ఆదిలాబాద్, డిసెంబర్ 17: కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ముందూ వెనకా వెన్నంటి వుంటూ ముఖ్య సలహాదారుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి సోమవారం ఆదిరాబాద్ జిల్లా నిర్మల్‌లో విజయమ్మ సమక్షంలో వైకాపా పార్టీలో చేరిన సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. విజయలక్ష్మి ప్రసంగిస్తూ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా బాధ్యత గల ప్రతిపక్షం, అసమర్థత అధికార పక్షం కుమ్మక్కై ప్రజాకంఠక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. వీరి కుట్రల కారణంగానే జగన్ 205 రోజులుగా జెల్లో మగ్గుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం, రైతుల శ్రేయస్సు కోసం అనుక్షణం తపించి సుభిక్ష పాలన అందించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ చుక్కా నీరు ఇవ్వకుండానే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా వున్నాయని ఆరోపించారు. తెలంగాణలోని ఏడు జిల్లాలకు 16 లక్షల ఎకరాల సాగునీరు అందించేందుకు రాజశేఖరరెడ్డి 2008లో ఆదిలాబాద్ జిల్లా ప్రాణాహిత వద్ద భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఒక్క కాల్వ కూడా తవ్వకుండా కనీసం జాతీయ హోదాకు ప్రయత్నించక పోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రజలు జగన్‌ను అక్కున చేర్చుకొని తమ పార్టీని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంద్రకరణ్‌రెడ్డి వైకాపాలోకి రావడం ద్వారా జిల్లాలో తమ పార్టీ ఎదురులేని శక్తిగా మారుతుందన్నారు. ప్రాణహితతో పాటు మిగిలిన సాగునీటి ప్రాజెక్టులపై తమ పార్టీ రాజీలేకుండా పోరాడుతుందన్నారు. విజయమ్మ వెంట మాజీ మంత్రి వైవి సుబ్బారెడ్డి, బాజీరెడ్డి గోవర్థన్, రహమాన్, గోనె ప్రకాశ్‌రావు, జనక్‌ప్రసాద్, మాజీ మంత్రి బోడ జనార్థన్ ఉన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ తుల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్పలకు పార్టీ కండువాలు కప్పి విజయమ్మ అభినందించారు. విజయమ్మ సభకు ఆలస్యంగా వచ్చినా, జనం భారీగా తరలివచ్చారు.
160 మంది ఖైదీల
వెంకటేశ్వర దీక్ష
రాజమండ్రి, డిసెంబర్ 17: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు సోమవారం గోవింద నామస్మరణతో మారుమోగింది. 160 మంది ఖైదీలు శ్రీవెంకటేశ్వరస్వామి శరణాగతి దీక్షలు స్వీకరించారు. వికాసతరంగిణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చినజీయర్‌స్వామి శిష్యులు, అహోబిళ స్వామీజీ ఖైదీలతో 30రోజుల దీక్షలను స్వీకరింపజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదాలు, మంచి పనులకు మనసే ప్రధానమన్నారు. జైళ్లశాఖ డిఐజి ఎ నరసింహం మాట్లాడుతూ చారిత్రాత్మకమైన రాజమండ్రి సెంట్రల్‌జైలు కలియుగ వైకుంఠం తిరుమలలా కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ సూపరింటెండెంట్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.