘ఆ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ పథకం కింద ఓ ఇల్లు మంజూరయింది. దానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 55 వేల రూపాయల రుణం లభిస్తుంది. అందులో కొంత ఇనుము, కొంత సిమెంటు రూపంలో వస్తుంది. ఐదారేళ్ల క్రితం పరిస్థితుల్లోనే తలకిందులుగా తపస్సు చేసినా ఆ సాయంతో ఇంటి నిర్మాణం సగం కూడా పూర్తి కాదు. ఇప్పుడైతే పూర్తి చేయాలని తలచడానికి కూడా సాహసించే పరిస్థితి లేదు. అలాంటి కుటుంబానికి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నిలువునా ప్రాణం తీసినట్లయింది. ఇల్లు మంజూరయిందని దానిని ఎప్పటికైనా పూర్తి చేసుకుంటామని ఊహల్లో తేలుతున్న లబ్ధిదారుల కల కరిగిపోయింది’. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం కోసం చేసిన ఖర్చు, శ్రమ అప్పుల రూపంలో మిగిలింది. పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం చేపట్టని లబ్ధిదారులపై కొరడా ఝుళిపించడానికి ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. దీని ప్రకారం పట్టణాల్లో గానీ, నగరాల్లో గానీ ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోతే దానిని స్వాధీనం చేసుకుని అర్హత కలిగిన మరో లబ్ధిదారుడికి బదలాయిస్తారు. కడప కార్పొరేషన్, రాయచోటి, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, యర్రంగుంట్ల తదితర మునిసిపాల్టీల్లో ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది లబ్ధిదారుల ఇళ్లు పునాదుల్లో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జీవో నెం.85 ప్రకారం ఆర్డీవో అధ్యక్షతన సంబంధిత మండల తహశీల్దార్, హౌసింగ్ అధికారులు ఆ ఇళ్లను తనిఖీ చేసి లబ్దిదారునికి ఆరు నెలల్లో పూర్తి చేయాలని హెచ్చరిస్తారు.
అప్పటికీ పూర్తి కాకపోతే అర్హులైన మరొకరికి కేటాయిస్తారు. పట్టణాల్లోని ఇందిరమ్మ లబ్ధిదారుల్లో ఓసి, బిసిలకు 55 వేల రూపాయలు ఎస్సీ, ఎస్టీలకు 85 వేల రూపాయల చొప్పున చొప్పున రుణంగా ఇస్తున్నారు. ఈ మొత్తం ఆ ఇళ్ల నిర్మాణాల పునాదులకే సరిపోతున్నది. ఈ నేపథ్యంలో సంబంధిత ఇళ్లను నిర్మించుకోకపోతే రద్దు చేస్తామని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆన్‌లైన్‌లో గానీ బ్యాంక్‌ల ద్వారా బిల్లులు చెల్లించేవారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ద్వారా పునాది, గోడలు, స్లాబు, ఫినిషింగ్ దశలకు నాలుగు విడతలుగా విడుదల చేస్తున్నారు. అయితే ఆర్థిక స్థోమత లేని పేదలు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పునాదులకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలతో లబ్దిదారుడు బెంబేలెత్తుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో దాదాపు 20 వేల గృహాలను లబ్దిదారులు నిర్మించుకోవాల్సి ఉండగా, నేటికి 2 వేల గృహాల నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం సిమెంట్ మాత్రమే ఇందిరమ్మ గృహాలకు సరఫరా చేస్తోంది. గతంలో స్టీల్ కూడా సరఫరా చేసే వారు. పెరిగిన రేట్ల ప్రకారం స్టీలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సిమెంట్ ఏమాత్రం సరిపడడం లేదు. ఇసుక అందుబాటులో లేకపోవడంతోపాటు రాళ్లు, కంకర ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇందిరమ్మ గృహాలు నిర్మించుకోవడానికి పట్టణాల్లో లబ్ధిదారులు సాహసించడం లేదు. ఇల్లు కట్టుకోవాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో అధికారుల హెచ్చరికలను పట్టించుకునే పరిస్థితిలో లబ్ధిదారులు కనిపించడం లేదు. రద్దు చేసిన ఇంటిని తమకు కేటాయించాలని మరో లబ్ధిదారుడు ముందుకొస్తున్నా ప్రారంభంలో చూపిన ఉత్సాహం తర్వాత ఉండదని అధికారులే చెప్పడం గమనార్హం.
* పూర్తికాని ఇళ్ల బదలాయింపునకు జీవో
english title:
i
Date:
Tuesday, December 18, 2012