కరీంనగర్, డిసెంబర్ 18: ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ రాజకీయం చేయొద్దని, వెంటనే ఏదో ఒకటి తేల్చేయాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం రాత్రి ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ 2009కి ముందే స్పష్టంగా లేఖ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ అంశాన్ని సాకుగా చేసుకొని తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలన్న కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పేదల పార్టీగా సామాజిక న్యాయాన్ని అనుసరిస్తున్న టిడిపిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తొమ్మిదేళ్ల పాలనలో దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే జగన్, కాంగ్రెస్ నేతలు మళ్లీ అధికారం కోసం ప్రాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అంశాన్ని టిఆర్‌ఎస్ నేతలు తమ స్వప్రయోజనాలకోసం వాడుకుంటూ రాజకీయంగా ఉద్యోగాలు పొందుతున్నారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే వస్త్రాలపై ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను రద్దు చేస్తానని, అంతేకాకుండా ఉద్యోగుల కోసం త్వరలోనే ఉద్యోగ పాలసీని ప్రకటించడంతో పాటు అధికారంలోకి వచ్చాక స్థలాలు ఉచితంగా ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. సకలజనుల సమ్మెలో ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తాను ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో, దేశంలో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ఏకైక పార్టీ టిడిపి మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో బిసి డిక్లరేషన్‌కు అనుగుణంగా వంద సీట్లు కేటాయించడంతో పాటు ప్రత్యేక ఉపప్రణాళిక ద్వారా ఐదేళ్లలో 50 వేల కోట్లు వారి అభ్యున్నతికి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.
* ‘తెలంగాణ’పై చంద్రబాబు
english title:
m
Date:
Wednesday, December 19, 2012