తార్నాక, డిసెంబర్ 17: అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టిడిపి అధికార ప్రతినిధి ఎం. ఆనంద్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన గౌలిగూడ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న నైట్‌షెల్టర్ పనులను నిలిపివేయాలని కోరుతూ జిహెచ్‌ఎంసి కమిషనర్ కృష్ణబాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌలిగూడలోని కమ్యూనిటీహాల్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ పాఠశాలలో స్థానికంగా ఎంతోమంది పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, ఈ పాఠశాలకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంను విద్యార్థులు క్రీడామైదానంగా ఉపయోగిస్తున్నారని, ఇపుడు ఆకస్మికంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆదరాబాదరగా నైట్‌షెల్టర్‌ను నిర్మించాలని గోడను కూల్చడం జరిగిందని అన్నారు. మూసీనది ప్రాంతంలో శివాజీపార్కువద్ద ఉన్న ఎకరాల ఖాళీ స్థలంలో మంత్రి అనుచరులు కబ్జాలు చేసి చిరువ్యాపారులకు అద్దెలకు ఇచ్చుకున్నారని, ఈ ప్రాంతంలో నైట్‌షెల్టర్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. అంతేకాని ప్రజలు ఉపయోగించుకుంటున్న చిన్న స్థలాన్ని కూడా అధికారులు ఇష్టారాజ్యంగా స్థానికులను సంప్రదించకుండా ప్రవర్తించడం శోచనీయమని, వెంటనే ఈ ప్రాంతంలో పనులను నిలిపివేసి శివాజీపార్కు ప్రాంతంలో నిర్మాణాన్ని చేపట్టాలని ఆనంద్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమేశ్, రంగేశ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
లంగర్‌హౌస్ కార్పొరేటర్ మార్పుపై ..
‘సుప్రీం’కు మజ్లిస్
* అందుకే కౌన్సిల్ వాయిదా?
* కోర్టు ఆదేశాలు ధిక్కరించారని బిజెపి ఆగ్రహం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 17: నగరంలోని లంగర్‌హౌస్ డివిజన్ మజ్లిస్ కార్పొరేటర్ రవియాదవ్‌పై అనర్హత, అలాగే తదుపరి మెజార్టీ సాధించిన ఉదయ్‌కుమార్‌ను కార్పొరేటర్‌గా ప్రకటించిన వ్యవహరంపై మజ్లిస్ అధిష్టానం దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెల్సింది. అయితే ఇటీవలి కాలంలో నగరంలోని బోరబండ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ వనజా, లంగర్‌హౌస్ మజ్లిస్ కార్పొరేటర్లకు ముగ్గురు పిల్లల సంతానమున్నట్లు ఆరోపిస్తూ పలువురు కోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే! అయితే ఈ రెండు డివిజన్ల కార్పొరేటర్ల మార్పుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు నేతల బృందం ఢిల్లీ వెళ్లినట్లు తెల్సింది. ఈ రెండు డివిజన్లలో బోరబండ డివిజన్‌కు సంబంధించి కాంగ్రెస్ కార్పొరేటర్ వనజాను అనర్హురాలిగా ప్రకటించి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెల్సిందే! అలాగే లంగర్‌హౌస్ డివిజన్ కార్పొరేటర్‌కు సంబంధించిన కేసులో మాత్రం మజ్లిస్ కార్పొరేటర్ రవియాదవ్‌ను అనర్హుడిగా ప్రకటించటంతో పాటు ఎన్నికల్లో అతని తర్వాత మెజార్టీ సాధించిన బిజెపి అభ్యర్థి ఉదయ్‌కుమార్‌ను కార్పొరేటర్‌గా ప్రకటించాలని జారీ చేసిన ఆదేశాలు మజ్లిస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇదే తరహాలో బోరబండ కార్పొరేటర్ విషయంలోనూ తదుపరి మెజార్టీ సాధించిన మజ్లిస్ అభ్యర్థినే కార్పొరేటర్‌గా ప్రకటించకపోవటం మజ్లిస్‌ను అయోమయానికి గురి చేసిందని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు డివిజన్లకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు మజ్లిస్ నేతలు వెళ్లినట్లు తెల్సింది. ఈ క్రమంలో స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వచ్చే పటిషన్లను సుప్రీంకోర్టు స్వీకరించదన్న వాదనలు విన్పిస్తున్నా, మజ్లిస్ నేతల పిటిషన్‌ను స్వీకరించినట్లు పలువురు నేతల ద్వారా తెల్సింది. మజ్లిస్ నేతలు ఆశించిన విధంగా ఒక వేళ సుప్రీంకోర్టు వారి పిటిషన్‌ను స్వీకరించి స్టే ఏమైనా ఇచ్చినా, అది కేవలం లంగర్‌హౌస్ కార్పొరేటర్‌గా రవియాదవ్ కొనసాగే అవకాశం మాత్రమే దక్కుతుందని వాదనలు విన్పిస్తున్నాయి. అలాగే మజ్లిస్ న్యాయపోరాటం బోరబండ డివిజన్‌కు సంబంధించి ముగ్గురు పిల్లల సంతానం విషయంలో అనర్హురాలిగా ప్రకటించిన వనజాకు గానీ, ఆమె తర్వాతి మెజార్టీ సాధించిన మజ్లిస్ అభ్యర్థికి గానీ ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశాలు అంతంతమాత్రమేనని, ఈ డివిజన్‌కు మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పలువురు కార్పొరేటర్లు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
రగులుతున్న.. వాయదా చిచ్చు!
* టిడిపి నోటీసును మేయర్‌కు పంపిన కమిషనర్
* కౌన్సిల్ నిర్వహణపై మజ్లిస్ దోబూచులాట
* ఆసక్తికరంగా మారిన డిప్యూటీ మేయర్, విపక్షాల పాత్ర
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 17: వరుసగా మూడుసార్లు కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ మాజీద్ హుస్సేన్ వాయిదా వేసిన చిచ్చు ఇంకా రగులుతోంది. వివిధ పార్టీలకు చెందిన సభ్యులు, అధికారుల మధ్య ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న సమన్వయం ఈ పరిణామంతో మరింత దెబ్బతినేలా ఉంది. కోర్టు ఆదేశాల మేరకు లంగర్‌హౌస్ కార్పొరేటర్ రవియాదవ్‌ను అనర్హుడిగా ప్రకటించిన అధికారులు తదుపరి మెజార్టీ సాధించిన బిజెపి అభ్యర్థి ఉదయ్‌కుమార్‌ను కార్పొరేటర్‌గా ప్రకటించటమే కౌన్సిల్ వాయిదాకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.
కౌన్సిల్ నిర్వహిస్తే బిజెపి అభ్యర్థి ఉదయ్ కుమార్ కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేస్తారని, దాన్ని అడ్డుకునేందుకే మజ్లిస్ ఎంతో చాకచక్యంగా మరోసారి కౌన్సిల్‌ను వాయిదా వేసినట్లు తెల్సింది. ఈ క్రమంలో మేయర్ లేకుండానైనా కౌన్సిల్ నిర్వహించాలని కోరుతూ టిడిపి ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో కమిషనర్ కృష్ణబాబుకు సభ్యులిచ్చిన నోటీసును కమిషనర్ మేయర్‌కు పంపినట్లు తెల్సింది. అయితే టిడిపి నోటీసుకు మేయర్ పెద్దగా స్పందించకపోయినా త్వరలోనే కౌన్సిల్ నిర్వహిస్తామని సమాధానం చెప్పుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టిడిపి ఇచ్చిన నోటీసులు సరిగ్గా లేనందునే మేయర్ దానికి పెద్దగా స్పందించినట్లు లేదు. కేవలం కౌన్సిల్ నిర్వహించాలని కోరుతూ టిడిపి జారీ చేసిన నోటీసులో తేదీ, సమయాన్ని కూడా సూచిస్తూ నోటీసు ఇస్తే నిబంధనల ప్రకారం అది సమర్థవంతమైన నోటీసు అవుతుందని, తేదీ, సమయం లేకుండా ఇచ్చిన నోటీసు నిబంధనల ప్రకారం పరిగణలోకి తీసుకునేందుకు పనికారదని అధికారులంటున్నారు. బిజెపి కార్పొరేటర్ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకునేందుకు మజ్లిస్ పార్టీ కౌన్సిల్‌ను వాయిదా వేసి, న్యాయపోరాటానికి సిద్దమవుతుంటే, మరోవైపు బిజెపి కూడా మజ్లిస్ ఎత్తును చిత్తు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెల్సింది. రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయటంలో అధికారుల ఆలసత్వం, సభ్యుడి ప్రమాణస్వీకారాన్ని అడ్డుకునేందుకు మజ్లిస్ కౌన్సిల్‌ను వాయిదా వేయటాన్ని సవాలు చేస్తూ కోర్టుకేళ్లాలని భావిస్తున్నట్లు తెల్సింది. ఈ రకంగా మజ్లిస్, బిజెపి పార్టీలు ప్రస్తుతం ఒక్క సీటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు కన్పిస్తోంది. కౌన్సిల్‌లో బిజెపి కన్నా ఎక్కువ సభ్యులు కల్గిన టిడిపి కనీసం సక్రమమైన పద్దతిలో నోటీసును జారీ చేయటంలోనూ విఫలం కావటం మజ్లిస్‌కు ఒక అవకాశంగా మారిందనే చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, కౌన్సిల్ నిర్వహణ అంశానికి సంబంధించి డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ కూడా వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమైనట్లు తెల్సింది.
వరుసగా మూడుసార్లు కౌన్సిల్‌ను వాయిదా వేసి సమావేశం నిర్వహణపై మజ్లిస్ దోబూచులాడుతున్న సమయంలో డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సమాచార హక్కు చట్టంపై మండిపాటు * గ్రేటర్ అధికారులపై ఆగ్రహం
సిఎం సీరియస్!
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 17: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సమాచార హక్కు చట్టం అమలుతీరుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీరియస్ అయినట్లు విశ్వసనీయంగా తెల్సింది. మజ్లిస్ ప్రజాప్రతినిధుల ఆస్తులు, వారికి చెందిన భవనాలకు నిర్మాణ అనుమతులు, డీవియేషన్స్ సంబంధించి సమాచారం కోసం పాతబస్తీకి చెందిన ఎంబిటి కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా, ఆయనకు తగిన సమాచారాన్ని గ్రేటర్ అధికారులు ఇవ్వకపోవటంతో ఇప్పటికే అనేక సార్లు ప్రధాన కార్యాలయం చుట్ట ప్రదిక్షణలు చేసిన కార్పొరేటర్ అంజదుల్లా సోమవారం నేరుగా సిఎంను కలిసినట్లు తెల్సింది.
కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌కు మద్దతును ఉపసంహరించుకున్న నేపథ్యంలో మజ్లిస్ నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే! ఆ తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మజ్లిస్‌ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకున్న సంగతి తెల్సిందే! ఈ క్రమంలో మజ్లిస్ ప్రజాప్రతినిధులకు చెందిన ఆస్తులు, భవనాల అనుమతులకు సంబంధించి తాను సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా, అధికారులు సమాచారమివ్వకుండా గోప్యం ఉంచుతున్నారంటూ కార్పొరేటర్ అంజదుల్లా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే ఫోన్ చేసి సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెల్సింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులకు, దరఖాస్తుదారులకు నిస్పక్షపాతంగా సమాచారమివ్వాల్సిన బాధ్యత అధికారుల లేదా అంటూ ముఖ్యమంత్రి అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెల్సింది.
సమాచార హక్కు చట్టం ప్రకారం మజ్లిస్ ప్రజాప్రతినిధుల ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సదరు కార్పొరేటర్‌కు పదిరోజుల్లో ఇవ్వాలని కూడా ఆదేశించినట్లు తెల్సింది.
ఆర్థిక సమస్యలతో కాంట్రాక్టర్ ఆత్మహత్య!
-- మృతదేహంతో గ్రేటర్ ఆఫీసు ముందు ధర్నా --
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 17: ఆర్థిక సమస్యలు తాళలేక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కాంట్రాక్టర్ ఒకరు ఉరేసుకుని మృతి చెందిన సంఘటన సోమవారం కలకలం సృష్టించింది. చింతల్‌బస్తీలో నివాసముండే రందానీ(44) గత కొద్ది సంవత్సరాలుగా గ్రేటర్‌లో వాహనాల స్పేర్‌పార్ట్స్ కాంట్రాక్టర్‌గా వ్యవహారించేవాడు. అయితే నాలుగేళ్ల క్రితం వాహనాల స్పేర్‌పార్ట్స్‌కి సంబంధించి అక్రమాలు, అవకతవకలు వెలుగుచూడటంతో అప్పటి ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లకు చెల్లింపులను నిలిపివేశారు.
దాదాపు రూ. 40 నుంచి రూ. 50 కోట్ల వరకు స్పేర్‌పార్ట్స్ పేరిట కుంభకోణం జరిగినట్లు గుర్తించిన అధికారులు రాసిన లేఖతో అప్పట్లోనే రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌చే విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో నేటికీ కూడా విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరవై నుంచి ఇరవై అయిదు మంది కాంట్రాక్టర్లకు చెందిన దాదాపు రూ. 40కోట్ల చెల్లింపులు ఎక్కడికక్కడే నిల్చిపోయాయి. వీరిలో ఎక్కువ మంది కాంట్రాక్టర్లు, తమ ఇళ్లను తనఖా పెట్టి, మరికొందరు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టినట్లు తెల్సింది. అయితే గడిచిన కొద్ది రోజులుగా తమ బకాయిలు తమకు చెల్లించాలని కాంట్రాక్టర్లు పలుసార్లు ఉన్నతాధికారులను కూడా కలిసినట్లు తెల్సింది. ఇందులో రందానీ(44) కూడా ఉన్నట్లు తెల్సింది. రందానీ మాత్రం సుమారు రూ. 3కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టినట్లు ఇతర కాంట్రాక్టర్లు వివరించారు. ఈ క్రమంలో తెచ్చిన అప్పులకు నెలకు వడ్డీలు చెల్లించలేక, బకాయిల కోసం గ్రేటర్ కార్యాలయం ప్రదిక్షణలు చేసి అలసిపోయిన రందానీ చివరకు సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెల్సింది. ఈ మేరకు రందానీ మృతదేహానికి పోస్టుమార్టం జరిగినానంతరం రాత్రి ఏడుగంటలకు మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకుని నేరుగా గ్రేటర్ కార్యాలయానికి వచ్చారు. రందాన్ మృతదేహాన్ని కార్యాలయం ముందుంచి ఆయన మృతికి గ్రేటర్ అధికారులే కారణమని ఆరోపించారు. విడిభాగాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారికి సకాలంలో పూర్తి బిల్లులు చెల్లించారని, నిజాయితీగా విడిభాగాలను సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించటం లేదని రందానీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం అదనపు కమిషనర్(ఆరోగ్యం, పారిశుద్ధ్యం) వందన్‌కుమార్‌ను కలిసి మృతదేహాన్ని తీసుకుని వెళ్లినట్లు తెల్సింది.
విచారణ కొనసాగుతోంది!
అదనపు కమిషనర్ వందన్‌కుమార్
గ్రేటర్ వాహనాల విడిభాగాల కోసం కొద్ది సంవత్సరాల క్రితం కొందరు కాంట్రాక్టర్ల నుంచి సామానులను స్వీకరించిన సంగతి వాస్తవమేనని అదనపు కమిషనర్(ఆరోగ్యం, పారిశుద్ధ్యం) వందన్‌కుమార్ వెల్లడించారు. అయితే అప్పట్లో విడిభాగాల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగినట్లు అప్పటి ఉన్నతాధికారులు గుర్తించి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో నేటికీ కూడా విచారణ కొనసాగుతుందని వివరించారు. విచారణ ముగిసి, ఎవరికెంత చెల్లించాలన్న అంశంపై స్పష్టమైన ఆదేశాలొస్తేగానీ తాము పాత బకాయిలు చెల్లించేందుకు అవకాశం లేదని ఆయన వివరించారు.
బంగారు ఆభరణాల దొంగల గుట్టురట్టు
కిడ్నాప్ హైడ్రామాతో పట్టుబడ్డ నిందితులు
బేగంపేట, డిసెంబర్ 17: కోటి 20 లక్షల విలువచేసే బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితులను ఎట్టకేలకు మహంకాళి పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే సోమవారం సాయంత్రం నార్త్‌జోన్ డిసిపి శ్రీకాంత్ విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.
ఈ నెల 7న పాతబస్తీకి చెందిన సమన్‌ఘోష్ అనే బంగారు నగల యజమాని తన వద్ద పనిచేసే సేల్స్‌మెన్‌లు ఏక్‌నాథ్ శివాజీ (21), అనుకుష్ ఇద్దరికీ కోటి 20 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు నగరంలో సికిందరాబాద్ తదితర ప్రాంతాలలో సేల్ చేయడానికి అప్పగించారు. దీనితో ఏకనాథ్ శివాజీ, ప్యారెడైజ్ సమీపంలో 18 రకాల బంగారు ఆభరణాలలో ఒకటి సెలెక్ట్‌చేసి 17ను తిరిగి యజమానికి అప్పగించడానికి వెళ్లకుండా, తరువాత శివాజీ, అనుకుష్ ఇద్దరు స్కూటర్‌పై తిరిగి పరారైనట్లు డిసిపి వెల్లడించారు. దీనితో యజమాని ఫిర్యాదు మేరకు చోరీకి పాల్పడిన విచారణ జరుపగా ఏకనాథ్‌తో చేతులు కలిపిన మరో నలుగురు అనుకూష్‌తోపాటు ఉత్తమ్, సంతోష్, సంతోష్ కులకర్ణిలు చో పాల్పడిన వారిలో ఉన్నట్లు తెలిసింది. వీరంతా కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందినవారు. వీరందరూ ఓల్డ్ సిటీలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తుంటారు. ఏక్‌నాధ్ శివాజీ కిడ్నాప్ హైడ్రామా సృష్టించి మెదక్ జిల్లా చేగుంట పోలీసుస్టేషన్‌లో తనను ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌చేసి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అపహరించినట్లు అక్కడి పోలీసులకు వివరించారు. దీనితో అక్కడి పోలీసులు మహంకాళి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టడంతో చేగుంట పోలీసు స్టేషన్‌వద్ద మహంకాళి పోలీసులు వెళ్లి ఏక్‌నాధ్ శివాజీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపగా బంగారు ఆభరణాలు సంతోష్ అనే వ్యక్తి ఇంట్లో దాచారని, మిగతా కొంత కరుగబెట్టి అమ్మడానికి ప్రయత్నించగా పోలీసులకు చిక్కినట్లు డిసిపి శ్రీకాంత్ తెలిపారు. ఐదుగురిని అరెస్టుచేసి వారివద్దనుండి కోటి 20 లక్షల వివిధ రకాల బంగారు ఆభరణాల స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి వెల్లడించారు. ఈ సందర్భంగా మహంకాళి ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ ఎస్‌ఐ శ్రీనును అభినందించారు. ఈ సందర్భంగా క్రైం సిబ్బంది వెంకటస్వామి, రాజేందర్, బాల వెంకటేశ్వర్లుకు నగదును డిసిపి అందజేశారు. ఈ సమావేశంలో నార్త్‌జోన్ అదనపు డిసిపి నరోత్తంరెడ్డి, మహంకాళి ఎసిపి వాసుసేన, ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణలు పాల్గొన్నారు.
ఎ.ఆర్.కృష్ణ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు ప్రారంభం
ముషీరాబాద్, డిసెంబర్ 17: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్), ఆంధ్రప్రదేశ్ థియేటర్, అక్కినేని గురుకుల అభినయ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ ఎ.ఆర్.కృష్ణ 87వ జయంతిని పురస్కరించుకుని నాలుగు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు సోమవారం సాయంత్రం రవీంద్రభారతి ఆడిటోరియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున న్యూస్టార్స్ మోడరన్ థియేటర్స్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఎంఎస్ చౌదరి రచన, దర్శకత్వంలో రూపొందించిన ‘మైనేమ్ ఈజ్ గాంధీ’, బి.వి.ఆర్ కళాకేంద్రం తాడేపల్లి గూడెం వారి ఆధ్వర్యంలో ‘జోస్‌మేరీ రచన’, టి.వి.ఎం కృష్ణరావు దర్శకత్వంలో రూపొందించిన ‘టెక్ట్స్‌బుక్’ నాటికలను ప్రదర్శించారు. తొలుత జరిగిన సభా కార్యక్రమంలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా.సి. నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ నాటక రంగంపై అపార ప్రయోగాలు చేసిన ఎ.ఆర్. కృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి.రమణమూర్తి, అభినవ భరతాచార్య డా.చాట్ల శ్రీరాములు, నాటక ప్రయోక్త దుగ్గిరాల సోమేశ్వరరావు, సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ప్రొ.వెలగపూడి ప్రకాశరావు, రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ, డా. గజల్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగస్థల ప్రముఖులు సీతారమయ్య, ప్రసాదరెడ్డిలకు ఎ.ఆర్.కృష్ణ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేసి సత్క రించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త వై.కె.నాగేశ్వరరావు, అక్కినేని గురుకులం వ్యవస్థాపకులు దీక్షిత్ డి.ఎస్‌లు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల ధర్నా
ఖైరతాబాద్, డిసెంబర్ 17: దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ రేషన్ డీలర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయం ముందు సోమవారం డీలర్లు ధర్నా నిర్వహించారు. సుమారు 200 మంది రేషన్ డీలర్లు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పౌరసరఫరాల శాఖకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ధరించి నినాదాలు చేశారు.
అక్కడే భారీగా మోహరించిన ఉన్న పోలీసులు వారిని సముదాయించి వారి బృందాన్ని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల వద్దకు పంపారు. ఈ బృందం వారి 32 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని శాఖ కమిషనర్‌కు అందజేసారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గౌతంచందు జైన్, సెక్రెటరీ వెంకటరమణలు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలవల్ల రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రేషన్ డీలర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, డీలర్ చనిపోతే 21 వేల రూపాయలు దహన సంస్కారాలకు ఇవ్వాలని, డీలర్లందరికీ రూ. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్‌తో పాటు ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. డీలర్లు సరుకులను నిల్వ చేయడానికి వేలల్లో అద్దెలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ భూముల్లో దుకాణాలను ఏర్పాటుచేయాలని, రేషన్ షాపుల్లో హెల్పర్ జీతాన్ని మహాత్మగాంధీ రోజ్‌గార్ యోజన పథకం క్రింద చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి డీలర్లకు చాలా కాలంగా రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని, సర్వీస్ చార్జీలను తీసుకునే విధంగా అవకాశం కల్పించాలని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
సామాజిక సేవే లక్ష్యం: జయసుధ
తార్నాక, డిసెంబర్ 17: సేవా కార్యక్రమాలు తనకు సంతృప్తి సంతోషాన్ని కలిగిస్తాయని సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ పేర్కొన్నారు. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఉదయం గాంధీ ఆసుపత్రికి వచ్చి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఒక రోగికి సపర్యలు చేసి కొద్దిసేపు నర్సుగా సేవలందించి, రోగితో ముచ్చటించారు. అనంతరం నామాలగుండులోని రామాలయంలో ఆంజనేయస్వామి విగ్రహప్రతిష్ట కార్యక్రమానికి ఎంపి అంజన్‌కుమార్ యాదవ్‌తో కలిసి హాజరయ్యారు. అటునుంచి నేరుగా దక్షిణ మధ్య రైల్వే ఎంప్లారుూస్ సంఘ్ ఎన్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్యను కలిశారు. అనంతరం బోయిగూడ వద్ద దర్గాను, చర్చిని సందర్శించి ప్రార్థనలు జరిపారు. అటునుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలతో పుట్టినరోజు వేడుకల్లో పాలుపంచుకున్నారు. కాగా గాంధీ ఆసుపత్రి వద్ద మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, పిసిసి కార్యదర్శి బండ చంద్రారెడ్డిలు ఆమెను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మెట్టుగూడ కార్పొరేటర్ ఎం.ఆర్.శ్రీనివాస్‌తోపాటు పలువురు కార్పొరేటర్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జయసుధకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేసే అదృష్టం కలిగిందని అన్నారు.
కార్మికుల హక్కుల సాధనలో విఫలమైన ఎన్‌ఎంయును ఓడించాలి
ఘట్‌కేసర్, డిసెంబర్ 17: కార్మిక హక్కులను కాపాడటంలో విఫలమైన ఎన్‌ఎంయును ఓడించి ఎంప్లాయిస్ యూనియన్, టిఎంయులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టిఎంయు చీఫ్ అడ్వయిజర్ చర్లకోల కృష్ణారెడ్డి అన్నారు. ఆర్టీసి ఉప్పల్ డిపో ఆవరణలో సోమవారం జరిగిన ఆర్టీసి గుర్తింపు ఎన్నికల బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసి కార్మికులకు ఎన్‌ఎంయు దివంగత నేత రాంమోహన్‌రావు నేతృత్వంలో సంపూర్ణ న్యాయం జరిగినట్లు ఆయన తెలిపారు. ఆయన మరణాంతరం ఒరగబెట్టింది ఏమీలేదని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికలలో ఇ యు, టిఎంయులను గెలిపించి కార్మికుల సమస్యల సాధనకు శ్రీకారం చుట్టాలని ఆయన అన్నారు. ఎన్‌ఎంయు నేతలు తమ స్వార్ధం కోసం మాత్రమే పని చేస్తున్నాయి తప్ప కార్మికుల పరిరక్షణ కోసం కాదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రాంత కార్మికులను నిర్లక్ష్యం చేసిన నాగేశ్వర్‌రావుకు గుణపాఠం తప్పదన్నారు. కార్మికులకు ఉద్యోగ రక్షణ, అత్యధిక వేతనాల సాధనకు భారీ మెజారిటితో గెలిపించాలని ఆయన కోరారు. బహిరంగ సభలో ఎంప్లాయిస్ యూనియన్ డిపో గౌరవాధ్యక్షుడు విబిబాల్‌రాజు, టిఎంయు గౌరవాధ్యక్షుడు దర్గ దయాకర్‌రెడ్డి, టిఎంయు రాష్ట్ర కార్యదర్శి ఎన్.దామోదర్, నాయకులు బుచ్చిరెడ్డి, సాయిలు, శ్రీహరి, ఆర్ యాదగిరి, పి ఎల్ ఎన్ రెడ్డి, ఇయు డిపో కార్యదర్శి ఎన్ కృష్ణయ్య తదితరులు పాల్గోన్నారు.
వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంపై అధికారుల పక్షపాతం
జీడిమెట్ల, డిసెంబర్ 17: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్టపై 30 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం విషయంలో మండల రెవెన్యూ అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి విశ్వకర్మ కులస్థులు చందాలు వేసుకుని అభివృద్ధి చేసుకుంటుంటే చీటికి మాటికి రెవెన్యూ సిబ్బంది వచ్చి కూల్చివేస్తామని బెదిరిస్తుండడం పరిపాటిగా మారింది. అంతేకాకుండా సోమవారం సాయంత్రం ఆలయాన్ని కూల్చేందుకు భారీ ఎత్తున రెవెన్యూ సిబ్బంది జేసిబీతో పాటు సిబ్బందిని తీసుకుని వచ్చారు. కాగా విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఏ కూన శ్రీశైలంగౌడ్, కార్పొరేటర్ జగన్‌లతో పాటు ఇతర పార్టీల నాయకులు అక్కడికి చేరుకుని అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాల క్రితం వెలసిన తమ ఆలయాన్ని అభివృద్ధి చేస్తుంటే అధికారులు తమను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గుట్టపై సుమారు ఎకరాల కొద్దీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇతర రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి వచ్చి ఆలయాలను నిర్మిస్తే అలాంటి వారిని చూసిచూడనట్లుగా వ్యవహరిస్తూ తమ ఆలయం పట్ల పక్షపాతం వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చూపిస్తాం
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 17: రానున్న ఎన్నికలో తెలుగుదేశం పార్టీ సత్తాచూపిస్తామని నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న మీకోసం యాత్రలో చంద్రబాబు సమక్షంలో కుత్బుల్లాపూర్ కార్పొరేటర్ వెంకటేశ్వర్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు కేక్‌కట్ చేసి, వెంకటేశ్వర్‌రావుకు తినిపించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈసందర్భంగా బాబు మాట్లాడుతూ వెంకటేశ్వర్‌రావు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆశీర్వదించారు. నగదు బదిలీ పథకం బూటకమన్నారు. ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ నగదు బదిలీ పథకంతో రాజకీయం చేస్తుందని విమర్శించారు. వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ, పార్టీకి కార్యకర్తలే కొండంత అండ అన్నారు. మీకోసం యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారంటే రానున్నది తెలుగుదేశం పార్టీ అన్నారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతానన్నారు. గణేష్‌నగర్‌లోని తన నివాసంలో వెంకటేశ్వర్‌రావు జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, సుబ్బారావు అభిమానులు పాల్గొన్నారు.
గ్రామ స్థాయిలో టిఆర్‌ఎస్‌ను పటిష్టం చేస్తాం: హరీశ్వరరెడ్డి
పరిగి, డిసెంబర్ 17: గ్రామ స్థాయిలో టిఆర్‌ఎస్ పార్టీని భలోపితం చేస్తామని పరిగి శాసన సభ్యులు కె. హరీశ్వరరెడ్డి అన్నారు. కుల్కచర్ల మండలం పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కమిటీలు వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వచ్చే లాభం గూర్చి ప్రతి గ్రామంలోని ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పి.రాజు, సునందయాదవ్, హరిక్రిష్ణ, నాగరాజు, సుధాకర్‌రెడ్డి , కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతి గర్వించదగ్గ మహాకవి సినారే
ముషీరాబాద్, డిసెంబర్ 17: ఆధునిక తెలుగు కవిత్వ రంగంలో తమ అసమాన కావ్య సృజనతో మహోన్నత స్థానానికి చేరుకున్న డా.సి.నారాయణరెడ్డి జాతి గర్వించదగిన మహాకవి అని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డికి విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారం క్రింద లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో ఆయనను ఘనంగా సత్కరించారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ కవిగా, వ్యాఖ్యాతగా, వక్తగా, పరిశోధకుడుగా తెలుగు సంస్కృతికి నిలువెత్తు పతాకగా వున్న డా.సి.నారాయణరెడ్డికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ఇచ్చి ధన్యమైందన్నారు. పద్మభూషణ్ డా.కె.ఐ వరప్రసాదరెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ తెలుగు భాషా సంస్కృతులను మనం పరిరక్షించవలసిన అవసరం లేదని, అవే తమకు తాము పరిరక్షించుకుంటాయని అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం స్వాగతోపన్యాసం చేయగా అకాడమీల విభాగం ఇన్‌చార్జి డా.జె.చెన్నయ్య ప్రశంసాపత్రం చదివారు. సభానంతరం కూచిపూడి నుంచి విచ్చేసిన డా.వేదాంతం రామలింగశాస్ర్తీ బృందం భక్త ప్రహ్లాద కూచిపూడి యక్షగానాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.