విశాఖపట్నం, డిసెంబర్ 17: మూడు రోజులపాటు విశాఖ జిల్లాలో జరిగే ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి తొలి రోజే అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. మహావిశాఖ నగర పరిధిలోని మల్కాపురంలో జరిగిన బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో మహిళలు అకస్మాత్తుగా లేచి కిలోబియ్యం రూపాయికి ఇవ్వడం వలన తమకేమీ ఒరగడం లేదని అన్నారు. పప్పు, ఉప్పు ధరలు పెంచేసి, రూపాయికే బియ్యం ఇవ్వడం వలన ప్రయోజనం కనిపించడం లేదన్నారు. ఇంటి యజమాని 100 రూపాయలు కూలి డబ్బులు తెస్తే, అందులో 90 రూపాయలు నిత్యావసరాలకే ఖర్చయిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను తగ్గించడం వల్ల తామెలా బతకాలని బిగ్గరగా అరిచారు. బోలెడు డబ్బుపోసి కిరోసిన్ కొనుగోలు చేద్దామంటే, డీలర్లు మోసం చేస్తున్నారని అన్నారు. దీనికితోడు విద్యుత్ చార్జీలను పెంచారని, వీటిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మహిళలు నిలదీశారు. ఈ నేపథ్యంలో మంత్రి బాలరాజు లేచి ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తుతూ, ఆయనకు జిందాబాద్ కొట్టమని కేకలు పెట్టారు. అయితే సభ నుంచి ఎటువంటి ప్రతి స్పందన కనిపించలేదు. ఆ తరువాత ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, వేరే అంశాలను మాట్లాడారు. అంతకు ముందు మంత్రులు మాట్లాడుతూ నెల నెలా లబ్ధిదారులకు పింఛను అందచేస్తున్నామని ప్రకటించడంతో మళ్లీ సభలో గందరగోళం ఏర్పడింది. తమకు పింఛను అందడం లేదని, వితంతువులు, వృద్ధులు చెప్పారు. కానీ వారి గోడు పట్టించుకున్న వారు లేరు. కానీ, వీరిని సభకు తీసుకువచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు మాత్రం వారిపై కనె్నర్ర చేసి, ఇకపై మీకు రావల్సిన ఎటువంటి పథకాలు రాకుండా చేస్తామంటూ హెచ్చరించి, వారి దగ్గరున్న కాగితాలు లాగేసుకున్నారు. చేపలుప్పాడ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న రూప మాట్లాడుతూ తమకు స్కాలర్‌షిప్‌లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందడం లేదని చెప్పింది. దీంతో సభలో ఉన్న మరికొంతమంది విద్యార్థులు ఆమెతో గొంతుకలిపారు. అదేవిధంగా రాత్రి పూట పవర్‌కట్ వలన కళాశాల నుంచి ఇంటికి వచ్చేప్పటికి కరెంట్ ఉండడం లేదని, దీనివలన చదువుకోలేకపోతున్నామని చెప్పింది. ఇంతపెద్ద నగరంలో సిటీ బస్సుల కొరత తీవ్రంగా ఉందని ఆడ పిల్లలు కూడా బస్సుల్లో నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆ విద్యార్థిని తెలిచేసింది. అలాగే ఆంధ్రా యూనివర్శిటీకి శాశ్వత విసిని నియమించాలని కోరుతూ ఎబివిపి కార్యకర్తలు ముఖ్యమంత్రి సభలో ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
* అన్ని ధరలు పెంచి.. రూపాయి బియ్యం మాకెందుకన్న మహిళలు * గ్యాస్ సిలిండర్ల తగ్గింపుపై సమాధానం చెప్పాలని డిమాండ్ * స్కాలర్‌షిప్ అందటం లేదన్న విద్యార్థులు
english title:
k
Date:
Tuesday, December 18, 2012