విశాఖపట్నం, డిసెంబర్ 18: నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం అడుగుపెడుతున్నారు. 2011 జనవరి 25వ తేదీన కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ ఏజెన్సీకి వచ్చారు. తిరిగి ఇప్పుడు ఇందిరమ్మబాట కార్యక్రమం కోసం విశాఖ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి పర్యటనలో మూడోరోజు బుధవారం పాడేరు వెళుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నక్సల్స్ ప్రభావం ఓ పక్క, మరో పక్క ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల అనుమతులను రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష పార్టీలు బుధవారం ఏజెన్సీ బంద్‌కు పిలుపునివ్వటం పోలీసులకు సవాలుగా మారాయి. ఏజెన్సీలో బక్సైట్ తవ్వకాల వ్యతిరేకంగా అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ, అధికార పక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులు తమతమ పదవులకు ఏనాడో రాజీనామా చేశారు.
బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న నక్సల్స్ చేతిలో కొద్ది మంది ప్రజా ప్రతినిధులు ప్రాణాలు కూడా కోల్పోయారు. అన్నింటికీ మించి, అధికార పార్టీకి చెందిన కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేయాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికే లేఖ రాశారు. గవర్నర్‌ను తన విశేష అధికారాలను ఉపయోగించి నిర్ణయం తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జనవరిలో అరకులో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన మినీ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరపరాదంటూ తీర్మానించారు కూడా. అరకు డిక్లరేషన్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇంత జరిగినా కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. జిల్లాకు వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ విషయమై విలేఖరులు ప్రశ్నించినప్పుడు ఇప్పటికిప్పుడు బాక్సైట్‌పై నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. ఏజెన్సీకి వచ్చే ముందే బాక్సైట్‌పై సిఎం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ అఖిలపక్ష పార్టీలు పట్టుపట్టాయి. వాళ్లడిగితే, నేను ఎందుకు ప్రకటన చేయాలంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి మంకుపట్టుతో ఉన్నారు. దీంతో పర్యటన రోజైన బుధవారం ఏజెన్సీ బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఇప్పటికే ఏజెన్సీకి భారీగా పోలీసు బలగాలను తరలించారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వారిని ముందుగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు వ్యూహం రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభలోకి ఏవిధంగానైనా ఆందోళనకారులు చొరబడి, నిరనస తెలియచేయాలని ప్రయత్నిస్తున్నారు. పోలీసుల వ్యూహానికి అఖిలపక్ష నాయకులు ప్రతి వ్యూహం వేస్తున్నారు. సభకు జనం రాకపోతే, ముఖ్యమంత్రి చిన్నబుచ్చుకుంటారని అధికారులు ఆందోళన చెందుతుంటే, జనం వస్తే గలాటా జరుగుతుందని పోలీసులు భయపడుతున్నారు.
ఉద్రిక్తతల మధ్య నేడు పర్యటన *మన్యం బంద్‌కు అఖిలపక్షం పిలుపు
english title:
cm
Date:
Wednesday, December 19, 2012