గుంటూరు, డిసెంబర్ 17: కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కనుక ఇస్తే దేశవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు వ్యాపించి వెయ్యి ముక్కలు కావడం ఖాయమని సీనియర్ కాంగ్రెస్ నేత, ఏలూరి ఎంపి కావూరి సాంబశివరావు అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోతే ఇరుప్రాంతాల ప్రజలకు లాభాల కంటే నష్టాలే ఎక్కువని స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్ర జెఎసి ప్రతినిధుల సమావేశం గౌరవాధ్యక్షులు ఎన్ నరసింహారావు అధ్యక్షతన జరిగింది. కావూరి మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే దేశంలోని చాలా రాష్ట్రాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉత్పన్నవౌతాయన్నారు. తెలంగాణవాదుల ఒత్తిళ్లకు తలొగ్గే కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో తెలంగాణలో కంటే కోస్తా, రాయలసీమల్లోనే వెనుకబాటుతనం అధికంగా ఉందన్నారు. ఇదేవిషయాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావిస్తే తెలంగాణ సెంటిమెంట్ ఉందంటూ జవాబు దాటవేశారన్నారు. తెలంగాణలోని 4కోట్ల మంది ప్రజల్లో అత్యధికులు సమైక్యాంధ్రకే మొగ్గు చూపుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని కేవలం కొందరు రాజకీయ నిరుద్యోగులు మాత్రమే నడుపుతున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని కావూరి హెచ్చరించారు. ఐకాస పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. 22న విశాఖలో విద్యార్థి, రాజకీయ ఐకాస ఉమ్మడి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. 23న సీమాంధ్రలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 28న సీమాంధ్రలోని అన్ని విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో బంద్ పాటించాలని సీమాంధ్ర రాజకీయ ఐకాస నిర్ణయించింది. విజయవాడ సె
ంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కోఆర్డినేటర్ మండూరి వెంకటరమణ, అడారి కిషోర్, కృష్ణయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
నగదు బదిలీ వచ్చినా
చౌక డిపోలు ఉంటాయ
రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి
నంద్యాల, డిసెంబర్ 17: రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం 8 కొత్త రెవెన్యూ డివిజన్లు, 25 కొత్త మండలాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం కర్నూలు జిల్లా నంద్యాలలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం ప్రజాపంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకేనన్నారు. నగదు బదిలీ వల్ల చౌకదుకాణ డీలర్ల వ్యవస్థ రద్దు అవుతుందన్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి కోరారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి చౌకదుకాణ డీలర్ల ద్వారా నగదు బదిలీ పథకాన్ని అర్హులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భగీరథ పాదయాత్రను కొంతమంది విమర్శించడం బాధించిందన్నారు. రాయలసీమ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారన్నారు. హంద్రీనీవా నీటి వెంట తాను పాదయాత్ర చేసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తామన్న భరోసా కల్పించామని మంత్రి రఘువీరా వివరించారు.
కేడర్‌ను పట్టించుకోకుంటే
అంతే సంగతులు: విహెచ్
విశాఖపట్నం, డిసెంబర్ 17: కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయంటే కేవలం కార్యకర్తల వల్లనేనని, అటువంటి కార్యకర్తలను దూరం చేసుకుంటే దుకాణం మూసివేసే పరిస్థితి నెలకొంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు అన్నారు. విశాఖలో సోమవారం ప్రారంభమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా సాగరతీరంలోని రాజీవ్ స్మృతి భవన్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెలలో రెండుసార్లు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి మంత్రులు హాజరుకావాలన్నారు. ప్రజలు, కార్యకర్తలను పట్టించుకోకుండా సిఎం చుట్టూ తిరగడం సరికాదని చురకవేశారు. నాటినేటెడ్ పోస్టుల భర్తీలో కాలయాపన చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో 50శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
దుర్గగుడి ఇవోపై రహస్య విచారణ
* ప్రభుత్వానికి రేపోమాపో నివేదిక
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 17: దసరా ఉత్సవాల్లో మూలానక్షత్రం రోజున దుర్గమ్మను దర్శించుకోటానికి వచ్చిన కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి తోట నరసింహం పట్ల నాటి ఇవో ఎం రఘునాథ్ ప్రొటోకాల్ పాటించలేదని వచ్చిన ఆరోపణపై ప్రభుత్వం దేవాదాయ శాఖ డెప్యూటీ సెక్రటరీ (రెవెన్యూ) ఒబిఆర్ రెడ్డితో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ సోమవారం నాడిక్కడ ఆలయ ప్రాంగణంలో రహస్య విచారణ జరిపింది. ఈ అభియోగంపై సస్పెన్షన్‌లో కొనసాగుతున్న రఘునాథ్ కమిషన్ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చుకున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పర్యటనకు సంబంధించి తనకు సరైన సమాచారం లేదని, పైగా ఆయనకు రెవెన్యూ శాఖ నుంచి ప్రొటోకాల్ అధికారులు ముందుగానే నియమితులయ్యారని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇన్‌చార్జ్ మంత్రి గుడికి వచ్చిన సమయంలో తాను ఇతర విఐపిల వెంట దుర్గమ్మ దర్శనానికి వెళ్ళినట్లు కూడా ఆయన చెప్పారని తెలిసింది. ప్రస్తుత ఇన్‌చార్జ్ ఇవో విష్ణుప్రసాద్ అప్పుడు ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే వీరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం తనను సస్పెండ్ చేయటం విచారకరమని రఘునాథ్ తన వాదన వినిపించారంటున్నారు. అనంతరం నాడు విధి నిర్వహణలో వున్న రిసెప్షన్ సూపరింటెండెంట్, ఆలయ సూపరింటెండెంట్, నాటి ప్రత్యేకాధికారి, నేటి ఇవో విష్ణుప్రసాద్, ఇతర సిబ్బందిని కూడా కమిషన్ విడివిడిగా విచారించింది. కమిషన్ వెంట విజయవాడ ఆర్డీవో ఎస్ వెంకట్రావు కూడా పాల్గొన్నారు.
‘బాక్సైట్’ రద్దుపై ప్రకటన చేయాలి
* అఖిలపక్ష నేతల అల్టిమేటమ్
పాడేరు, డిసెంబర్ 17: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేస్తునట్టు ముఖ్యమంత్రి వెంటనే ప్రకటించాలని, లేకుంటే ఈ నెల 19న ఏజెన్సీ ప్రాంతంలో ఇందిరమ్మబాట కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రికి నిరసన తప్పదని, ఆ రోజు బంద్ చేస్తామని అఖిలపక్ష నాయకులు ప్రకటించారు. విశాఖ జిల్లాలో జరుపుతున్న ఇందిరమ్మబాట మూడోరోజు 19వ తేదీన ఏజెన్సీలోని పాడేరులో జరగనుంది. ఈ నేపథ్యంలో మన్యం బంద్‌కు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు పలకడంతో సిఎం పాడేరు పర్యటన రసాభాసగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక గిరిజన విద్యార్థి సంఘం భవనంలో బిఎస్‌పికి చెందిన మాజీ ఎంఎల్‌ఎ లకే రాజారావు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంఎల్‌సి కిడారి సర్వేశ్వరరావు, సిపిఎం నాయకులు పి అప్పలనర్స, బిజెపి నాయకుడు కురుసా బొజ్జయ్య, సిపిఐ నాయకుడు టి రాంబాబు, ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు సోమవారం సమావేశమై మన్యం బంద్‌కు తీర్మానించారు.
అణుప్లాంటును ఒప్పుకోం
* అధికారులను అడ్డగించిన కొవ్వాడ వాసులు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 17: తమ ప్రాంతంలో అణు విద్యుత్ కర్మాగారం వద్దంటూ శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో స్థానికులు సోమవారం అధికారులను అడ్డుకున్నారు. దశాబ్దాల తరబడి స్థానికులంతా అణువిద్యుత్ కేంద్రాన్ని వద్దంటూ తెగేసి చెబుతున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జీవోల మీద జీవోలు జారీ చేసి చాపకింద నీరులా పనుల నిర్వహణకు సన్నాహాలు ఆరంభించాయి. గతంలో పల్లెకుపోదాం కార్యక్రమంలో భాగంగా కొవ్వాడ గ్రామాన్ని సందర్శించిన మండల అధికారుల బృందాన్ని అడ్డుకుని అణువిద్యుత్ కేంద్రం ప్రతిపాదనను ఉపసంహరించుకుంటేనే గ్రామంలోకి అడుగుపెట్టాలని, లేకుంటే వెనుదిరగాలంటూ స్థానికులు బైఠాయించి ప్రజాభిప్రాయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. అదే తరహాలో సోమవారం అణుప్లాంటుపై అవగాహన కల్పించేందుకు కొవ్వాడ గ్రామం వెళ్లిన శ్రీకాకుళం ఆర్డీఒ గణేష్‌కుమార్, భూసేకరణ అధికారి రెడ్డి గున్నయ్య, మండల స్థాయి అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైటాయించి ప్రజల హక్కులను, రాజ్యాంగ స్వేచ్ఛను కాలరాయాలని చూడటం సబబుగా లేదంటూ దుయ్యబట్టారు. ప్యాకేజీలతో ప్రజలను మభ్యపెట్టి అణుప్లాంటును ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అణువిద్యుత్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులంతా నినాదాలు చేశారు. ఈ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆర్డీఒ గణేష్‌కుమార్, మిగిలిన అధికారులతో మత్స్యకార యువకులు వాగ్వివాదానికి దిగారు. ఒకానొక దశలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏది ఏమైనా అణుభూతాన్ని తరిమికొట్టేవరకు విశ్రమించేది లేదని స్థానికులు తెగేసి చెప్పారు. మత్స్యకార యువకులకు సర్దిచెప్పేందుకు అధికారులు చేసిన యత్నాలు ఫలించలేదు. అణువిద్యుత్ ప్లాంటు నిర్మాణం కోసం జారీ చేసిన జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. చేసేది లేక అధికారులంతా వెనుదిరిగారు.
తెలుగు జాతి గర్వపడేలా
మహాసభలు: మంత్రి వట్టి
తిరుపతి, డిసెంబర్ 17: తెలుగుజాతి గర్వపడేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తామని మంత్రి వట్టివసంతకుమార్ తెలిపారు. ఈ నెల 27 నుండి మూడురోజుల పాటు జరిగే మహాసభల ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం పరిశీలించింది. అనంతరం వీసి చాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి వట్టివసంతకుమార్ మాట్లాడుతూ 37 ఏళ్ళ తరువాత తొలిసారిగా ప్రపంచ తెలుగుమహాసభలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, అందులోనా తిరుపతి పుణ్యక్షేత్రంలో వీటిని నిర్వహిస్తున్నామన్నారు. మరో రెండు,మూడు రోజుల్లో ఈ పనులు ఒక కొలిక్కి వస్తాయన్నారు.
ఆటోను ఢీకొన్న లారీ
ఇద్దరు దుర్మరణం
ఉంగుటూరు, డిసెంబర్ 17: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం రాచూరు వద్ద సోమవారం ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గణపవరం నుండి నారాయణపురం వైపు వస్తున్న చేపల లోడు లారీ రాచూరు హైస్కూలు మలుపు వద్ద నారాయణపురం నుండి గణపవరం వెళ్తున్న ఆటోను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గుడివాడ త్రినాథ్ (28) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దాసరి సింహాచలం (52) అనే మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.
మా వల్లే హాయగా నిద్రపోతున్నారు
* బాబుకు ధర్మాన చురకలు
విశాఖపట్నం, డిసెంబఱ్ 17: రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పనిచేయకుండా నిద్ర పోతున్నదంటూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పదేపదే చేస్తున్న విమర్శలను మంత్రి ధర్మాన ప్రసాదరావు తిప్పికొట్టారు. విశాఖ నగరంలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం జరిగిన బహిరంగసభలో ధర్మాన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నపుడు తిరుపతి వెళ్ళి సురక్షితంగా తిరిగి రాలేని పరిస్థితి ఉండేదన్నారు. ఆయన పాలనలో ప్రజాప్రతినిధులు సురక్షితంగా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండేదికాదన్నారు.
అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం నిద్ర పోతున్నదంటూ చంద్రబాబు విమర్శించటం అర్ధరహితమన్నారు. ప్రభుత్వమే నిద్రపోతే పాదయాత్రలో భాగంగా అదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతంలో చంద్రబాబునాయుడు ఎలా నిద్రపోగలిగారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సమర్థత కారణంగానే ఇది సాధ్యపడిందన్నారు. ఇందిరాగాంధీకి నిజమైన వారసుడు కిరణ్‌కుమార్‌రెడ్డే అని కితాబు ఇచ్చారు. 125 కోట్ల మంది ప్రజలతో అమ్మా అని పిలిపించుకున్న ఇందిరమ్మ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఆమె నిజమైన వారసుడని అన్నారు. అధికారం కోసం నిత్యం పాకులాడే కొంతమంది నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో ప్రవేశపెట్టిన పథకాల్లో లోపాలను సరిచేసి వాటిని సక్రమంగా ప్రజలకు అందించేలా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయతత్నిస్తున్నారన్నారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి తన ప్రసంగాల్లో ధర్మానను పదేపదే తన సహచర మంత్రి అంటూ సంబోధించారు.
ఎన్నికలొస్తాయ..సిద్ధం కండి
టిడిపి శ్రేణులకు చంద్రబాబు పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, డిసెంబర్ 17: పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని అందుకు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతీ పార్టీ కార్యకర్త సంసిద్ధంగా ఉండాలని నాయకులకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిశానిర్ధేశం చేశారు. ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా ఇటిక్యాల-రాయిగల్ మధ్య బాబు తాను విడిది చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఉదయం కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ విజయం సాధించేలా శ్రేణులను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే సమస్యలు ఉన్నచోట పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గాల ఇంచార్జీలను నియమించడంతో పాటు ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో ఉన్నత పదవులు పొందిన నేతలు పార్టీని వదిలి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఇందుకు ప్రతిగా బాబు స్పందిస్తూ మొక్కలాంటి నాగంను వృక్షంగా మార్చి అభివృద్ధి చేస్తే ఉన్నత పదవులు పొంది ఓ స్థాయికి వచ్చిన తరువాత బయటికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పార్టీని వీడి బయటికి వెళ్లిన ఏ నాయకుడైనా మళ్లి తిరిగి వస్తున్నారు కదా అంటూ పరోక్షంగా దేవేందర్ గౌడ్‌ను ఉద్ధేశించి ఊటంకించారు. అంతేకాకుండా పార్టీని వీడే ఏ నాయకుడికైనా రాజకీయంగా పతనం తప్పదని అభిప్రాయపడ్డారు. జగన్ గూటికి చేరాలనుకుంటున్న నేతలంతా తగిన ఫలితం అనుభవిస్తారని, ఏదో ఒక రోజు వారికి జైలు తప్పదని కార్యకర్తల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.
యాత్ర కరీంనగర్‌తో సరి !?
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, డిసెంబర్ 17: చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర కార్యక్రమానికి కరీంనగర్ జిల్లాలోనే తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 26, 27 తేదీల మధ్య యాత్రకు బ్రేక్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై ఓ వైపు అఖిలపక్ష భేటిలో స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పాల్సిన పరిస్థితి రావడంతో ఈ సమస్యను అధిగమించేందుకు ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. స్పష్టమైన వైఖరి చెప్పే పరిస్థితి రాకపోతే తెలంగాణవాదులు కచ్చితంగా నిరసన సెగలు తగిలించే అవకాశముంది. దీనిపై ప్రజల నాడి తెలుసుకునేందుకు రేగుంట, ఇటిక్యాల, రాయికల్ గ్రామాలలో ప్రజల చేతికి మైకునిచ్చి వారి సమస్యలు తెలుసుకునే పేరుతో తెలంగాణ అంశం తీవ్రత ఎంతగా ఉందన్న విషయాన్ని బేరీజు వేసుకునే ప్రయత్నం చేశారు.